విద్యుత్ ఛార్జీలపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
విద్యుత్ ఛార్జీలపై రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు షర్మిల చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విత్యుత్ చార్జీలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్‌ని విమర్శలు గుప్పించారు. రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో తమ తప్పేం లేదని, తకు అసల సంబంధమే లేదని, ఆ భారం తది కాదన్న రీతిలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఆ భారం మొత్తాన్ని ప్రజల మీదే మోపుతున్నారని కూటమి ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఇది సర్దుబాటు కాదని, ప్రజలకు ‘సర్దుపోటు‘ అని పేర్కొన్నారు. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్‌ని అన్నారు. విద్యుత్ ఛార్జీల విషయంలో వైఎస్ఆర్సీపీ, కూటమి ప్రభుత్వాలు ఒక తీరును అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ప్రజలకు ఏం సంబంధమని నిలదీశారు.
ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేస్తే పడే అదనపు భారం ప్రజల నెత్తిన మోపుతారా? అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో వైసీపీ భారం రూ.35వేల కోట్లు అయితే 5 నెలల్లో కూటమి భారం రూ.18 వేల కోట్లా? వైసీపీకి మీకు ఏంటి తేడా ఏంటని నిలదీశారు. వైసీపీ 9సార్లు ఛార్జీలు పెంచిందని, కూటమి అధికారంలో కొస్తే ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచమని, అవసరం అయితే 30 శాతం తగ్గించేలా చూస్తాం అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలపై కట్టుబడి ఉంటే, తప్పు ఎవరు చేసినా ఆ భారాన్ని ప్రజలపై మోపొద్దనే చిత్తశుద్ది మీకుంటే.. వెంటనే రూ.18 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయండని ఆమె డిమాండ్ చేశారు. పడుతున్న భారంపై నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీని గల్లా పట్టి అడగాలని అన్నారు. ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల ముక్కు పిండి ట్రూ ఆప్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారని, అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నట్లు ట్వీటర్ లో పేర్కొన్నారు.