జగన్‌కు అవకాశం కల్పిస్తా.. ముందు అసెంబ్లీకి రమ్మనండి: అయ్యన్నపాత్రుడు
x

జగన్‌కు అవకాశం కల్పిస్తా.. ముందు అసెంబ్లీకి రమ్మనండి: అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం కాదు అన్న విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి గుర్తు చేశారు.


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం కాదు అన్న విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, ఇప్పటికైనా ఆయన అసెంబ్లీకి రావాలని, పులివెందుల ప్రజల సమస్యలను పరిష్కరించాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు తాను అసెంబ్లీలో అడుగు పెట్టనన్న జగన్ వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు స్పందించారు. అసెంబ్లీకి రానని జగన్ అనడం ఏమాత్రం సరైన పద్దతి కాదని అన్నారు. జగన్‌కు తాను ఇచ్చే సలహా ఒకటేనని చెప్పారు.

జగన్‌కు నేను అవకాశం కల్పిస్తా..

‘‘పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడాలి. అందుకు ఒక్కసారి అసెంబ్లీకి వస్తే మాట్లాడటానికి జగన్‌కు నేను అవకాశం కల్పిస్తా. నేను అవకాశం ఇవ్వనని జగన్ ఎందుకు అనుకుంటున్నారు. అన్ని పార్టీల నేతలకు ఇచ్చిన విధంగానే జగన్‌కు కూడా మాట్లాడటానికి అవకాశం ఇస్తాను. సభలో మాట్లాడటానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తా. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగినా మైక్ ఇస్తాం. వైసీపీకి వచ్చిన సీట్లకు అనుగుణంగా సమయం కేటాయిస్తాం. అదే విధంగా అసెంబ్లీకి వస్తే జగన్‌కు కూడా మాట్లాడే స్వేచ్ఛను ఇస్తా’’ అని చెప్పారు అయ్యన్నపాత్రుడు.

పద్దతి ప్రకారమే జరుగుతుంది

‘‘అసెంబ్లీ అనేది పద్దతి, నిబంధనల ప్రకారమే నడుస్తుంది. అన్ని పార్టీల వారికి వారు గెలిచిన స్థానాలను బట్టే మాట్లాడటానికి సమయం కల్పిస్తా. ఇలాంటి అసెంబ్లీకి ఒక పార్టీ వారు రానని బాయ్‌కాట్ చేయడం సరైన పద్దతి కాదు. నాకు రాజకీయాల్లో 42 ఏళ్ల అనుభవం ఉంది. ఆరుసార్లు మంత్రిగా, ఎంపీగా పనిచేశా. తనకు అసెంబ్లీ సభాపతిగా కొత్త బాధ్యత అప్పగించారు. ఈసారి అసెంబ్లీకి 88 మంది కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వారికి సభ నిర్వహణ, ప్రశ్నోత్తరాలు తదితరాలపై రెండ్రోజుల ప్రత్యేక శిక్షణ ఇస్తాం’’ అని వివరించారు.

అంతేకాకుండా ఎమ్మెల్యేలకు ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్, గతంలో స్పీకర్‌గా చేసిన నాదెండ్ల మనోహర్‌తో శిక్షణ ఇప్పిస్తామని ఆయన చెప్పారు. ఒక్కసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన తర్వాత అన్ని పార్టీలను సమానంగా చూస్తామని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీ తీవ్రంగా నష్టపోయి ఉందని, అటువంటి రాష్ట్రాన్ని కాపాడి అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలని చెప్పారు.

Read More
Next Story