టీటీడీ తొక్కిసలాటపై వైఎస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం
x

టీటీడీ తొక్కిసలాటపై వైఎస్‌ఆర్‌సీపీ న్యాయపోరాటం

తిరుమల లడ్డూ కేసు మాదిరిగానే దీనిని కూడా జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని ఆ పార్టీ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు.


తిరుమల తిరుపతి తొక్కిసలాట ఘటన మీద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటానికి దిగాలనే ఆలోచనలకు ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు వచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించాలా? లేదా నేరుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించాలా అనే దానిపైన ఆ పార్టీ పెద్దలు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఇది దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి.. దీనిని నేషనల్‌ ఇష్యూ చేయాలని.. టీటీడీ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లడంతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించడమే మంచిదనే ఆలోచనల్లో ఆ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారిన తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కూడా ఇది వరకు ఆ పార్టీ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పార్టీ రాజ్య సభ సభ్యులు, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. సిట్‌ కూటమి ప్రభుత్వం జేబులోని సంస్థని, దీని వల్ల సమగ్రమైన విచారణ జరిగే అవకాశం ఉండదని, ఏక పక్షంగా సాగే అవకాశం ఉంటుందని.. అందువల్ల దీనిని రద్దు చేయాలని కూడా పిటీషన్‌లో వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును కోరారు. దీనిపైన విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు లడ్డూ వ్యవహారంపై వేసిన సిట్‌ను రద్దు చేస్తూ ఆ బాధ్యత నుంచి సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పించింది. తిరుమల లడ్డూ వ్యవహారంలో తమకు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించడంతో, తొక్కిసలాట ఘటన కూడా భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి అనుకూలంగానే స్పందించేందుకు అవకాశం ఉంటుందని, దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తేనే మంచిదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

మరో వైపు తిరుమల తిరుపతి తొక్కిసలాట దుర్ఘటనకు కారకులైన అధికారులకు వత్తాసు పలుకుతూ తూతూ మంత్రంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల తిరుపతి తొక్కిసలాటకు టీటీడీ చైర్మన్‌ బిఆర్‌ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా కలెక్టర్‌తో పాటు తిరుపతి జిల్లా ఎస్పీలు కారకులని, వీరిపైన కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. వీరి కారణంగా ఆరుగురు అమాయక భక్తుల ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
ఇదే అంశంపై టీటీడీ మాజీ చైర్మన్, రాజ్య సభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. తిరుమల తిరుపతి తొక్కిసలాట దుర్ఘటన దురదృష్టకరం. ఆరుగురు భక్తులు మరణించడం బాధ కలిగించింది. కూటమి ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఈ దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. కారకులైన అధికారులు ఏ స్థాయిలో ఉన్నా సరే.. వారిపైన కేసులు నమోదు చేసి.. ఏ మేరకు అవసరమో ఆమేరకు ఆ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. దుర్ఘటన జరిగి ఇప్పటికే వారం రోజులుపైగా అయ్యింది. బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎక్కడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొద్ది మందిని ట్రాన్స్‌ఫర్లు చేసి చేతులు దులుపుకున్నారు. బాధ్యులైన వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వారిపైన న్యాయపోరాటానికి దిగుతుందని వెల్లడించారు. దుర్ఘటనకు బాధ్యులైన అధికారులపై కేసులు నమోదు చేసి, వారికి శిక్షలు పడే విధంగా న్యాయపోరాటానికి చేయడానికి వెనుకాడేది లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్, రాజ్య సభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఇటీవల మంగళవారం మాట్లాడుతూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తిరుమల తొక్కిసలాట దుర్ఘటనపై న్యాయపోరాటానికి దిగడం ఖాయమనే ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.


Read More
Next Story