అక్టోబర్ 28న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ధర్నాలు, ర్యాలీలు
x

అక్టోబర్ 28న అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ధర్నాలు, ర్యాలీలు

సీఎం చంద్రబాబుకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం అలవాటుగా మారిందని స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.


ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ మేరకు అక్టోబర్ 28న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, అరుణ్ కుమార్, మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, "వైఎస్ జగన్ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. కోవిడ్ తర్వాత మరో ఐదు కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. కానీ, చంద్రబాబు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం అలవాటుగా మారింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇది దుర్మార్గ చర్య. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది. ఇది రాజకీయం కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం" అని పేర్కొన్నారు.

నిరసన కార్యక్రమాలు

  • అక్టోబర్ 28: అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు.
  • నవంబర్ 12: జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు.
  • నవంబర్ 23: కోటి సంతకాల సేకరణ పూర్తి చేసి, జిల్లాల నుంచి కేంద్ర కార్యాలయానికి తరలింపు. ఈ సంతకాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు.

సజ్జల మాట్లాడుతూ, "ప్రజాస్వామ్యవాదులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ ఉదృతంగా సాగుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్యం, వైద్య విద్య అందించాలన్నది వైఎస్ జగన్ లక్ష్యం. అందుకే 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. కానీ, కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు చేస్తోంది" అని ఆరోపించారు.

చంద్రబాబుపై విమర్శలు

"మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. ఒక్క రోజులో కాలేజీలు పూర్తి కావు. ఎయిమ్స్ లాంటి సంస్థకే తొమ్మిదేళ్లు పట్టింది. పులివెందుల కాలేజీ పూర్తయినా సీట్లు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. పాడేరు కాలేజీకి 50 సీట్లు చాలని మిగతావి రాకుండా చేశారు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేటీకరణ కాదని చంద్రబాబు కొత్త భాష్యం చెప్తున్నారు. కానీ, లాభాల కోసం ప్రైవేటు వ్యక్తులు మెడికల్ కాలేజీలను వ్యాపార సంస్థలుగా మార్చేస్తారు. ఇప్పటికే ఎవరికి ఏ కాలేజీ ఇవ్వాలో నిర్ణయించారు. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుంది" అని సజ్జల విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. "ఇలాంటి విధ్వంసకర నిర్ణయాలు ఏపీలో ఎప్పుడూ చూడలేదు. చంద్రబాబు తన మీడియా శక్తితో ఎదుటివారిపై విమర్శలు చేస్తున్నారు. కానీ, ప్రజలు ఈ ప్రైవేటీకరణను ఖండిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఈ పోరాటంలో ప్రజలతో కలిసి నిలబడుతుంది" అని సజ్జల పేర్కొన్నారు.

Read More
Next Story