సజ్జలపై షర్మిలకు అంత కోపం ఉందా?
x

సజ్జలపై షర్మిలకు అంత కోపం ఉందా?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ రెడ్డిపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరే పెయిడ్ ఆర్టిస్టులని మండిపడ్డారు.


ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన తనయుడు భార్గవ రెడ్డిపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ‘నువ్వు, నీ కొడుకే పెయిడ్ ఆర్టిస్టులు’ అంటూ చెన్నూరు నిర్వహించిన ‘న్యాయ యాత్ర’ సభలో ధ్వజమెత్తారు. ‘‘నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా? నన్ను ఎవరనుకుంటున్నావ్? రాజన్న బిడ్డని అని గుర్తుంచుకో! అధికారం మదం తలకెక్కిందా.. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావ్. నన్ను, సునీతలు పలు విధాలుగా హింసించడానికి మీరు, మీ కొడుకు పేమెంట్లు తీసుకున్నారు. సోషల్ మీడియాలో మాపై ఇష్టం వచ్చినట్లు పోస్ట్ పెట్టి హేళన చేస్తారా? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా.. వాళ్లు కూడా పెయిడ్ ఆర్టిస్టులేనా? అలాంటి మాటాలు మాట్లాడటానికి మాకు సంస్కారం ఉంది. మీలా సంస్కార హీనులం కాదు’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి సంస్కార హీనులను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకోవడం సీఎం జగన్ మోహన్‌రెడ్డి చేసుకున్న ఖర్మ అని వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజశేఖర్‌కి పుట్టలేదంటూ నా తల్లిని కూడా అవమానించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల, ఆయన కొడుకు మమ్మల్ని ఎంతగానో అవమానించారు. సోషల్ మీడియాలో సైతం మమ్మల్ని టార్గెట్ చేశారు. ప్రజలు మౌనంగా ఉన్నారే తప్ప అన్నీ గమనిస్తున్నారని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

జై జగన్ అనే వారికి హెచ్చరిక

జై జగన్.. జై జై జగన్ అనే వారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నానని వెల్లడించారు. ‘‘నేను కూడా జై జగన్ అనుకుంటూ ఎండనక వాననకా తిరిగాను. జగన్ జైల్లో ఉంటే ప్రజల కోసం రోడ్లపై తిరిగానని గుర్తు చేస్తున్నా. జగన్ పెట్టిన మ్యానిఫెస్టోను ఊరూరా తిరిగి ప్రచారం చేసి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. అందులో భాగంగానే జగన్ గెలిస్తే అమ్మఒడి పథకాన్ని ఇంట్లో ఇద్దరు పిల్లులు ఉంటే.. ఇద్దరికీ అందిస్తామని నేనే చెప్పా. మరి ఇప్పుడు ఇద్దరు పిల్లలకు అమ్మఒడి వస్తుందా? రైతులు రాజులవుతానని చెప్పా.. వారికి లాభాలు వచ్చాయా.. ధరల స్థిరీకరణ నిధి ఇచ్చారా? సంపూర్ణ మద్యపాన నిషేధమని చెప్పా.. అది అయిందా.. నిషేధం తర్వాత జైగన్ అధికారంలోకి వచ్చాక పిచ్చి బ్రాండ్‌లు వచ్చి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. కాబట్టి దీనిని అందరూ గుర్తుంచుకోవాలని హెచ్చరిస్తున్నా’’ అని వివరించారు.

ఇది అధికార అహకారమే!

‘‘చిన్నాన వివేకా లాంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచమంతా జల్లెడ పట్టినా దొరకరు. అలాంటి మంచి మనిషిని అతి కిరాతకంగా నరికి చంపారు. చంపిన వాళ్లకు, చంపించిన వాళ్లకు మధ్య ఎన్నో లావాదేవాలు ఉన్నాయి. సీబీఐ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పింది. కానీ అతనిని సీఎం జగన్ కాపాడుతున్నారు. న్యాయం చేయకపోగా మళ్లీ అదే వ్యక్తికి ఎంపీ టికెట్ వచ్చి పార్లమెంటు‌కు పంపాలని చూస్తున్నారు. దాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే ఎన్నికల్లో నిలబడుతున్నా. అవినాష్ రెడ్డిని ఓడించడమే మా ఆశయం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జగన్‌ను ఓడించాల్సిందే’’ అని పునరుద్ఘాటించారు.



Read More
Next Story