మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు!
x

మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు!

డిజిటల్ మోసాలకు అంతులేకుండా పోయింది. ఫోన్ లు చేసి కోట్లు దోచేస్తున్నారు. ఫోన్ ద్వారా మాటల్లోనే అరెస్ట్ చేస్తున్నారు. ఏమిటిది? ఎలా జరుగుతోంది?


ఆంధ్రప్రదేశ్ లో రెండు నెలలుగా డిజిటల్ మోసాలు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేసి డిజిటల్ నేరాలను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలించడం లేదు. విజయవాడ నగరంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు భయాన్ని తెప్పిస్తున్నాయి. ప్రతి రోజూ సైబర్ నేరాల పోలీస్ స్టేషన్ వద్ద వందల కొద్ది జనం ఉంటున్నారు. సాధారణ పోలీస్ స్టేషన్ల కంటే సైబర్ పోలీస్ స్టేషన్ వద్ద జనం గుమికూడి ఉండటం చూస్తుంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు ఎవరికైనా కలుగుతాయి. సైబర్ మోసాలకు గురవుతున్న వారంతా కోటీశ్వరులే కావడం విశేషం. మోసపోయామని చెప్పుకునేందుకు వారు సిగ్గుపడుతున్నారు. మా పేర్లు, మా పిల్లల పేర్లు చెప్పొద్దంటూ సైబర్ పోలీసులను బాధితులు వేడుకుంటున్నారు. అంటే ఏ స్థాయి వారిని మోసం చేసేందుకు పని కట్టుకుని సైబర్ నేరగాళ్లు పావులు కదుపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

వ్యక్తిగత సమాచారం వారికి ఎలా తెలుస్తోంది...

సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి మోస పోతున్న వ్యక్తుల గురించి సమాచారం ఎలా తెలుస్తోందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సైబర్ నేరాలు పరిశీలిస్తూ, పరిశోధిస్తున్న పోలీసులకు కూడా అర్థం కావటం లేదు. నేరస్తులు ఫోన్ చేయగానే ఇంట్లోని పిల్లల పేర్లు, వారు ఎక్కడ చదువుతున్నారు. ఏ క్లాస్ చదువుతున్నారు. ఉద్యోగులైతే ఏ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు, వారి పిల్లలు విదేశాల్లో ఉంటే ఏ కంట్రీలో ఉంటున్నారు. ఆ కంట్రీలో ప్రస్తుతం వారు ఏమి చేస్తున్నారు. వారి పేర్లు వంటి వివరాలు వెనువెంటనే చెబుతున్నారు.

కేవైసీ ద్వారానే వివరాలు తెలుస్తున్నాయా..?

ఆదార్ కార్డ్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, సెల్ ఫోన్ నెంబర్లను కేవైసీ చేస్తున్నారు. నిజానికి ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలకు సంబంధించినది. దీనిని వ్యక్తిగతంగానే ఉంచాల్సింది పోయి అధికారులు, ఇతర కంపెనీల వారు ఆధార్ నెంబర్, పాన్ కార్డును కలిపి కేవైసీ చేయడం వల్ల అందులో ఫోన్ నెంబరు ఉండిపోతోంది. ఆదార్ నుంచి వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి. పాన్ కార్డు ద్వారా ఆ వ్యక్తి టాక్స్ కు సంబంధించిన వివరాలు తెలుస్తున్నాయి. ఫోన్ నెంబరు ద్వారా పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీలు కలుగుతోంది. ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం ద్వారా సమాచారాన్ని డిజిటల్ దొంగలు తెలుసుకునేందుకు వీలు కలుగుతోందనే అనుమానాన్ని సైబర్ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి వ్యక్తిగత వివరాలు నేరగాళ్లు చెప్పడం విశేషం. ప్రస్తుతం ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు అనే విషయం కూడా ఫోన్ నెంబర్ ను ఉపయోగించి చెప్పటం విశేషం. ఓటీపీలు నెంబర్లు మన నోటి నుంచే చెప్పించి డబ్బులు దోచుకుంటున్నారు. సమాచార వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిందని ఆనందించే కంటే ఆ సమాచార వ్యవస్థ ద్వారా భారీ దోపిడీలు జరుగుతున్నాయనే బాధ కూడా ఎక్కువవుతోంది.

ఓ కోటీశ్వరుని కుమార్తె ఎలా మోసపోయిందంటే...

విజయవాడ గాయత్రీ నగర్ కు చెందిన ఒ కోటీశ్వరుడి కుమార్తె ఎలా మోసపోయిందో తెలుసుకుంటే గుండె దడ ఎక్కువవుతుంది. నేడు ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. అకౌంట్లలో అంతో ఇంతో డబ్బులు వుంటున్నాయి. బాధితుల నోటి నుంచే అకౌంట్లో ఎంత ఉన్నాయో చెప్పించి వారి ద్వారానే ఫోన్ పే, గూగుల్ పే వంటి ఇతర డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా డబ్బును దోచుకునే వారు వారికి కావాల్సిన అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్నారు. గాయత్రీ నగర్ లోని అన్నం వెంకట రమణారావు (పేరు మార్చాము) కుమార్తె హైందవి (25) (పేరు మార్చాము) హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. రెండు రోజుల క్రితం తల్లిదండ్రులను చూసేందుకు విజయవాడ వచ్చింది. ఉదయం పదిన్నర ప్రాంతంలో ఒక వీడియో కాల్ వచ్చింది. ముంబయి పోలీసుల మంటూ మాట్లాడారు. మీకు ఒక కొరియర్ వచ్చిందని, అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే మీరు డిజిటల్ అరెస్ట్ అయి ఉన్నారని భయపెట్టారు. వీడియో కాల్ చేసిన వారు పోలీస్ డ్రెస్ లో ఉండటం, వారి వెనుక వైపున పోలీస్ స్టేషన్ వాతావరణం ఉండటం వల్ల పోలీసులే ఫోన్ చేశారనే భావన వచ్చి ఆ యువతి భయంతో వణికి పోయింది. మీరు అరెస్ట్ కాకుండా తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నావద్ద ప్రస్తుతం డబ్బులు లేవని చెప్పినా వినలేదు. ఫిక్స్ డ్ డిపాజిట్లో రెండు కోట్లు పైనే ఉన్నాయని, వెంటనే విత్ డ్రా చేసి ఇవ్వాలని పట్టుబట్టారు. ఫిక్స్ డ్ డిపాజిట్లలో అమౌంట్ ఉన్న విషయం కూడా తెలుసుకున్నారంటే వీరి వద్ద చాలా సమాచారం ఉందని భయపడిన యువతి తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా బ్యాంకుకు వెళ్లి డిపాజిట్ విత్ డ్రా చేసి ఆ డబ్బులో రూ. 1.25కోట్లు వారు చెప్పి అకౌంట్స్ కు బదిలీ చేసింది. ఒక రోజు తరువాత విచారించి మోసం జరిగిందని తెలుసుకుని విజయవాడలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో గత శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సమయానికే వీరు ఏ అకౌంట్స్ కు అయితే ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రూ. 40 లక్షల వరకు బ్యాంకు అకౌంట్లలో ఉన్నాయని, మిగిలిన డబ్బును డ్రా చేసుకుని దొంగలు పరారయ్యారని పోలీసులు తెలిపారు. అంటే ఇందులో కేవలం సాఫ్ట్ వేర్ రంగంలో ఉండే సైబర్ నేరస్తులే కాకుండా కొరియర్ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ముఠాలుగా ఏర్పడి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మోసపోయిన ఓ ప్రైవేట్ పంపెనీ ఉద్యోగి

విజయవాడలోని కామయ్యతోపు ప్రాంతంలో నివశిస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి కూడా రెండు నెలల క్రితం సైబర్ నేరస్తుల భారిన పడ్డారు. ఆయన కుమార్తెను ఇటీవల అమెరికాలో చదువుకునేందుకు పంపించారు. ఆయన భార్య ప్రభుత్వ ఉద్యోగి. వారి పేర్లు వెల్లడించేందుకు వారు ఇష్ట పడలేదు. ఈయన కంపెనీలో విధుల్లో ఉన్న సమయంలో వీడియో కాల్ యూపీ నుంచి వచ్చింది. తాము యూపీ పోలీసుల మని, మీరు మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఆలోచించుకునే లోపు తీవ్ర భయాందోళనలు వచ్చేలా చేశారు. వారు వీడియో కాల్ చేసిన ప్రాంతంలో పోలీసులు హడావుడిగా తిరుగుతున్న సీన్లు కనిపిస్తున్నాయి. వీడియో కాల్ లో వాతావరణం గమనిస్తే అందులో ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ కమిషనరేట్ నుంచి వారు మాట్లాడినట్లు అనిపించిందని మోసపోయిన ఉద్యోగి తెలిపారు. వాళ్ల హడావుడి, అక్కడ జరుగుతున్న పరిణామాలు వీడియో కాల్లో మనం గమనిస్తే ఏ క్షణమైనా వచ్చి తనను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు పోతారనే భయానక వాతావరణం కనిపించిందని, అందుకే వారు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని ఆ ఉద్యోగి తెలిపారు. వారు వాట్సాప్ కాల్ లో ఉండగానే తాను ఇంటికి వచ్చి ఇంట్లో వారికి ఏ విషయం చెప్పకుండా వారు చెప్పినట్లు చేశానని, ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకుని కుర్చీలో కదలకుండా కూర్చుని వారు చెప్పిన విధంగా బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు వారి అకౌంట్ కు బదిలీ చేసినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో మీ ఆదార్ కార్డు పేరులో ఉన్న వివరాల ప్రకారం మీరు పలానా వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నారని మనీలాండరింగ్ కు పాల్పడిన ఓ ముస్లీమ్ నిందితుని ఫోటో పంపించారు. ఆ వెంటనే సీబీఐ తనను అరెస్ట్ చేసినట్లు వాట్సాప్ లోనే ఒక లెటర్ పంపించారు. ఈడీ చార్జ్ షీట్ రెడీ చేసినట్లు మరో లెటర్ పంపించారు. మీరు మనీ లాండరింగ్ కు పాల్పడినా పాల్పడకపోయినా మీ ఆధార్ నెంబరు ద్వారానే జరిగినందున మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని, మిమ్మల్ని ఇప్పటికే డిజిటల్ అరెస్ట్ చేశామని, మీరు ఎక్కడికి కదిలినా ఆ కదలికలు అన్నీ తమకు కనిపిస్తాయని చెప్పి భయంతో వణికించారని ఆయన తెలిపారు. వారి హడావుడి, వారు పంపిస్తున్న లెటర్స్ చూసిన తరువాత ఎవరికైనా నిజమేననిపిస్తుందని బాధితుడు వాపోయారు. తాను ఇదంతా నిజమేనా అని తేరుకోవడానికి ఒక రోజు పట్టిందని, ఆ వెంటనే విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Read More
Next Story