వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్టు తప్పదా?
x

వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అరెస్టు తప్పదా?

అరెస్టు వారెంట్‌ను మంజూరు చేయాలని కోరుతూ సిట్‌ అధికారులు విజయవాడ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌లో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, రాజంపేట వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సిట్‌ అధికారులు ఇప్పటికే గ్రౌండ్‌ వర్క్‌ సిద్ధం చేసినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నారు. సిట్టింగ్‌ ఎంపీ కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చట్టబద్దంగానే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌ వారెంట్‌ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్‌ అధికారులు పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. దీంతో పాటుగా ఎంపీ మిథున్‌రెడ్డి ఉంటున్న చోట్ల సోదాలు చేసేందుకు కూడా చట్ట ప్రకారం చేపట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. కోర్టు నుంచి డైరెక్షన్లు వెలువడిన మరు క్షణమే ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయడంతో పాటు సోదాల కార్యక్రమాలు కూడా చేపట్టాలని సిట్‌ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.

మరో వైపు ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసుకున్న పిటీషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసేందుకు నిరాకరించింది. అంతేకాకుండా పిటీషన్‌ను డిస్మిస్‌ చేసింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ మధ్యం కుంభకోణం కేసులో తనకు మందుస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టివేసింది. దీనిని ఎంపీ మిథున్‌రెడ్డి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ఏపీ లిక్కర్‌ కేసులో తనకు ఎలాంటి సంబంధం కానీ, ప్రమేయం కానీ లేదు. కావాలనే రాజకీయ కక్షతోనే తనను అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. అందువల్ల తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని సుప్రీం కోర్టును ఎంపీ మిథున్‌రెడ్డి తన పిటీషన్‌లో కోరారు. దీనిపైన విచారణ చేపట్టిన జస్టిస్‌ జెబి పార్థివాలా, జస్టిస్‌ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం అరెస్టు చేయకుండా ఛార్జి షీట్‌ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నలు సంధించింది. మరో వైపు సరెండ్‌ కావడానికి వారం రోజులు గడువు ఇవ్వాలని ఎంపీ మిథున్‌రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి కోరగా, వారం రోజులు గడువును ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. ఇదిలా ఉంటే ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు అరెస్ట్‌ వారెంట్‌ను కోరుతూ సిట్‌ అధికారులు విజయవాడ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో మిథున్‌రెడ్డి అరెస్టు తప్పదు అనే చర్చ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.
Read More
Next Story