చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమే
x

చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమే

లండన్‌ పర్యటన ముగించుకొని వచ్చిన వైఎస్‌ జగన్‌ బుధవారం ఆ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.


చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమే.. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని తాను ఎన్నికల సమయంలోనే ప్రజలకు చెప్పానని, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కూటమి మేనిఫెస్టోను అమలు చేయడం సాధ్యం కాదని, రాష్ట్ర బడ్జెట్‌ ఎంత, తాను చేపట్టిన పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది, చంద్రబాబు చెప్పిన వాటికి ఎంత కావాలి అనే విషయాలు వివరింగా చెప్పానన్నారు. కానీ ఏదైతే చేయగలుగుతామో అనే చెప్పాలి.. చేయలేనిది చెప్పి, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని జగన్‌ అన్నారు.

ఓడి పోయాం.. పర్యాలేదు. ప్రతిపక్షంలో కూర్చున్నాం అదీ పర్వాలేదు. తన లండన్‌ పర్యటన అనంతరం ఆయన బుధవారం ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ నాయకులే డిప్యూటీ మేయర్లు, చైర్మన్‌ పదవులు దక్కించుకున్న నేపథ్యంలో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేటర్లు.. నాయకుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 64 స్థానాలుంటే 49 స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ గెలుచుకుంది. 14 స్థానాలు తెలుగుదేశం పార్టీ, 1 స్థానం సీపీఎం గెలుచుకుంది. అయితే టీడీపీకీ కేవలం 14 స్థానాలున్నా.. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేటర్లను రకరకాలుగా ప్రలోభాలు పెట్టి, భయపెట్టి 13 మందిని తీసుకున్నారు. అయినా ఇంకా 38 మంది వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను అని జగన్‌ అన్నారు. ఏ కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏవి తీసుకున్నా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే.. అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఫలితాలతో కేవలం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే క్లీన్‌ స్వీప్‌ చేయగలిగిందన్నారు.
ఈ సారి తన స్టైల్‌ వేరేగా ఉంటుందని, జగన్‌ 2.0 వేరేగా ఉంటుందన్నారు. కార్యకర్తల కోసం జగన్‌ ఏ విధంగా పని చేస్తాడో చూపిస్తా అని భరోసా ఇచ్చారు. ప్రజల కోసం పడిన తాపత్రయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేక పోయాను. ఇప్పుడు చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న కాష్టాలు, బాధలను చూశాను. వీరందరీ అండగా ఉంటా.. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం.. ఎక్కడ ఉన్నా వారిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా అని అన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు, దొంగ కేసులు పెడుతారు. జైల్లో పెట్టినా భయపడాల్సిన పని లేదు. కార్యకర్తలకు నేను అండగా నిలుస్తా. మళ్లీ అధికారంలోకి వస్తాం. 30 ఏళ్లు పరిపాలన చేస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
Read More
Next Story