
ఏకమవుతున్న ఎన్‌సీపీ రెండు వర్గాలు ?
పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కలిసి పోటీ..
నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో రెండు వర్గాలు మళ్లీ ఏకం కావాలని పార్టీ కార్యకర్తలు, నేతలు కోరుకుంటున్నారని మహారాష్ట్ర(Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) తెలిపారు. పవార్ కుటుంబంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న విభేదాలు పూర్తిగా పరిష్కారమయ్యాయని ఆయన స్పష్టం చేశారు. అజిత్ NDTVతో మాట్లాడుతూ.. ఎన్‌సీపీ విభజన పార్టీ కేడర్‌ను గందరగోళానికి గురి చేసిందని, ఫలితంగా కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పారు. “పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలంటే ఐక్యత అవసరం. ఇది కేవలం నేతల నిర్ణయం కాదు. కార్యకర్తల నుంచి వస్తున్న గట్టి అభ్యర్థన” అని అజిత్ పేర్కొన్నారు.
2023లో ఎన్‌సీపీలో చీలిక ఏర్పడిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం ఎన్డీఏ ప్రభుత్వంలో చేరగా, శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం ప్రతిపక్షంగా కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ పేరు, ఎన్నికల గుర్తు విషయంలోనూ న్యాయపోరాటం జరిగింది. అజిత్ పవార్ పార్టీ పేరు, 'గడియారం' గుర్తును దక్కించుకున్నారు. అయితే శరద్ పవార్ వర్గానికి NCP (శరద్చంద్ర పవార్) గా పేరు మార్చారు. కొత్త గుర్తు ట్రంపెట్‌ను కేటాయించారు.
జనవరి 15 జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పింప్రి చించ్వాడ్ మున్నిపాలిటీలో రెండు వర్గాలు కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి.
పుకార్లను తోసిపుచ్చిన సుప్రియా సూలే..
పార్టీ కార్యకర్తల అభ్యర్థన మేరకు రెండు వర్గాలు కలిసి పింప్రి-చించ్‌వాడ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్ బంధువు, లోక్‌సభ ఎంపీ సుప్రియా సులే కూడా NDTVకి తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్‌సిపి (ఎస్పీ) చేరడం లేదా మంత్రి పదవి చేపట్టడం గురించి వస్తున్న ఊహాగానాలను ఆమె తోసిపుచ్చారు.

