ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?
x

ఏపీ 'లిక్కర్ స్కాం'లో జగన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు చెబుతున్న మద్యం కుంభకోణం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.SIT నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది


వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్టు చెబుతున్న మద్యం కుంభకోణం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇది ఢిల్లీ లిక్కర్ స్కాంను మించిన వ్యవహారమని, వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయని టీడీపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (S.I.T) నియమించింది. ఇప్పుడీ బృందం తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. దీనిపై కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL)లో పెద్దఎత్తున అవకతవకలు, అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటిపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ వ్యవహారంలో ఓ ప్రస్తుత ఎంపీకి, మరో మాజీ ఎంపీకి సుమారు రూ.4,000 కోట్ల ముడుపులు చెల్లించినట్లుగా సిట్ గుర్తించినట్టు ఎక్సైజ్ శాఖలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం సిట్ దర్యాప్తులో నగదు ఎలా చేతులు మారిందో, ఎవరెవరికి ఎంతెంత ముట్టాయో కూడా గుర్తించింది. 2019 నుంచి 2024 మధ్య మద్యం దుకాణాలలో నగదును మాత్రమే అనుమతించారు. డిజిటల్ చెల్లింపులను అనుమతించలేదు. ఇలా ఎందుకు చేయాల్సివచ్చిందనే దానిపై ప్రధానంగా సిట్ దృష్టి కేంద్రీకరించింది.
రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు 'ది ఫెడరల్ ప్రతినిధి'కి తెలిపిన ప్రకారం, SIT CRPC సెక్షన్ 164 కింద మద్యం తయారీదారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసింది. దీని ప్రకారం సుమారు రూ.4,000 కోట్ల మేర నగదు లావాదేవీలు జరిగాయని అంచనా. సిట్ నివేదిక ఆధారంగా ఈ కేసును ఢిల్లీ మద్యం కుంభకోణం మాదిరిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు అప్పగించే అవకాశాన్ని ప్రభుత్వ వర్గాలు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను మూసేసి ప్రభుత్వ యాజమాన్యంలోని షాపులకు మాత్రమే లిక్కర్ అమ్మకాలను అనుమతించారు. మొత్తం మద్యం రిటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకువచ్చారు.
2019 అక్టోబరు 1 నుంచి వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం షాపుల పాలసీని అమల్లోకి తెచ్చింది. అప్పటివరకూ 4,380 షాపులు ఉంటే వాటిని 3,500కు కుదించింది. ఆ తర్వాత మరోసారి షాపుల సంఖ్యను 2,934కు తగ్గించారు. మరికొంతకాలం తర్వాత టూరిజం కేంద్రాల్లో షాపుల పేరుతో ఆ సంఖ్యను 3,392కు పెంచారు.
"రాష్ట్ర నియంత్రణలోకి వచ్చిన తర్వాత, పేరున్న లిక్కర్ బ్రాండ్‌లను కాదని లోకల్ బ్రాండ్‌లను మాత్రమే విక్రయించేలా చేశారు. దీంతో 2019 నుంచి 2024 మధ్య ప్రముఖ బాండ్ ల స్థానంలో "దారు హౌస్", బ్రిటిష్ ఎంపైర్ బీర్, గవర్నర్ ఛాయిస్, ప్రెసిడెంట్ మెడల్, సెవెంత్ హెవెన్, పవర్ స్టార్ 99 విస్కీ వంటి స్థానిక బ్రాండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాణ్యత ప్రధాన సమస్యగా మారింది. AP రాష్ట్ర బ్రూవరీ కార్పొరేషన్ అప్పటి మాజీ MD, వైఎస్ జగన్ సలహాదారుల ద్వారా డబ్బు దారిమళ్లినట్టు" సిట్ గుర్తించిందని ఎక్సైజ్ శాఖలోని ఓ అధికారి చెప్పారు.
ఇటీవలే వైఎస్ఆర్సీపీకి, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన- జగన్ ఓనాటి సన్నిహితుడు- వి. విజయసాయి రెడ్డి కూడా ఈ మద్యం కుంభకోణం వెనుక జగన్ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారని బహిరంగంగానే ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారం వెనుక రాయలసీమకు చెందిన ప్రస్తుత ఎంపీ ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో జగన్ ప్రమేయం ఏమిటనే దానిపై పరిశీలన జరుగుతుంది. అక్రమాలకు తెరలేపిన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టినందుకు జగన్ ను బాధ్యుణ్ణి చేయవచ్చునని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
పార్లమెంటులో ఎవరు ప్రస్తావించారంటే...
మద్యం నగదు లావాదేవీలు సుమారు 4వేల కోట్ల రూపాయలుగా ఉంటుందని, ఇందులో అత్యధిక భాగం ప్రస్తుత ఎంపీకి చేరాయని - ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గుర్తించిందని చెబుతున్నారు. CRPC సెక్షన్ 164 కింద మద్యం తయారీదారుల నుంచి SIT వాంగ్మూలాలను నమోదు చేసింది.
ఈ నివేదిక ఆధారంగా ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)కు అప్పగించాలని నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్ సభలో ప్రస్తావించారు. నెలకు దాదాపు రూ. 80 కోట్ల ముడుపులు వైసీపీ నేతలకు ముట్టాయని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను నేరుగా కలిసి మద్యం కుంభకోణాన్ని ఈడీకి అప్పగించేలా ఆదేశించమని కోరారు. ఏపీ లిక్కర్ స్కాంతో పోలిస్తే ఢిల్లీ కుంభకోణం చాలా చిన్నదని అమిత్ షాకి వివరించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. తాజాగా లావు కృష్ణదేవరాయలు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందనే చర్చ జరుగుతోంది.
మాజీ సీఎం జగన్ ను విచారిస్తారా?
ఈ కేసును ఈడీకి అప్పగిస్తే అధికారులు మాజీ సీఎం వైఎస్ జగన్ పాత్రను విచారించే అవకాశం ఉంది. ఆ విధంగా జగన్ ను ఈ కేసులోకి లాగి ఆప్ అధినేత కేజ్రీవాల్ తరహాలో అరెస్ట్ చేయించాలని టీడీపీ వ్యూహంగా ఉంది. అయితే ఇందుకు బీజేపీ సిద్ధపడుతుందా అనే అనుమానాన్ని రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీతో పాటు వైసీపీ కూడా కేంద్రంలోని కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతోంది. పార్లమెంటులో బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకూ టీడీపీతో పాటు వైసీపీ కూడా మద్దతు ఇస్తోంది. వైఎస్ జగన్ కి కూడా అటు అమిత్ షాతో ఇటు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.
ఎంపీ మిథున్ రెడ్డికి భయమెందుకు?
సరిగ్గా ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రస్తుత ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. మార్చి 26న కోర్టులో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని సీఐడీ వాదించింది. అరెస్టు చేస్తారనే ఆందోళనతో, సరైన ఆధారాలు లేకుండా పిటిషన్‌ వేయడానికి వీల్లేదన్నారు. బెయిలు పిటిషన్ను కొట్టేయాలని కోరారు.
మిథున్‌రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన చేతికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఆయనను చూసేందుకు తిరుపతికి వస్తే పోలీసులు అరెస్ట్‌ చేసే ప్రమాదం ఉందని ఎంపీ తరఫున సీనియర్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏప్రిల్‌ 3 వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని సీఐడీని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
మద్యం కుంభకోణం కేసులో పిటిషనర్‌ను ఇప్పటి వరకు నిందితుడిగా చేర్చలేదు. ఆయనకు నోటీసు ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్‌ మెజిస్ట్రేట్‌ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మిథున్‌రెడ్డిని మద్యం కేసులో నిందితుడిగా చేరుస్తున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఏప్రిల్‌ 4 వరకు పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నాయి. 5వ తేదీన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రముఖ బాండ్లను తొలగించడం, నాసిరకం బ్రాండ్లను పెట్టడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి తెలిసే ఈ వ్యవహారం సాగిందని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు బహిరంగంగానే ఆరోపించారు.
Read More
Next Story