‘ప్రభుత్వ తీరు బాధాకరం’.. అచ్యుతాపురం ఘటనపై వైఎస్ జగన్
x

‘ప్రభుత్వ తీరు బాధాకరం’.. అచ్యుతాపురం ఘటనపై వైఎస్ జగన్

అచ్యుతాపురం సెజ్‌ ప్రాంతంలో జరిగిన ఎసెన్షియా ఫార్మా సంస్థ ప్రమాద క్షతగాత్రులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు.


అచ్యుతాపురం సెజ్‌ ప్రాంతంలో జరిగిన ఎసెన్షియా ఫార్మా సంస్థ ప్రమాద క్షతగాత్రులను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం పరామర్శించారు. అనకాపల్లిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ప్రైవేటు ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి క్షతగాత్రులను, వారి కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని, 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్న వార్త కలచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ స్పందనపై కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీరు సరిగా లేదని, ఏదో కంటితుడుపు చర్యలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందంటూ విమర్శించారు.

మంత్రి దగ్గర వివలేవా..!

‘‘అచ్యుతాపురం ఘటన పట్టపగలు జరిగింది. అయినా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. పర్యవేక్షణకు వెళ్తున్నాను అని హోం మంత్రి నోట మాట కూడా రాలేదు. కార్మిక శాఖ మంత్రి అయితే మరీ దారుణంగా ప్రమాదానికి సంబంధించిన వివరాలు తన దగ్గర లేవన్నారు. ఎంత మంది చనిపోయారో కూడా తెలియదని చేతులెత్తేశారు. ఈ ఘటనపై స్పందించకూడదన్న తాపత్రయం తప్ప బాధితులకు న్యాయం చేయాలన్న తపన ప్రభుత్వంలో కనిపించలేదు. ఘటన స్థలానికి అంబులెన్సులు కూడా రాని పరిస్థితి. బాధితుల్ని కంపెనీ బస్సుల్లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి దగ్గర కూడా ఒళ్లంతా కాలిన గాయాలు ఉన్నా బాధితులే స్వయంగా బస్సు దిగి ఆసుపత్రిలోకి వెళ్ళిన దుస్థితి’’ అంటూ జగన్ మండిపడ్డారు.

మా ప్రభుత్వమైతే వేరేలా ఉండేది..

‘‘ఇటువంటి ఘటనే ఒకటి వైసీపీ హయాంలో కూడా జరిగింది. అదే ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం. ప్రమాదం జరిగింది కోవిడ్ సమయంలో అయినా బాధితులకు 24 గంటల్లో పరిహారం అందించాం. ప్రమాద మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన తొలి ప్రభుత్వం వైసీపీదే. ఆ సమయంలో ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే పాలక, ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ప్రమాదం తెల్లవారుజామున జరిగిన కొద్ది సేపటికే కలెక్టర్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఉదయం 11 గంటల కల్లా సీఎం హోదాలో నేను కూడా ఘటన స్థలానికి చేరుకున్నాను. వెంటనే బాధితులకు పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభించాం. గంటల వ్యవధిలో రూ.30 కోట్ల పరిహారం సొమ్ము పంపిణీ చేశాం. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా గతంలో ఏ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు ప్రభుత్వం స్పందన చూస్తే చాలా బాధేస్తుంది. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరగాలి’’ అని జగన్ కోరారు.

‘ఇష్యూ డైవర్ట్ చేయడానికి చంద్రబాబు యత్నం’

‘‘అచ్యుతాపురం ఘటనపై చంద్రబాబు నిర్వహించిన ప్రెస్‌మీట్ చూసి షాకయ్యా. విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఎంతో ప్రయత్నించారు. ప్రభుత్వం అనేది బాధ్యతతో వ్యవహరించాలి. పరిశ్రమలపై పర్యవేక్షణ ఉంచి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. 17 ప్రాణాలు పోయేవీ కాదు. సంస్థలు సమర్పించే నివేదికలపై థర్డ్‌పార్టీ కంపెనీలు ఆడిట్‌లు, సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. కానీ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను మానిటర్ చేయడం ఈ ప్రభుత్వం మానేసింది. రెడ్‌బుక్‌పై పెట్టిన శ్రద్ధ.. ఇలాంటి వాటిపై పెట్టి ఉంటే ఈ ప్రమాదాలు జరిగేవి కాదు. కార్మికులు చనిపోయేవారు కాదు’’ అని హితవు పలికారు.

Read More
Next Story