
యువతపోరుకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌సీపీ
విద్యార్థులు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ఎండగడుతూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పోరు బాట పట్టింది. విద్యుత్ బాదుడు, రైతుల సమస్యల మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపట్టింది. తాజాగా యువతపోరుకు సిద్ధమైంది. ఈ నెల 12న యువతపేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం తాడేపల్లి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో యువతపోరు పోస్టర్‌ను ఆ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. యువతపై కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. ఫీజు రియంర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. దీంతో పాటుగా మెడికల్ కళాశాలల ప్రెయివేటీకరణకు వ్యతిరేకంగా కూడా ధర్నాలు నిర్వహిస్తన్నట్లు తెలిపారు. ఉద్యోగాలు లేక యువత అల్లాడి పోతోందన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 3వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కళాశాలను ప్రెయివేటీకరణ చేసే కుట్రలు చేస్తున్నారని, దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. జగన్ హయాంలో ఏపీకి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చి, ఐదు కళాశాలలను ప్రారంభించేందుకు కృషి చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వాటిని ప్రెయివేరు పరం చేసేందుకు చూస్తున్నారని ధ్వజమెత్తారు.