
అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌ను కాంగ్రెస్ అడ్డుకోగలదా?
ప్రతిపక్షాలతో పొత్తు - అట్టడుగు స్థాయిలో పార్టీ బలోపేతానికి వ్యూహం - మైనార్టీ ప్రాంతాల్లో రాహుల్ పర్యటన - అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రియాంక..
ఈ ఏడాది నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్లలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు ఇటీవల సమావేశమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎదురైన వరుస పరాజయాల నేపథ్యంలో.. పార్టీ తిరిగి నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. హర్యానా, మహారాష్ట్ర (2024), ఢిల్లీ, బీహార్ (2025) ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీని కుంగదీశాయి. ఈ పరిస్థితుల్లో 2026 ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ పునరుజ్జీవనానికి కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.
అస్సాం(Assam) అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ(BJP), కాంగ్రెస్(Congress)కు మధ్య ప్రత్యక్ష పోటీ ఉండబోతుంది. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓటమి పాలైంది. అయితే 2026లో మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. హ్యాట్రిక్ కొట్టే అవకాశం బీజేపీకి ఇవ్వకూడదని కాంగ్రెస్ గట్టిగా నిర్ణయించుకుంది.
అస్సాం గత ఎన్నికలలో కాంగ్రెస్ బలం..
మొత్తం అసెంబ్లీ సీట్లు: 126 (ప్రభుత్వ ఏర్పాటుకు 64 అవసరం)
2021: కాంగ్రెస్ – 29 | బీజేపీ – 60
2016: కాంగ్రెస్ – 26 | బీజేపీ – 60
2011: కాంగ్రెస్ – 78 | బీజేపీ – 5
2006: కాంగ్రెస్ – 53 | బీజేపీ – 10
2001: కాంగ్రెస్ – 71 | బీజేపీ – 8
ఈసారి కేవలం పొత్తులతో సరిపెట్టకుండా.. అట్టడుగు స్థాయి నుంచి పార్టీకి బలోపేతం చేయడంపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఎన్నికల పరిశీలకులుగా సీనియర్లు..
గెలుపే లక్ష్యంగా పార్టీ సీనియర్ల సలహాలు తీసుకుంటోంది. అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్‌పర్సన్‌గా వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రాను నియమించింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్, జార్ఖండ్ మాజీ మంత్రి బంధు టిర్కీ వంటి అనుభవజ్ఞులను ఎన్నికల పరిశీలకులుగా నియమించింది.
రాహుల్ యాత్రకు ప్లాన్..
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో అస్సాంలో యాత్ర చేపట్టాలని పార్టీ భావిస్తోంది. గతంలో ఆయన నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’కు వచ్చిన స్పందనను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
పొత్తులు, సీట్ల పంపకం.
అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో 100 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని డిసెంబర్‌లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రకటించారు. బీజేపీని ఓడిచేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలతో కలిసి కూటమి ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. రైజోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్, వామపక్ష పార్టీలతో ఎన్నికలకు ముందు పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. AIUDF (బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ) జతకట్టేందుకు ఇష్టపడడం లేదు. టిక్కెట్ల పంపిణీలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.
ప్రచార యాత్రలు, కార్యకర్తలతో సమావేశాలు..
అస్సాంలో తన పట్టు పెంచుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు, ప్రచార యాత్రలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. జనవరి 16న ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాహుల్ గాంధీ, కె.సి. వేణుగోపాల్, రాష్ట్ర నాయకులు, పరిశీలకులు పాల్గొన్నారు.
జనవరి 21 నుంచి 28 వరకు అస్సాంలో జోనల్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ఇదే సమావేశంలో నిర్ణయించారు. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రచార యాత్రలు చేపట్టాలని, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై అవినీతి ఆరోపణలపై ప్రచారం చేయాలని చెప్పినట్లు సమాచారం.
రెజాల్ కరీం సర్కార్ వివాదం
అస్సాంలో పార్టీ వ్యూహాలపై జరిగిన సమావేశాల్లో ఇటీవల చోటుచేసుకున్న రెజాల్ కరీం సర్కార్ వివాదం కూడా చర్చకు వచ్చింది. జనవరి 11న ఆయన కాంగ్రెస్‌లో చేరినా, జనాభా మార్పులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కేవలం మూడు రోజుల్లోనే పార్టీని వీడాల్సి వచ్చింది. ఈ ఘటన మైనారిటీ యువ నాయకులను చేరువ చేసుకునే కాంగ్రెస్ వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తింది.
మైనార్టీ ప్రాంతాల్లో రాహుల్ ప్రచారం..
ఈ ఎదురుదెబ్బను అధిగమించేందుకు.. రాహుల్ గాంధీతో మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని పార్టీ నిర్ణయించింది. అస్సాంలో ముస్లిం ఓట్లు చీలిపోకుండా కాపాడుకోవడమే కాకుండా.. హిందూ ఓట్లను కూడా ఆకర్షించాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది.
మొత్తంగా 2026 అస్సాం ఎన్నికలను కాంగ్రెస్ తన రాజకీయ పునరాగమనానికి కీలక మలుపుగా భావిస్తోంది. పూర్తి స్థాయిలో సమరానికి సిద్ధమవుతోంది.

