కడప ఎస్పీని కలిసిన వైఎస్‌ సునీత
x

కడప ఎస్పీని కలిసిన వైఎస్‌ సునీత

వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల నేపథ్యంలో సునీత కడప జిల్లా ఎస్పీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.


మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ సోదరుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్‌ సునీత శుక్రవారం కడప జిల్లా ఎస్పీని కలిశారు. పులివెందుల్లో ఉన్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ వెళ్తున్న సమయంలో ఆమె కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. కడప జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడును కలిశారు. తన తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసు అంశంపైన ఆమె ఎస్పీతో చర్చించారు. హత్యకు సంబంధించిన వివరాలను ఆమె ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా పోస్టులపైన ఆమె ఎస్పీతో చర్చించినట్లు సమాచారం.

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి తనపైన, అన కుటుంబంపైన సోషల్‌ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టుల గురించి కూడా ఆమె ఎస్పీతో చర్చించినట్లు తెలిసింది. సోషల్‌ మీడియా పోస్టులపై తాను ఇదివరకు హైదరబాద్‌లో పెట్టిన కేసు వివరాలను కూడా ఎస్పీకి వివరించారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తనపై సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపై చేసిన ఫిర్యాదులను కూడా ఆమె వివరించారు. ఆ మేరకు వర్రా రవీందర్‌రెడ్డిపై హైదరాబాద్‌లో కేసు నమోదైందని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. వర్రా రవీందర్‌రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని సునీత కోరినట్లు సమాచారం. ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడును కలవడానికి వచ్చిన సమయంలో ఆమె తల్లి సౌభాగ్యమ్మ వాహనంలోనే ఉన్నారు. సునీత మాత్రమే ఎస్పీని కలిశారు. అనంతరం కడప ఎయిర్‌ పోర్టుకెళ్లి హైదరాబాద్‌కు బయలు దేరి వెళ్లారు.

Read More
Next Story