
ఎవరు ఆర్థిక విధ్వంసం చేశారో మీరే చెప్పండి
అప్పులు మీద, వడ్డీల చెల్లింపుల మీద చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని, వాస్తవాలు తెలసుకోవాలని జగన్ కోరారు.
తమ హయాంలో రెండున్నర ఏళ్లు కోవిడ్ ఉంది. అంతకు ముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి అలాంటి సమస్యలేమీ లేవు. అయినా పర్వాలేదు. 2014–19, 2019–24 వరకు రెండు ప్రభుత్వాల డేటాను ఒక సారి చూడండి. పరిశీలించండి. ఎవరి హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందో మీరే చెప్పండి అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కానీ, దేశాభివృద్ధిలో రాష్ట్ర భాగస్వామ్యం కానీ మీరే పరిశీలించి చెప్పాలని జగన్ కోరారు. ఎవరి హయాంలో వృద్ధి రేటు సాధించిందో చెప్పాలని కోరారు. తమ పాలనలో విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు చెబుతున్నారని, ఈ లెక్కలు ఒక సారి చూస్తే ఎవరు ఆర్థిక విధ్వంసానికి పాల్పడ్డారో తెలుస్తుందన్నారు. కాగ్ నివేదిక దీనికి ఉదాహరణ అని, దీనిని కూడా ఒక సారి చూస్తే అసలు విషయం అర్థం అవుతుందన్నారు.
రెండు ప్రభుత్వాలకు సంబంధించిన గణాంకాలను ఆయన పీపీటీ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. 2014–19 చంద్రబాబు హయాంలో మూల ధన వ్యయం రూ. 13,860 కోట్లు అయితే.. తమ హయాంలో మూలధన వ్యయం రూ. 15,632 కోట్లు అన్నారు. సోషల్ సర్వీసెస్ మూల ధన వ్యయం కింద నాటి చంద్రబాబు ప్రభుత్వం రూ. 2వేల కోట్లు ఖర్చు చేస్తే.. తమ ప్రభుత్వం రూ. 5వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. తలసరి ఆదాయంలో చంద్రబాబు ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంటే.. తమ హయాంలో 15వ స్థానానికి పెరిగామన్నారు. చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో ఏపీ జీడీపీ వాటా 4.47 శాతంగా ఉంటే.. వైఎస్‌ఆర్‌సీపీ హయాంలో దేశంలో ఏపీ జీడీపీ వాటా 4.80 శాతానికి పెరిగిందన్నారు. 2014–19 మధ్య కాలంలో పారిశ్రామిక రంగంలో దేశంలో 11వ స్థానంలో ఏపీ ఉంటే.. తర్వాత వచ్చిన తమ ప్రభుత్వ హయాంలో 9వ స్థానానికి చేరుకున్నామన్నారు.
చంద్రబాబు దిగిపోయే నాటికి 18 వస్థానంలో తలసరి ఆదాయం ఉండగా, వైసీపీ హయాంలో తలసరి ఆదాయంలో 15 స్థానానికి పెరిగిందని అన్నారు. ఇక చంద్రబాబు కంటే తామేదో అప్పులు అధికాంగా చేశామని, ఆ అప్పుల మీద చెల్లించాల్సిన వడ్డీలు ఎక్కువుగా ఉన్నాయని, దానిలో వృద్ది రేటు పెరిగిందని తమ ప్రభుత్వాన్ని నిందించేందుకు చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరు ఎక్కువ అప్పులు చేశారో అందరికి తెలియాలన్నారు. చంద్రబాబు దిగిపోయే నాటికి నిబంధనలకు మించి రూ. 31వేల కోట్లు అదనంగా అప్పులు చేశారని, తమ హయాంలో రూ. 17వేల కోట్ల అప్పుల భారం తగ్గించామన్నారు.
చంద్రబాబు హయాంలో కట్టాల్సిన వడ్డీల వృద్దిరేటు 15.43 శాతం కాగా జీఎస్‌డీపీ 13.46 శాతంగా ఉంటే 2019–2024లో కోవిడ్ వచ్చినప్పటికీ ఏపీ వడ్డీలకు వృద్దిరేటు 13.92 శాతానికి తగ్గించగలిగామని, 10.23 శాతం గ్రోత్ రేటు సాధించామన్నారు. చంద్రబాబు హయాంలోనే ఆర్థిక విధ్వసం జరిగితే.. తమ హయాంలో వృద్ది సాధించిందన్నారు.
తాము అధికంగా అప్పులు చేశామని, రూ. 12 లక్షల కోట్లు అప్పులు చేశామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అబద్దాల ప్రచారం చేశారని, కానీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం సంఖ్య మార్చారని అన్నారు. తమ హయాంలో 6.46లక్షలకోట్లు అప్పులు ఉన్నాయని బడ్జెట్‌లో పెట్టారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన దానికి.. బడ్జెట్‌లో చెప్పిన దానికి ఎంత తేడా ఉందో గమనించాలని కోరారు. రూ. 14లక్షల కోట్ల అప్పుల నుంచి మొదలు పెట్టి చివరకు రూ. 6లక్షల కోట్ల దగ్గరికి వచ్చి ఆగిపోయారన్నారు. చంద్రబాబు అబద్దాలు ఇలానే ఉంటాయన్నారు.
Next Story