ఆ జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌ స్వీప్‌.. మరి ఈ సారి?
x

ఆ జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌ స్వీప్‌.. మరి ఈ సారి?

గత ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆ నాలుగు జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ పరిస్థితి అలానే ఉందా. తిరిగి అదే రికార్డును సొంతం చేసుకునే సత్తా ఉందా?.


గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా నడిచింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అన్ని స్థానాలను కొల్లగొట్టింది. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకొని రికార్డు నెలకొల్పింది. విజయనగరంలో 9, నెల్లూరులో 10, కడపలో 10, కర్నూలు జిల్లాలో 14 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అన్ని స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకుంది. నాడు తెలుగుదేశం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక నేతల్లో జగన్‌పై ఉన్న అభిమానం వెరసి నాలుగు జిల్లాల్లోని అన్ని సీట్లను నూటికి నూరు శాతం గెలుచుకునేలా చేసింది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో క్లీన్‌ స్వీప్‌ చేయడమంటే ఆ పార్టీపై ప్రజలు ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో అర్థమవుతుంది.

ఇప్పుడు పరిస్థితి ఏమిటి?
విజయనగరం జిల్లాలో సునాయసంగా తొమ్మిదికి తొమ్మిది సీట్లు గెలిచిన వైఎస్‌ఆర్‌సీపీ ఈ ఎన్నికల్లో అవే ఫలితాలను తిరిగి తీసుకొని రాగలుగుతుందా?. అంటే జిల్లాలో మంత్రిగా వైఎస్‌ఆర్‌సీపీలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణే అవునని ధీమా చెప్పలేక పోతున్నారు. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే పది అసెంబ్లీ స్థానాల్లోను గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికలకు ఆరు నెలలు సమయం ఉంది అనగా ముగ్గురు సీనియర్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై తిరుగుబాటు చేశారు. పార్టీనికి కూడా వీడారు. నాయకుడి ఒంటెద్దు పోకడను భరించ లేకే పార్టీని వదులుతున్నామని చెప్పారు. ఇప్పుడు అక్కడ వైఎస్‌ఆర్‌సీపీకి సగానికి పైగా స్థానాలు దక్కే అవకాశం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత జిల్లా అయిన కడపలో పదికి పది స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. కడప జిల్లా వైఎస్‌ఆర్‌సీపీకి కంచుకోటని, ఈ కోటలో ఏ పార్టీ పాగా వేయ లేదని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు అంటున్నా, మరో వారం రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భవితవ్యం తేలనుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కడపలో కూడా వైఎస్‌ఆర్‌సీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అటు వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణుల్లోను, ఇటు స్థానికుల్లోను చర్చ సాగుతోంది. కారణం వైఎస్‌ జగన్‌ చెల్లెలు షర్మిల కడప పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందు వల్ల ఖచ్చితంగా ఆమె ప్రభావం ఉంటుందనే అప్రాయంలో అక్కడి జనం ఉన్నారు.
ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే 14 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గత ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అన్ని సామాజిక వర్గాలు ఏక తాటిపైకి వచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరచారు. ఈ జిల్లాలో మంత్రిగా పని చేసిన గుమ్మనూరు జయరామ్‌ రెండు నెలల క్రితం వైఎస్‌ఆర్‌సీపీని వీడారు. తనకు అసెంబ్లీ సీటు కాకుండా పార్లమెంట్‌ స్థానం కేటాయించి అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయమని సీఎం జగన్‌ ఆదేశించడంతో అసహనానికి గురైన గుమ్మనూరు జయరామ్‌ ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి పోయారు. కర్నూలు సిట్టింగ్‌ ఎంపీ సంజీవ్‌ కుమార్‌కి కూడా తిరిగి టికెట్‌ కేటాయించ లేదు. తాను బీసీ అయినందు వల్లే తనపై వివిక్ష చూపించారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. పూర్వపు కర్నూలు జిల్లాలో సగం సీట్లకు పైగానే తెలుగుదేశం పార్టీ ప్రభావం చూపిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


Read More
Next Story