బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు
x

బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు

ఇటీవల అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. ఏమన్నారంటే..


నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు అని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు, మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం వైఎస్ జగన్ లపై చర్చ చేశారు. నాటి సీఎంగా ఉన్న జగన్ సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ జరిగిన చర్చలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మొదలుపెట్టిన ఈ అంశంపై బాలకృష్ణ స్పందిస్తూ మెగాస్టార్ చిరంజీవిపై కాస్త దురుసుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల మధ్యే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ దుమారం రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఈ ఎపిసోడ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మౌనంపై రిపోర్టర్ ప్రశ్నకు జగన్ స్పందిస్తూ, "అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? ఆయన మాట్లాడింది ఏంటి? పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతించారు? అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ధి లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. అలా మాట్లాడినందుకు సైకాలజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి" అని తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉంటే, అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ మాట్లాడిన అంశంపై బాలకృష్ణ స్పందిస్తూ తన ప్రస్తావన తీసుకురావడంపై చిరంజీవి ఆనాడే ఓ ప్రకటన విడుదల చేశారు. "సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదు. ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను సాదరంగా ఆహ్వానించారు" అని పేర్కొన్నారు.

Read More
Next Story