కీర్తించిన గొంతుకలే ప్రశ్నిస్తున్నాయ్.. ఇదీ పులివెందుల భారతం..
x

కీర్తించిన గొంతుకలే ప్రశ్నిస్తున్నాయ్.. ఇదీ పులివెందుల భారతం..

వైసీపీపై చాపకిందనీరులా వ్యాపించిన అసంతృప్తి బయటపెడుతోంది. ఇంటి పోరు ఒకపక్క.. టిడిపి నేతలు మరోపక్క.. పులివెందులలో వైసీపీకి జోరీగల్లా మారారు.


(ఎస్.ఎస్.వి. భాస్కరరావ్)

తిరుపతి: పులివెందుల నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టనికోట. ప్రస్తుతం ఆ కోటలో వైఎస్ఆర్ కుటుంబాన్ని ప్రశ్నించే గొంతుకలు పెరుగుతున్నాయి. మూడు ప్రధాన అంశాలపై ఆ ప్రశ్నలు వెలువడుతున్నాయి. శరణు కోరితే శత్రువునైనా క్షమించే మనస్తత్వం ఉన్న గడ్డపై "కొంగు చాపి ఓటు అడుగుతున్నా" అనే షర్మిల అభ్యర్థన జనం మనసుల్లోకి దూసుకుపోయింది. "ఆ మాట తలుచుకుని బాధపడని మనిషిలేరు" అని పులివెందుల ప్రాంతానికి చెందిన ఓ సీనియర్ జర్నలిస్ట్ చెబుతున్నారు.

పులివెందుల ఓటరు తనకు కాకుంటే ఇంకెవరికి ఓటేస్తారు! అనే మితిమీరిన విశ్వాసం, అహంకార ధోరణి.. దివంగత సీఎం వైఎస్ఆర్‌ను అభిమానించే నాయకులను పట్టించుకోవడం అనే మాట అటు ఉంచితే, జనంలో కలవకపోవడం. పనులు చేయకపోవడం వంటి అంశాలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యతిరేకతకు దారి తీసినట్లు స్థానికులు, మేధావులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ను చెల్లెళ్లు వ్యతిరేకించడంతో వైఎస్ఆర్ కుటుంబంలో ఇంటిపోరు మొదలైంది. ఈ పరిణామాలు కాస్తా సీఎం వైఎస్ జగన్‌కు పులివెందులలో మెజారిటీ తగ్గించడానికి, తద్వారా కడప ఎంపీ అభ్యర్థిని నిలువరించాలనే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తున్నట్లు సమాచారం. ఒకసారి గతాన్ని పరిశీలిస్తే..

పులివెందుల అసెంబ్లీ స్థానంలో.. 2,23,407 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో గత పరిస్థితి పక్కన ఉంచితే.. 2014 ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డికి 1,24,576 ఓట్లు, టిడిపి అభ్యర్థి ఎస్ వెంకట సతీష్ కుమార్ రెడ్డికి 49,333 ఓట్ల లభించాయి. 70 వేల ఓట్ల మెజారిటీతో వైఎస్. జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వారిద్దరు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఆ ఎన్నికలు జగన్‌.. 90,110 ఓట్ల మెజార్టీ సాధించారు. టిడిపి అభ్యర్థి ఎస్ వి సతీష్ కుమార్ రెడ్డికి 42,246 ఓట్లు లభించాయి. 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్. జగన్ సొంత చెల్లెలు వైయస్ షర్మిలతో పాటు బలిజ శక్తిగా మారిన టిడిపి అభ్యర్థి బీటెక్ రవితో కూడా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు.

"దివంగత సీఎం డాక్టర్ వైఎస్ఆర్ పులివెందుల పర్యటనకు వస్తే.. జనం తండోపతండాలుగా వచ్చేవారు. బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎంట్రీ పాయింట్‌లో పోలీసులు వారిని చెక్ చేసి పంపిస్తుంటే.. ఎగ్జిట్ పాయింట్లో నిలబడే డాక్టర్ వైఎస్ పలకరించడం. సమస్యలు వినడం. పరిష్కరించి వారి గుండెల్లో కొలువయ్యారు. కానీ.. గత ఐదేళ్లలో ఆ పరిస్థితి కనిపించని విషయాన్ని పులివెందుల జనం గుర్తు చేసుకుంటున్నారు" అని ఆ ప్రాంతానికి చెందిన ఓ నాయకుడు ఫెడరల్ ప్రతినిధితో తన భావాలు పంచుకున్నారు.

నియోజకవర్గ బాధ్యతలు వైఎస్ఆర్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి పర్యవేక్షించేవారు. తన పరిధిలో ఉన్న పనులు చక్కదిద్దేవారు. సమస్య పెద్దదయితే, వారందరిని తీసుకుని నేరుగా అన్న వైఎస్ఆర్ వద్దకు వెళ్లేవారు. ఆయన హత్యకు గురైన తర్వాత.. పరిస్థితి మారింది. 2014 నుంచి ఎన్నికల వేళ మాత్రమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్లలో కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి.. పులివెందులలో ఉంటున్నారు. ఇది 2014 ముందు, ఆ తర్వాత పరిణామం అది.

1978 నుంచి... ఏకఛత్రాధిపత్యం

పులివెందుల నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి 1975లో యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1978లో ఆయన మొదట ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఆ కుటుంబం తిరుగులేని శక్తిగా మారింది. 1983, 1985 ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించారు. పులివెందుల నుంచి 1998లో ఎమ్మెల్యేగా నాలుగోసారి రీఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల వరకు ఆయనే ఎమ్మెల్యే. ఆయన ప్రస్థానంలో 1982లో మొదటిసారి రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్సైజ్, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1983-1985లో పీసీసీకి సారథ్యం వహించిన 2000 వరకు కూడా అదే బాధ్యతల్లో ఉన్నారు. 1999లో శాసనసభలో ప్రతిపక్షనేత, 2004లో పాదయాత్ర ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం అయ్యారు.

2009 ఎన్నికల్లో కూడా ఆయనే సీఎంగా సారథ్య బాధ్యతలు వహించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ కడప ఎంపీగా వెళ్లడంతో, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన స్వయానా ఆయన బాబాయ్ వైఎస్. పురుషోత్తం రెడ్డి 1991లో, వైయస్ వివేకానంద రెడ్డి 1994లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. 2009 సెప్టెంబర్ రెండో తేదీ నల్లమల అటవీ ప్రాంతం పావురాలగుట్ట సమీప ప్రాంతంలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో 2010, 2011 ఉప ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ఆర్ సతీమణి వైఎస్. విజయమ్మ విజయం సాధించారు. 2014,2019 ఎన్నికల్లో గెలిచిన సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో కూడా పోటీలో ఉన్నారు.

కడప గడపలో..

కడప జిల్లా అంటే వైయస్సార్ బ్రాండ్ ఏర్పడింది. పులివెందుల తర్వాత కడప ఎంపీ స్థానంలో కూడా డాక్టర్ వైఎస్ఆర్ కుటుంబం ఆధిపత్యం కొనసాగుతోంది. 1989లో ఆయన మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. 1998 ఎన్నికల్లో ఆయన వరకు ఆయన కడప ఎంపీగా కూడా విజయం సాధించారు. ఆయన సోదరుడు వైఎస్. వివేకానంద రెడ్డి 1999, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి 2009, 2011 ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించారు. ఆ తర్వాత ఆయన బాబాయ్ కుమారుడు 2014, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా విజయం సాధించి 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కోసం బరిలో ఉన్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో..

పులివెందులలో వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఎవరు బరిలో ఉన్న ఓటర్లు ఆదరిస్తూనే ఉన్నారు. అప్పట్లో ప్రచారానికి వెళ్తే.. " మీరు రావడం ఎందుకు" అని కూడా అడిగిన వాళ్ళు లేకపోలేదు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేవారు. శుభలేఖ తీసుకుని వచ్చిన వారిని " కానుకలు ఇవ్వకుండా పంపించిన దాఖలాలు లేవు" ఆనాటి పరిస్థితులు గుర్తుకు చేసుకుంటున్నారు చెబుతున్న మాటలు.

వైయస్ మరణంతో..

రాజకీయ పరిస్థితులు కూడా మారిపోయాయి. సమీకరణలు తిరగబడ్డాయి. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడమే కాకుండా, వైయస్సార్ కుటుంబంలో కూడా అంతర్గతపోరు ఏర్పడింది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే.. అన్నా - చెల్లెళ్లు, వదిన- ఆడబిడ్డ, మేనత్త- మేనకోడల్లు ప్రత్యర్థులుగా మారిపోయారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత వారి కుటుంబం ప్రతిష్టకు మరకపడింది. ఈ ప్రాంత ప్రజలు ఇది జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి.

ఊహించని పరిణామాలు..

గతంలో ఎన్నికలు కాదు కదా.. సాధారణ రోజుల్లోనే వైఎస్ఆర్ కుటుంబం పల్లెలకు వెళితే దేవుళ్ళు వచ్చినట్లు సంబరపడిపోయేవారు ప్రజలు. 2024 ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. యథావిథిగా ప్రచార సారథ్య బాధ్యతలు తీసుకున్న ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డిని ప్రశ్నించే గొంతుకలో ఎక్కువయ్యాయి. నిజం చెప్పాలంటే మొట్టమొదటిసారి ఆ కుటుంబం ఈ తరహా పరిస్థితి ఎదుర్కొంతున్నది.

" నా ఎస్సీ, నా బిసి, నా మైనారిటీ అంటున్నారు. నా రైతు ఎందుకు అనడం లేదు. పట్టాదారు పాస్ పుస్తకంపైన సీఎం వైఎస్. జగన్ కాదమ్మా. రైతు ఫోటో ఉండాలి. ఈ విషయం జగనన్నకు చెప్పండి" అని వేంపల్లి మండలంలో భాస్కర్ రెడ్డి అనే రైతు సూటిగా ప్రశ్నించారు. దీంతో వైఎస్ భారతిరెడ్డిది దిక్కు తోచని స్థితి. " అమ్మ.. పులిందలలో కాలువలు బాగాలేవు. ఇంటి స్థలం ఇచ్చారు.. ఇల్లు ఎప్పుడు కట్టుకోవాల. మాకు అన్ని అర్హతలు ఉండాయి. అమ్మవడేది. పథకాలు అందలేదు" ఎక్కడికి వెళ్లినా ఇవే నిలదీతలు ఎదురవుతుండడం చూసి భారతి రెడ్డి అవాక్కయ్యారు.

"మీకోసం పనిచేశం. పనులు చేసుకున్నాం. బిల్లులు వేయలేదు" అయిన వాళ్లందర్నీ మీరు పట్టించుకోవడం లేదు. రాజశేఖర్ రెడ్డి సార్ ఉంటే ఇలా జరిగేదా? " అనే మాటలు వినిన భారతిరెడ్డి నీళ్లు నవిలారని చెబుతున్నారు. సహనం నశించిన ఆమె.. రూ. వందల కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది ఇవన్నీ ఏమయ్యాయి అని సన్నిహిత నాయకులను ప్రశ్నించినట్లు సమాచారం. ఇవి మచ్చుక్కు కొన్ని మాత్రమే. ఈ పరిస్థితి ఇలా ఉంటే..

"కొంగు చాపి అడుగుతున్నా..."

ఫ్యాక్షన్ గొడవల్లో రాజీకొస్తే శత్రువైన క్షమించే గుణం రాయలసీమ ప్రాంతానికి ఉంది. పులివెందులలో ఆ విషయం చెప్పాల్సిన పనేలేదు. మాటకు కట్టుబడతారు. వైయస్సార్, ఆయన కుటుంబమైనా.. ఈ ప్రాంతంలో ప్రజలకు భక్తి భావం ఉంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కడప ఎంపీ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల రెడ్డి "అన్నా కొంగు చాపి అడుగుతున్న ఓటెయ్యండి అన్న మాట ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయింది. ఆడబిడ్డ, వైయస్సార్ కుమార్తె ఈ మాట అన్నారు. ఆమె తలుచుకొని బాధపపడని గుండె లేదు" అని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరెడ్డి చెబుతున్నారు.

అవినాష్ కట్టడి కోసం..

వైయస్సార్ కుమార్తె, పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డి బాబాయ్ కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డిపై ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతం వేరు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అవినాష్ విజయానికి పులివెందుల ఓట్లు ప్రతిబింబిస్తాయి. అక్కడే వైయస్ షర్మిల రెడ్డి వేటు వేశారని అంచనా వేస్తున్నారు. వివిధ పరిణామాల నేపథ్యంలో శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు వేంపల్లి సతీష్ రెడ్డి ఇటీవల వైఎస్ఆర్సిపిలో చేరడం కొంత ప్రయోజనం కలిగించేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. ఆయన సొంత మండలం వేంపల్లిలో సీఎం వైఎస్. జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డికి ఎదురైన అనుభవాలను గమనించిన నాయకులు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

గట్టి పోటీ..?

కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామానికి చెందిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి) 2011 లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2017 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల నుంచి మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీగా గెలిచిన బీటెక్ రవి గుర్తింపు పొందడమే కాకుండా, వైఎస్ఆర్ కుటుంబానికి అపజయం రుచి చూపించారు.

ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఆమోదించిన నేపథ్యంలో ఇందుకు నిరసన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీలో ఉన్నారు. గత ఐదేళ్లుగా ఆయన ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్నారు. ప్రస్తుతం పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు వైయస్ షర్మిల రెడ్డితో పాటు టిడిపి అభ్యర్థి బీటెక్ రవి ప్రత్యర్థులుగా మారారు.

పార్టీ మారేందుకు సిద్ధం?

చేసిన పనులకు బిల్లులు రాక. గుర్తింపు గౌరవం లేదంటూ, పులివెందుల, వేంపల్లి, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, చక్రాయిపేట మండలాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు పార్టీ మారేందుకు సంసిద్ధమయ్యారని సమాచారం. కొందరినీ బుజ్జగించి ఇంకొందరిని మరో రకంగా కట్టడి చేసినట్లు తెలిసింది. అయితే ఈ మండలాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కుటుంబంపై అసంతృప్తి చాప కింద నీరులా ఉందని అంటున్నారు. ఇప్పటికే సర్వీస్ ఓట్లు వ్యతిరేకంగా పడినట్లు సమాచారం. మరో నాలుగు రోజుల్లో జరగనున్న పోలింగ్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఎలా ఉంటుంది? మెజారిటీ ఎంత తగ్గే అవకాశం ఉంది అనేది తేలనుంది.

Read More
Next Story