ఆ పదాలను మాట్లాడటం మానేయాలి
x

ఆ పదాలను మాట్లాడటం మానేయాలి

శాసన సభ సాక్షిగా తల్లిని అవమానించారు..సొంత తల్లిని చెల్లిని మెడబట్టి బయటకు నెట్టేశారని జగన్‌మీద లోకేష్‌ ధ్వజమెత్తారు.


మంత్రి నారా లోకేష్‌ మరో సారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. కడప మహానాడులో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో శాసన సభ సాక్షిగా తల్లులను అవమానించారని జగన్‌పై లోకేష్‌ విరుచుకు పడ్డారు. అంతేకాకుండా ఆస్తుల కోసం సొంత తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి మెబట్టి బయటకు నెట్టేశారని జగన్‌పై మండిపడ్డారు.

భవిష్యత్‌ కోసం ఆరు శాసనాలు ప్రతిపాస్తున్నట్లు లోకేష్‌ చెప్పారు. 1 తెలుగు జాతి విశ్వవిఖ్యాతి, 2. యువగళం, 3. స్త్రీ శక్తి, 4. పేదల సేవల్లో సోషల్‌ ఇంజనీరింగ్, 5. అన్నదాతకు అండగా, 6. కార్యకర్తలే అధినేత వంటి ఆరు శాసనాలను ప్రతిపాదించారు. ఇందులో స్త్రీ శక్తి గురించి లోకేష్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ హయాంలో శాసన సభలో తన తల్లి నారా భువనేశ్వరి మీద నాటి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే జగన్‌ కుటుంబంలో చోటు చేసుకున్న ఆస్తుల గొడవల గురించి, ఆ నేపథ్యంలో జగన్‌ కుటుంబంలో చోటు చేసుకున్న గొడవల గురించి ప్రస్తావించారు. ఆస్తుల కోసం తన సొంత తల్లిని, చెల్లిని మెడబట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని జగన్‌ మీద వ్యంగాస్త్రాలు సంధించారు. దానిని కొనసాగిస్తూ.. అర్థమైందా రాజా.. అర్థమైందా రాజా అంటూ రెండు సార్లు వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఉద్దేశించి సెటైర్లు విసిరారు. ఈ మాటలు పలుకుతున్న సందర్భంలో సభలోని టీడీపీ శ్రేణులు ఈలలు వేస్తూ, చప్పట్ల చరుస్తూ లోకేష్‌ను అనుసరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానిని కూడా జైల్లో వేశారు.
ఈ సందర్భంగా కేసులు, చట్టాల గురించి లోకేష్‌ ప్రస్తావించారు. కేసులు పెట్టడం వల్ల, జైలలో పెట్టడం వల్ల సమాజంలో మార్పులు రావన్నారు. సమాజంలో మర్పులు రావాలంటే చట్టాలు, శిక్షలు వల్ల కాదని, మన ఇంటి నుంచే మార్పులు రావాలన్నారు.
గాజులు తొడుక్కున్నావా.. చీరలు కట్టుకున్నావా.. వంటి మహిళలను అగౌరవ పరిచే పదాలను మాట్లాడటం మానేయాలని సూచించారు. అలా మహిళలను చిన్న చూపు చూసే విధంగా, కించ పరిచే విధంగా మాట్లాడ కూడదని సూచించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మహిళా మంత్రి తనకు చీరలు, గాజులు పెడతామని మాట్లాడారని, తనకు చీరా, గాజులు పంపండి వాటిని తన అక్కా, చెల్లిళ్లకు పెట్టి, వాళ్ల కాళ్లకు మొక్కి వారి ఆశీర్వాదం తీసుకుంటానని నాడే ఆ మహిళా మంత్రికి కౌంటర్‌ ఇచ్చానని చెప్పారు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యమని అన్నారు. ప్రపంచంలో అందరి కంటే ముందుండాలనే ఉద్దేశంతో ఈ ఆరు శాసనాలను తెరపైకి తెచ్చినట్లు లోకేష్‌ వెల్లడించారు.
Read More
Next Story