వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో రాతల గారడీ
x

వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల మ్యానిఫెస్టో రాతల గారడీ

వైఎస్‌ఆర్‌సీపీ మ్యానిఫెస్టోలో పెద్ద మార్పులేమీ లేవు. గతంలో అమలు చేసిన పథకాలనే కొనసాగిస్తామని కొత్త మాటల్లో చెప్పారు.


వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం విడుదల చేసిన వైఎస్‌ఆర్‌సీపీ 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో రాతల్లో కొత్తదనం తప్ప గత మ్యానిఫెస్టోనే కొనసాగిస్తున్నట్లు చెప్పొచ్చు. నవ రత్నాలు యథాతంగా అలమలు చేస్తామని హామీ ఇచ్చారు.

విచిత్రం ఏమిటంటే గత ఐదేళ్ల కాలంలో చేసిన సహాయం, రానున్న ఐదేళ్ల కాలంలో చేయబోయే సాయం గురించి చెబుతూ గతం ఇచ్చిన దానిని రానున్న రోజుల్లో ఇవ్వనున్న దాంతో కలిపి మొత్తం ఇంత ఇస్తున్నామని చెప్పడం విశేషం. ఉదాహరణకు చేయూత పథకాన్ని తీసుకుంటే ఏడాదికి రూ. 18,750 చొప్పున నాలుగేళ్లలో రూ. 75వేలు ఆర్థిక సాయం కింద మహిళలకు అందించారు. ఇకపై రూ. 1.50లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందని మ్యానిఫెస్టోలో పేర్కొనడం వింతగాను, విడ్డూరంగాను ఉందని చెప్పొచ్చు. మొత్తంగా 8 విడతల్లో రూ. 1.50లక్షలు లబ్ధి చేకూరుతుందని చెప్పడం ఏమిటి?. ఈ పథకాన్ని రానున్న ఐదేళ్లు కూడా కొనసాగిస్తారు. ఇది చెప్పాల్సిన విషయం. కానీ తిమ్మిని బమ్మిని చేస్తూ గత ఐదేళ్లల్లో ఇచ్చిన దానిని కూడా కలిపి రూ. 1.50లక్షలు ఇస్తున్నామని చెప్పి, గత ఐదేళ్లల్లో రూ. 70వేలు ఇస్తే రానున్న ఐదేళ్లల్లో మరో రూ. 75వేలు కలిపి రూ. 1.50లక్షలు ఇస్తారేమనని లబ్ధిదారులు బ్రమపడుతున్నారు. కొందరైతే వాదనకు దిగుతున్నారు కూడా. మీరు కావాలంటే మ్యానిఫెస్టోను చూసుకోండని ఎదురు ప్రశ్నలకు దిగుతున్నారు. ఇలా రంగు పూసిన అక్షరాల్లో ఒకటి, రంగు పూయని అక్షరాల్లో మరొకటి చెప్పడం ఓటర్లను కన్‌ఫ్యూజ్‌ చేయడమేనని మ్యానిఫెస్టోను అవపోసన పట్టిన వారు విశ్లేషిస్తున్నారు. పించన్లను ప్రస్తుతం రూ. 3వేలు ఇస్తుండగా దానికి రూ. 3,500లకు పెంచుకుంటూ పోతామన్నారు. ఈ పెంపుదల ఎప్పటి నుంచి అంటే 2028లో రూ. 250, 2029లో మరో రూ. 250 పెంచుతారు. విచిత్రం ఏమిటంటే పెన్షనర్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించామని, చెబుతున్నా ఆచరణలో అది అమలు కావడం లేదు. ఇక వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం, వైఎస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం, వైఎస్‌ఆర్‌ ఆసరా, మహిళా సాధికారత, పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్లు, పట్టణ గృహనిర్మాణం, మత్స్యకార భరోసా, లా నేస్తం, చేనేత కార్మికులకు సహాయం, యువత, ఉపాధి, విద్యారంగం, వ్యవసాయ రంగం, వైద్య రంగానికి సంబంధించి గతంలో ఉన్న పథకాలు కొనసాగుతాయి.
అమ్మ ఒడి కింద 2వేలు పెంపు
జగనన్న అమ్మ ఒడి పథకానికి రూ. 15వేల నుంచి రూ. 17వేలు ఇస్తామని చెబుతున్నారు. అయితే అందులో రూ. 2వేలు పాఠశాల మెయింటెనెన్స్‌కు తీసుకుంటుంది. తల్లికి అందేది రూ. 15వేలు మాత్రమే. రైతు భరోసా ద్వారా రూ. 13,500 చొప్పున ఏడాదికి ఆర్థిక సాయం అందుతోంది. దీనిని రూ. 16వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అంటే రూ. 2,500 గతం కంటే అధనంగా ఇస్తారు.
ప్రాజెక్టుల పూర్తి సాధ్యమేనా?
ప్రాజెక్టులపై ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మాలో నమ్మ కూడదో తెలియడం లేదు. ఐదేళ్లు గడచి పోయాయి. పోలవరం ప్రాజెక్టును రానున్న ఐదేళ్లల్లో పూర్తి చేస్తామంటున్నారు. ఇది నమ్మ శఖ్యం కాని మాటగానే మిగిలిపోయే అవకాశం ఉంది. పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదలు పెట్టిన ఇళ్ల నిర్మాణాలు రానున్న ఐదేళ్లల్లో పూర్తి అవుతాయనేది కూడా సందేహమే. రాజధాని విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఏమి చెబుతోందో అదే మాటను మ్యానిఫెస్టోలో ప్రస్తావించారు.
మూడు రాజధానులు
2024లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పడం విశేషం. జలయజ్ఞం జలం లేని యజ్ఞంగా మారిందని చెప్పొచ్చు. కాపుల సంక్షేమం అంటూ ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వంలో కీలక పదవులు ఇచ్చామని చెప్పుకోవడం కూడా విశేషమే. మ్యానిఫెస్టో అంతా రానున్న ఐదేళ్లలో పలానా చేస్తామని చెప్పడం కంటే గడచిన ఐదేళ్లల్లో పలానా పని చేసామని చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు.
Read More
Next Story