పరారీలో వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లు
x

పరారీలో వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్లు

సోషల్‌ మీడియా కేసులు వైఎస్‌ఆర్‌సీపీలో కలకలం రేపుతున్నాయి. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో సోషల్‌ మీడియా కేసులు సంచలనంగా మారాయి. వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసులు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తక్కిన ప్రాంతంలో కంటే కడప జిల్లాలోనే అధిక కేసులు నమోదవుతున్నాయి. అందులో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లకు పోలీసులు 41–ఏ నోటీసులు జారీ చేశారు. జిల్లా కన్వీనర్‌ వివేకానందరెడ్డి, కో–కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్‌లకు కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో వీరు ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. వీరి కోసం ఇప్పుడు పోలీసులు గాలింపులు చేపట్టారు. వర్రా రవీందర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు వీరికి నోటీసులు జారీ చేశారు. శనివారం ఆ నలుగురి ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. వర్రా రవీందర్‌రెడ్డి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు జిల్లా కన్వీనర్‌ వివేకానందరెడ్డితో పాటు కో–కన్వీనర్లు సునీత, నిశాంత్, వరకుమార్‌లు పరారీలో ఉన్నారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు, మంత్రులపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు ఇప్పటికే వర్రా రవీందర్‌రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డిలపై ఐటీ యాక్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే వర్రా రవీందర్‌రెడ్డి, గుర్రంపాటి వెంకటసుబ్బారెడ్డి, గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ కింద, ఇడ్రీమ్‌ యూట్యూబ్‌ చానల్‌కు చెందిన కొంత మంది వైఎస్‌ఆర్‌సీపీ మీడియా కార్యకర్తలుగా పని చేశారని, దాదాపు 40 యూట్యూబ్‌ చానళ్ల ద్వారా వీడియోలు పెట్టడం, 400లకుపైగా సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పోస్టులు పెడుతున్నట్లు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇలా పాల్పడే వారిలో ఇప్పటికే 45 మందిని పోలీసులు గుర్తించారు. పంచ్‌ ప్రభాకర్, జగనన్న సైన్యం(వెంకటేశ్‌ బాడి), ఇడ్లీ సాంబార్‌(హరికృష్ణారెడ్డి, రెడ్డిగారి అమ్మాయి వంటి ఖాతాలు కూడా ఉన్నాయి. బేతంపూడి నాని, కేసరి రాజశేఖర్‌రెడ్డి, ఇందుకూరి శ్రీనివాసరాజు, రామాల మన్విత్‌ కృష్ణారెడ్డి, మలకా అమరనాథ్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఇంటూరి రవికిరణ్, షేక్‌ జాను, ఆళ్ల జగదీశ్వర్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జింకల రామాంజనేయులు, ఎన్‌ బాలాజీ రెడ్డి, భార్గవరెడ్డి, మునగాల హరీశ్వర్‌రెడ్డి వంటి పలువురు యూట్యూబర్స్‌ సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన మెస్సేజ్‌లు పోస్టు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read More
Next Story