‘నెయ్యిలో కొవ్వు ఒక కట్టుకథ’.. చంద్రబాబుపై జగన్ విసుర్లు
x

‘నెయ్యిలో కొవ్వు ఒక కట్టుకథ’.. చంద్రబాబుపై జగన్ విసుర్లు

తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.


తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తన నీచ రాజకీయాల కోసం చంద్రబాబు.. దేవుడిని కూడా వాడేసుకుంటున్నారంటూ చురకలంటించారు. అసలు తిరుమలలో వినియోగించే నెయ్యి కల్తీ అనేది జరగే పని కాదని జగన్ స్పష్టం చేశారు. ఎక్కడా అందుకు అవకాశం లేదని, కేవలం రాజకీయ మైలేజీ, లబ్ధి కోసమే చంద్రబాబు ఇలాంటి ఫేక్ ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వలాభం కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటాడుకోవడం ఏమాత్రం మంచిది కాదని, ఇప్పటికే ఆంధ్రప్రజల ఆగ్రహానికి గురవుతున్న చంద్రబాబు.. ఇంతలా దిగజారడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని, వైసీపీపై బురదజల్లడానికే ఆయన ఇలా చేస్తున్నారని పునరుద్ఘాటించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వంద రోజుల నుంచి కూడా ప్రజలను మోసం చేస్తూనే వస్తున్నారని, ఆయనది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసమంటూ విమర్శలు గుప్పించారు జగన్.

నెయ్యిలో కొవ్వు అనేది కట్టుకథ

‘‘తిరుపతి ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు చెప్పిందంతా కూడా ఒక కట్టుకథ మాత్రమే. చంద్రబాబు అనే వ్యక్తి పూర్తిగా అబద్దాలు, మోసాల మనిషి. తన రాజకీయాలకు దేవుడిని కూడా వాడుకునే దుర్మార్గమైన వ్యక్తి బాబు. ఎవరైనా రాజకీయ లబ్ధి కోసం ఇంత దూరం వెళ్తారా? ఇంత ధైర్యం చేస్తారా? ఒక సీఎం పదవిలో ఉండి ఇలాంటి అబద్ధాలు చెప్పడం న్యాయమేనా? భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం ఎంత వరకు సబబు? ప్రతి ఆరు నెలలకు ఒకసారి నెయ్యి సరఫరాకు టెండర్లు పిలుస్తారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదు. దశాడ్దాలుగా పాటిస్తున్న పద్దతిలోనే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ జరుగుతుంది’’ అని వెల్లడించారు జగన్.

మూడుసార్లు పరీక్ష చేస్తారు

‘‘లడ్డూ తయారీ సామాగ్రి కొనుగోలు ప్రక్రియ ఆది నుంచి ఒకేలా జరుగుతోంది. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ ఎన్ఏబీఎల్ సర్టిఫికెట్ తీసుకురావాలి. మూడు టెస్టులు పాసైతేనే ఆ సామాగ్రిని టీటీడీ అనుమతిస్తుంది. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. జరగని వాటిని జరిగాయంటూ అబద్ధాలు ఆడుతున్నారు. జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపుళ్లు తీసుకున్నారు. జూలై 17న ఎన్‌డీడీబీకి శాంపుళ్లు చేరుకున్నాయి. జూలై 23న రిపోర్ట్ వచ్చింది. అప్పుడు రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు దానిని ఎందుకు బట్టబయలు చేయలేదు. ఇప్పుడే ఎందుకు దీనిపై సీఎం మాట్లాడారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది’’ అని జగన్ చెప్పుకొచ్చారు.

సూపర్ సిక్స్‌ లేదు.. సెవెన్ లేదు

‘‘సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల ప్రచారంలో తెగ ప్రచారం చేశారు. వాటి అమలు ఎంతవరకు వచ్చింది. వాటిని అమలు చేయలేమని ఆయన అసెంబ్లీ వేదికగా చెప్పుకున్నారు. అవన్నీ మోసమే. వంద రోజుల్లో చంద్రబాబు చేసిందంతా మోసమే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు తిరోగమనం పట్టాయి. ఇప్పటి వరకు విద్యాదీవెన, వసతి దీవెన విద్యార్థులకు అందలేదు. వాటిని ఆపేశారు. స్కూళ్లు కూడా పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. గొరు ముద్ద గాలికెగిరిపోయింది. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ ప్రతిష్టను భ్రష్టుపట్టించడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు.. తిరుమల తిరుపతి లడ్డూ నెయ్యిలో కొవ్వులు అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు’’ అంటూ విమర్శించారు జగన్.

Read More
Next Story