పేలుడు పదార్థాల కేసులో వైఎస్సార్సీపీ నాయకుడు అరెస్ట్
x
పోలీసులు స్వాధీనం చేసుకున్న జిెలిటిన్ స్టిక్స్

పేలుడు పదార్థాల కేసులో వైఎస్సార్సీపీ నాయకుడు అరెస్ట్

పేలుడు పదార్థాలను అనధికారికంగా నిల్వ చేసిన మార్టూరు మండల వైఎస్సార్సీపీ నాయకుడు దాసం హనుమంతరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు.


బాపట్ల జిల్లా మార్టూరు మండల రాజకీయాల్లో వైఎస్సార్సీపీ తరఫున క్రియాశీలకంగా వ్యవహరించే దాసం హనుమంతరావు గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా జిలిటెన్ స్టిక్స్ ను యథేచ్ఛగా పలు ప్రాంతాలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కొందరు వైఎస్సార్సీపీ నేతలు, పోలీసులకు నజరానాలు ముట్టజెప్పి తన అక్రమ వ్యాపారం వైపు కన్నెత్తి చూడకుండా చేసుకున్నారు. క్వారీ ప్రాంతం నుంచి సుమారు 40 కి.మీ దూరాన ఏమాత్రం జనావాసాలు, సేద్యపు భూములు లేని ప్రాంతాల్లో గోదాము ఏర్పాటు చేసుకుని వాటిని నిల్వ చేసుకోవాలి. ఈయన మాత్రం నాగరాజుపల్లికి సమీపంలో చుట్టూ వ్యవసాయ భూములు కలిగిన చోటే ప్రమాదకర పేలుడు పదార్థాలు నిల్వచేసి పలు ప్రాంతాలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మార్టూరు, బల్లికురవ, సంతమాగులూరు, చీమకుర్తి, గురిజేపల్లిలోని పలు గ్రానైట్‌ క్వారీలు, కొండలు పిండి చేయడానికి అవసరమైన జిలెటిన్‌ స్టిక్స్, డిటోనేటర్లు ఇతర మందుగుండు సామగ్రి ఇక్కడి నుంచే చాలావరకు సరఫరా అయ్యేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎవరైతే మైనింగ్‌ లీజులు కలిగి ఉంటారో వారికి మాత్రమే లైసెన్సులు కలిగిన వ్యాపారులు వాటిని సరఫరా చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇవేం లేకుండానే మందుగుండు సామగ్రి సరఫరా చేయడం చూస్తే యంత్రాంగం అధికారుల తీరు అర్థమవుతోంది. కొణిదెనలోని ఆయనకు చెందిన ఓ మూతపడిన గ్రానైట్‌ ఫ్యాక్టరీలోనూ మందుగుండు సామగ్రి అనధికారిక నిల్వలు లభ్యమయ్యాయి.

నాగరాజుపల్లిలో మిడాల నాగవేణుగోపాల్‌ పేరుతో ఒక లైసెన్సు ఉంది. దాని గడువు ముగిసింది. ఏం చేసినా ఆయనే చేయాలి. కానీ ఆయన పేరుతో ఉన్న గోదాములో హనుమంతరావు జీరో వ్యాపారం చేస్తున్నారు. ఈ లైసెన్సులు కలిగిన వారు సబ్‌ లీజులకిచ్చుకునే అధికారం లేదని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు.

Read More
Next Story