హిందూపురం దాడిపై జగన్‌ ఏమన్నారంటే..
x

హిందూపురం దాడిపై జగన్‌ ఏమన్నారంటే..

హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై జగన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.


హిందూపురం వైసీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది వైసీపీపై జరిగిన దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనుచరులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైసీపీ కార్యాలయంపై హింసాత్మక దాడికి పాల్పడటం అనేది ప్రజాస్వామంపై నేరుగా జరిగిన దాడి అని పేర్కొన్నారు. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అందులోని ఫర్నిచర్‌ను విరగ్గొట్టడం, కార్యాలయం అద్దాలను పగలగొట్టడం, అక్కడున్న వైసీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడి, దౌర్జాన్యాలకు దిగడం వంటి ఆటవిక చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయని మండిపడ్డారు. మరో వైపు ఈ దాడికి సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైన జగన్‌ మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వంటివి మరింత ఆందోళన కలిగిస్తోందని జగన్‌ పేర్కొన్నారు.

ఇది నిర్లక్ష్య పూరిత చర్య కాదన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్య వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్న హెచ్చరికగా భావించాలన్నారు. సీఎం చంద్రబాబు మద్దతుతోనే ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో హింసను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు ప్రత్యర్థులను భయపెట్టి అణచివేయాలనే చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రత్యర్థులు, ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను కాపాడలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను విశ్వసించే ప్రతిపౌరుడిపై ఈ దాడి జరిగినట్టే అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీటర్‌ వేదికగా జగన్‌ పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్‌కు జత చేసి పోస్టు చేశారు.


Read More
Next Story