
కూటమి వైఫల్యాలపై వైఎస్సార్సీపీ సమరం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు.. పోరాటం సక్సెస్ అవుతుందా?
ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం ప్రకటించింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు, బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై స్థానికుల వ్యతిరేకత, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం వంటి అంశాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇది ప్రభుత్వానికి సవాల్ విసరడమే కాదు, ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ బలోపేతానికి మొదటి అడుగు. కానీ ఈ పోరాటం ప్రజల మద్దతు పొంది సక్సెస్ అవుతుందా? లేదా రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా? అనేది విశ్లేషకుల ప్రశ్న.
ఉత్తరాంధ్రకు ఏమి చేశారు?
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ ఆదివారం విశాఖలో నిర్వహించిన సమావేశంలో కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. "15 నెలల పాలనలో ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ కూడా తేలేదు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటైన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్ చేసి, మీడియా పబ్లిసిటీ చేసుకుంటున్నారు" అని ఆరోపించారు. వంశధార, జంఝావతి, సుజల స్రవంతి వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అటకెక్కాయని, ఒడిశా ప్రభుత్వంతో చర్చలు జరిపి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో విలువైన భూములను కార్పొరేట్లకు చౌకగా కట్టబెట్టి, అమరావతి అభివృద్ధికి లక్ష కోట్ల అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటీవల వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన
మెడికల్ కాలేజీల పిపిపి మోడ్ కు వ్యతిరేకంగా...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో 17 మెడికల్ కాలేజీల పనులు ప్రారంభించి 7 పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తుందని ఆరోపణలు వచ్చాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజీకి రూ. 500 కోట్లు కేటాయించిన జీవోను చూపిస్తూ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపణలను ఖండిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, బల్క్ డ్రగ్ పార్కుపై మత్స్యకారుల వ్యతిరేకతను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖలో హాకర్ల దుకాణాల తొలగింపు, ఆటో డ్రైవర్లకు అరకొర సాయం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
అబద్ధాలతో ప్రతిపక్షం రాజకీయమా?
కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఆరోపణలను తోసిపుచ్చుతోంది. పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీలను రెండేళ్లలో పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెబుతోంది. "వైఎస్సార్సీపీ హయాంలో మెడికల్ కాలేజీలు కట్టకుండా అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు పీపీపీతో వాస్తవాలు చెప్పాలనుకుంటున్నామని టీడీపీ విమర్శిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో చర్చలు జరుపుతున్నామని, ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నామని సమర్థిస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, స్థానికుల భయాలను నివృత్తి చేస్తామని చెబుతున్నారు.
పోరాటం సక్సెస్ అవుతుందా?
వైఎస్సార్సీపీ పోరాటం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆరంభంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వంటి అంశాలు పేదల వైద్య సేవలను ప్రభావితం చేస్తాయి. ప్రభుత్వ ఆలోచనలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్కు వంటి సమస్యలు స్థానిక మత్స్యకారులు, కార్మికుల మద్దతు పొందే అవకాశం ఉంది. జగన్ సందర్శనలు ప్రజలతో నేరుగా కనెక్ట్ అవడానికి సహాయపడతాయి. బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు వచ్చిన బీసీవై పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్ ను ఆదివారం రాజమహేంద్రవరంలో పోలీసులు నిర్బంధించారు. జగన్ పర్యటన పోలీసులను దాటి ఎలా వెళుతుందో చూడాల్సి ఉంది.
రాజకీయంగా ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుందో సందేహమే. కూటమి ప్రభుత్వం పీపీపీని అభివృద్ధి మోడల్‌గా చూపిస్తూ, వైఎస్సార్సీపీ హయాంలోని లోపాలను హైలైట్ చేస్తోంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒడిశా సమస్యల వల్ల ఆలస్యమవుతున్నాయని, భూముల కేటాయింపు ఉపాధి సృష్టికి అవసరమని వాదిస్తున్నారు. సామాజికంగా, ఉత్తరాంధ్రలో గిరిజనులు, మత్స్యకారులు ప్రభావితమవుతున్నప్పటికీ, ప్రభుత్వం ప్రచార ఆడంబరాలతో (ఆటో డ్రైవర్ల సాయం వంటివి) ప్రజలను మభ్యపెట్టే అవకాశం ఉంది.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆర్థిక నష్టానికి దారితీస్తుందా?
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుందని విశ్లేషకులు అంటున్నారు. వైఎస్సార్సీపీ ని బలోపేతం చేసుకుంటూ గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తుంటే, ఇది దీర్ఘకాలిక పోరాటానికి సంకేతం. ప్రజల అసంతృప్తి ఎన్నికల వరకు కొనసాగితేనే సక్సెస్ అయినట్లే. లేకపోతే ఇది కేవలం రాజకీయ ఆరోపణలుగా మిగిలిపోతుంది. ప్రభుత్వ స్పందన ఏ కోణంలో ఉంటుందో చూడాలి. వైఎస్సార్సీపీ పోరు మరింత ఊపిరి పోసుకోవాలంటే ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు నడిపించాలి.