ముర్షిదాబాద్‌లో మరో బాబ్రీ మసీదు..
x

ముర్షిదాబాద్‌లో మరో బాబ్రీ మసీదు..

శంకుస్థాపనకు గట్టి బందోబస్తు; ఆరోపణలు, ప్రత్యారోపణల్లో బీజేపీ, కాంగ్రెస్..


Click the Play button to hear this message in audio format

తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్(Humayun Kabir) శనివారం (డిసెంబర్ 6) బాబ్రీ మసీదు తరహాలో నిర్మించనున్న ఓ మసీదుకు శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ (Murshidabad) జిల్లాలోని రెజినగర్‌లో దీన్ని నిర్మించనున్నారు. శంకుస్థాపన సందర్భంగా మతాధికారులతో కలిసి హుమాయున్ రిబ్బన్‌ కత్తిరించారు. "మతతత్వ రాజకీయాలకు" పాల్పడుతున్నాడన్న కారణంతో డిసెంబర్ 4న హుమాయున్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీఎంసీ. కాగా హుమాయూన్‌‌ గతంలో కాంగ్రెస్‌, తర్వాత బీజేపీలో ఉన్నారు.


గట్టి భద్రత మధ్య శంకుస్థాపన..

కోర్టు ఆదేశాలతో శంకుస్థాపన కార్యక్రమానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారించింది. రాజ్యాంగం ప్రకారం ప్రార్థన కోసం మసీదు నిర్మించుకోవడం తమ హక్కు అని, మసీదుతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం ఆసుపత్రి, విద్యా సంస్థ, అతిథి గృహాన్ని కూడా నిర్మించనున్నామని హుమాయున్ తరుపు లాయర్ వాదించారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కోర్టు పేర్కొనడంతో శంకుస్థాపన కార్యక్రమంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు.


‘ముస్లింలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు’

శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా హుమాయున్ ప్రసంగిస్తూ.. 2011 నుంచి శాసనసభకు టీఎంసీ తగినంత మంది ముస్లిం ప్రతినిధులను నామినేట్ చేయలేదని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కనీసం 90 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. కాగా హుమాయున్ ప్రసంగం రాజకీయ దుమారం రేపింది. టీఎంసీ ప్రజలను చీల్చిందని బీజేపీ(BJP) ఆరోపించగా.. ఆ వాదనలను టీఎంసీ తోసిపుచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం హుమాయున్ సీఎం మమతా బెనర్జీ పావుగా వాడుకుంటోందని బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ మాల్వియా ఆరోపించారు. "మసీదు నిర్మాణం కేవలం మతపర ప్రయత్నం కాదు. రాజకీయ ప్రయత్నం. భావోద్వేగాలను రెచ్చగొట్టి, ఓటు బ్యాంకును సంఘటితం చేయడానికి రూపొందించిన పథకం." అని పేర్కొన్నారు.

మరో బీజేపీ సీనియర్ నాయకుడు దిలీప్ ఘోష్ హుమాయున్ వ్యవహారాన్ని "ఓటు బ్యాంకు రాజకీయాలు"గా అభివర్ణించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో అధికార పార్టీ టీఎంసీ మతపర భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే అశాంతిని సృష్టించడానికే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ హుమాయున్‌తో ఈ కార్యక్రమం చేయిస్తుందని టీఎంసీ ఎదురుదాడికి దిగింది.

Read More
Next Story