నా పిల్లల కడుపు కొట్టిన నువ్వు- మేనమామవా జగనన్నా!
x
YS Sharmila, Jagan, Vijayamma

నా పిల్లల కడుపు కొట్టిన నువ్వు- మేనమామవా జగనన్నా!

వైఎస్ జగన్ పై ఆయన చెల్లెలు షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన తల్లికి, తన బిడ్డలకు జగన్, ఆయన భార్య అన్యాయం చేశారని ఆరోపించారు.


మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు, తన సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి తన తల్లికి అన్యాయం చేసిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతారని విమర్శించారు. తల్లి తర్వాత తల్లి అంతటి వాడు మేనమామని, అటువంటి వ్యక్తే తన బిడ్డలకు అన్యాయం చేశారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. సరస్వతి పవర్‌ షేర్ల ఎంవోయూపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ (YS Jagan) స్వయంగా సంతకం చేశారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్‌ తనకు ఇవ్వలేదని చెప్పారు.

సరస్వతి పవర్ ప్రాజెక్ట్ షేర్లపై వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆమె మరోసారి తన సోదరుడు జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
'షేర్లు బదిలీ చేసుకోవడం కోసం తప్పుడు తేదీలతో దొంగ పత్రాలు సృష్టించారు. మాకు తెలియకుండానే మా పేరిట ఉన్న 51 శాతం వాటాను బదిలీ చేసుకున్నారు. ఈ బదిలీని రద్దుచేసి తమ వాటా తమకే ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జగన్‌, భారతి, వారి కంపెనీ క్లాసిక్‌ రియాల్టీ హైదరాబాద్‌లోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్‌ దాఖలు చేశారు' అని షర్మిల చెప్పారు. ఏప్రిల్ 3 గురువారం ఈ పిటిషన్‌పై రాజీవ్‌ భరద్వాజ్‌, సంజయ్‌ పూరితో కూడిన బెంచ్‌ విచారణ చేపట్టింది. జగన్‌, భారతి, క్లాసిక్‌ రియాల్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది, వైసీపీ రాజ్యసభ ఎంపీ ఎస్‌ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 'మా మధ్య సంబంధాలు బాగున్నప్పుడు ప్రేమ, అభిమానంతో సరస్వతీ పవర్‌లో షేర్లు బహుమతిగా ఇచ్చేందుకు ఎంవోయూ జరిగింది. ఆ ఎంవోయూ షరతులతో కూడిన ఒక ఒప్పందం. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారమై సీబీఐ, ఈడీ పెట్టిన కేసుల్లో భాగంగా ఈడీ ఆ ఆస్తులను అటాచ్‌ చేసింది. ఆ అటాచ్‌మెంట్లపై హైకోర్టు స్టేటస్‌ కో (యథాతథ స్థితి) విధించింది. ఆ ఆస్తులన్నీ విడుదలయిన తర్వాత షేర్లు గిఫ్ట్‌గా ఇస్తానని ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం' అని జగన్ తరఫు న్యాయవాది చెప్పారు. దీన్ని షర్మిల వ్యతిరేకించారు.

‘‘విజయమ్మకు సరస్వతి పవర్‌ షేర్లను జగన్‌ గిఫ్ట్‌డీడ్‌ కింద ఇచ్చారు. ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని ఆయన కోర్టుకు వెళ్లారు. స్వయంగా తల్లినే జగన్‌ మోసం చేస్తున్నారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా.. మేనల్లుడు, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా ఆయన చరిత్రలో మిగిలిపోతారు. జగన్‌కు విశ్వసనీయత ఉందో.. లేదో.. వైసీపీ వారే ఆలోచించాలి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ వివాదం తెరపైకి వచ్చింది. అప్పటి నుంచి ఈ అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది.
Read More
Next Story