ఏచూరి వారసుడు బీవీ రాఘవులు? తాత్కాలికంగా కారత్ దంపతుల్లో ఒకరికి ఛాన్స్
x

ఏచూరి వారసుడు బీవీ రాఘవులు? తాత్కాలికంగా కారత్ దంపతుల్లో ఒకరికి ఛాన్స్

సీపీఎం ప్రధాన కార్యదర్శిగా మరో తెలుగు వ్యక్తి ఎంపికయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేరళ, బెంగాల్ యూనిట్లు ఓకే అంటే బీవీ రాఘవులు ఏచూరి వారసుడైనట్టే.


సీతారామ్ ఏచూరి ఆకస్మిక మరణంతో సీపీఎం తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరనే దానిపై తర్జన భర్జన జరుగుతోంది. ప్రస్తుత పాలిట్ బ్యూరో నుంచే ఎవరో ఒకర్ని తాత్కాలికంగా నియమించుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో తమిళనాడు మధురైలో పార్టీ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. ఆ సభలో కొత్త నాయకుణ్ణి ఎన్నుకునేంత వరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎవరో ఒకర్ని నియమించుకోవాలి. పార్టీ నిబంధనావళి ప్రకారం ఏ వ్యక్తి అయినా మూడు సార్లకు మించి ప్రధానకార్యదర్శిగా ఉండడానికి వీలు లేదు. 75 ఏళ్ల వయసు మించకూడదు. మూడు సార్లుగా ఆ పోస్టులో ఉన్న సీతారాం ఏచూరి పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగుస్తుంది. దానికి ముందే ఆయన మరణించడంతో ఆ బాధ్యతను ఎవరికి అప్పగించాలనే దానిపై పార్టీ నాయకత్వం యోచిస్తోంది. ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం ఏచూరి వారసుడిగా రాఘవులు, ఎంఏ బేబీ, బృందా కారత్ లలో ఎవరో ఒకర్ని నియమిస్తారని భావిస్తున్నారు.

తాత్కాలిక నేత భవిష్యత్ ప్రధాన కార్యదర్శి!
ఏచూరి భౌతిక కాయాన్ని ఢిల్లీలోని ఏయిమ్స్ ఆస్పత్రికి దానం చేసిన తర్వాత ఢిల్లీలో సంస్మరణ సభ జరుగుతుంది. దీని తర్వాత సెప్టెంబర్ 27న సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశమవుతుంది. వచ్చే మహాసభలు జరిగేంత వరకు తాత్కాలికంగా ఎవర్ని నియమించాలనే దానితో పాటు వచ్చే మహాసభల్లో ఎవర్ని జనరల్ సెక్రటరీగా పెట్టొచ్చు దాన్నీ ప్రధానంగా చర్చిస్తుంది.
తమిళనాడులోని మధురైలో వచ్చే ఏప్రిల్‌లో సీపీఎం 24వ జాతీయ మహాసభలో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. ఏచూరి మరణంతో ఏర్పడిన ఈ ఖాళీలో అప్పటి వరకు పార్టీని నడిపించేందుకు ఓ సీనియర్ నేతను ఇన్ చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నామినేట్ చేసే అవకాశం ఉంది. ఏచూరి తన మూడోసారి పదవీకాలాన్ని ఏప్రిల్‌లో పూర్తి చేయడానికి ముందే మరణించడంతో పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిపైనా చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నియమించే తాత్కాలిక ప్రధాన కార్యదర్శినే మహాసభలోనూ ఎన్నుకునేలా చూడాలని కూడా నాయకత్వం ఆలోచన. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని కేంద్ర కమిటీ చర్చిస్తుంది. ఆ తర్వాత పార్టీ మహాసభలో ప్రతిపాదించి ఎన్నిక నిర్వహిస్తారు. అందువల్ల ఇప్పుడు నియమించే తాత్కాలిక ప్రధానకార్యదర్శి భవిష్యత్ నాయకుడు అయ్యే అవకాశం లేకపోలేదు.
కారత్ దంపతులూ సీనియర్లే...
పార్టీ పాలిట్ బ్యూరోలో ఇప్పుడున్న వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడు సార్లు వ్యవహరించిన వారు ప్రకాశ్ కారత్. ఆయనకు మంచి అనుభవం ఉంది. ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మళయాళం వంటి భాషలు వచ్చు. బెంగాలీ, తెలుగు అర్థమవుతుంది. ఉత్తరాది రాష్ట్రాలలో ప్రత్యేకించి ఢిల్లీలో నెట్టుకురావాలంటే హిందీ, ఇంగ్లీషు అనర్ఘళంగా మాట్లాడగలిగే వారు కావాలి. భాష అడ్డంకి కాదనే అభిప్రాయం ఉన్నా ఇప్పటి పరిస్థితుల్లో కమ్యూనికేషనే ప్రధానం. అందువల్లే వచ్చే మహాసభల వరకు ఆయన్నే ఇన్చార్జ్ గా ఉండమని పాలిట్ బ్యూరో కోరవచ్చు. ఒకవేళ ఆయన తిరస్కరిస్తే ఆయన భార్య బృందా కారత్ కూడా పార్టీ పాలిట్ బ్యూరో సభ్యురాలే. రాజకీయాల్లో పేరున్న వ్యక్తి. జాతీయస్థాయి గుర్తింపు ఉంది. మాజీ ఎయిర్ హోస్టెస్ కావడంతో హిందీ, ఇంగ్లీషుతో పాటు వివిధ భాషల్ని మాట్లాడగలిగే స్థాయి ఉంది. ఆమెకు బాధ్యతలు అప్పగిస్తే మంచిదని ఓ వర్గం భావిస్తోంది. కానీ వీరిద్దరికీ పార్టీ నిబంధనావళి ప్రకారం 75 ఏళ్ల వయోపరిమితి ఆటంకం అవుతుంది. అందువల్ల తాత్కాలిక బాధ్యతలు అప్పగించవచ్చు.
కొత్త వాళ్లను ఎన్నుకోవాలంటే...

వీళ్లిద్దరూ కాకుండా ఏదైనా కొత్త ముఖాన్ని పార్టీకి పరిచయం చేయాలనుకుంటే సీపీఎం పూర్తిస్థాయి ప్రధాన కార్యదర్శి పదవికి కేరళకు చెందిన ఎంఏ బేబీ లేదా ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీవీ రాఘవులు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన నీలోత్పల్ బసు ఎంపిక కావచ్చు. అయితే రాఘవులు, ఎంఏ బేబీకి వారి వారి ప్రాంతీయ భాషల్లో దిట్టలు. హిందీ, ఇంగ్లీషు అర్థమైనా ధారాళంగా మాట్లాడలేరని పార్టీ వర్గాల వ్యాఖ్య. లోతైన అవగాహన, అధ్యయనం, సమస్యను అర్థం చేసుకునే తీరు వీరి సొంతం. పార్టీ జాతీయ మహాసభలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉన్నందున అప్పటి వరకు ఎవరో ఒకర్ని ఇన్ చార్జీని చేయాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి ఛాన్స్ దక్కుతుంది. పాతవాళ్లకు బదులు ఓ కొత్త వ్యక్తిని పరిచయం చేసినట్టవుతుంది. పార్టీ పాలిట్ బ్యూరోలో ఇంకొద్ది మంది సీనియర్లు ఉన్నా వారందరికీ ప్రస్తుతం ఉన్న 75 ఏళ్ల వయోపరిమితి నిబంధన ఆటంకం కావొచ్చు. మాణిక్ సర్కార్, సూర్య కాంత మిశ్రా, సుభాషిణి అలీలతో సహా ప్రకాశ్ కారత్ కి కూడా ఈ 75 ఏళ్ల వయో నిబంధన అడ్డం వస్తుంది. అందువల్ల కొత్తవారికి అవకాశం లభించవచ్చు. ఏదైనా కారణాలతో వయో పరిమితి నిబంధన సడలిస్తే తప్పుడు సంకేతాలు పోతాయని, అందువల్ల ఎంఏ బేబీ, రాఘవుల్లో ఒకరికి పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చునని పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు.
అందరికీ ఆమోదయోగ్యుడై ఉండాలి...
ప్రస్తుత సంకీర్ణ రాజకీయాల కాలంలో ఏచూరి వారసుడిగా ఉండే వ్యక్తి ఇతర ప్రతిపక్ష పార్టీలలో సంప్రదింపులకు ఆమోదయోగ్యమైన నాయకుడై ఉండాలి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఇతర పక్షాలతో మాట్లాడగలిగి ఉండాలి. పార్టీలోపల,బయటా ఉండే వివాదాలను పరిష్కరించగలిగే స్థాయితో పాటు అవసరమైనపుడు పార్టీ క్యాడర్ ను సముదాయించగలిగే ప్రాసంగికత కూడా అవసరం అని ఆ కేంద్ర కమిటీ సభ్యుడు అన్నారు.
బీవీ రాఘవులుకే ఛాన్స్ ఎక్కువ...

పార్టీ కొత్త ముఖాన్ని ఏంచుకుంటే ఆంధ్రా నాయకుడు రాఘవులుకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీకి సుదీర్ఘ కాలం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఢిల్లీకి మకాం మార్చినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల పార్టీ నాయకత్వంతో సత్సంబంధాలున్నాయి. ప్రస్తుతం పాలిట్ బ్యూరో సభ్యునిగా ఉంటూ పార్టీ ఎడ్యుకేషన్ విభాగానికి బాధ్యులుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పార్టీ కార్యదర్శిగా వ్యవహరించిన కాలం నుంచే ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు అన్ని రాజకీయ పార్టీల నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన బీవీ రాఘవులు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ చేశారు. ఆయన భార్య పుణ్యవతి కూడా పార్టీ కేంద్రకమిటీ సభ్యురాలే. వారికి ఒక కుమార్తె. పార్టీ పాలిట్ బ్యూరోలో ఉన్న వారిలో తక్కువ వయసున్న వ్యక్తి బీవీ రాఘవులు. అందువల్ల ఆయనకే వచ్చే మహాసభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కవచ్చునని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఆయన ఈ పదవిని తిరస్కరిస్తే పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళ కి దక్కే ఛాన్స్ ఉంది. పాలిట్ బ్యూరో లో కేరళ నుంచి బేబీతో పాటు ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్, ఏ విజయరాఘవన్ ఉన్నారు. బేబీ పార్టీ ప్రధాన కార్యదర్శి కావాలంటే అది ఖచ్చితంగా కేరళ పార్టీ, ముఖ్యంగా పినరయి వైఖరిపై ఆధారపడి ఉంటుంది. నాలుగు దశాబ్దాల కిందట బేబీ తర్వాతే ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడిగా ఏచూరి బాధ్యతలు చేపట్టారు. అందువల్ల బేబీ- ఏచూరి వారసుడైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
పశ్చిమ బెంగాల్ పోటీ పడితే...
ఏచూరికి నిజమైన వారసులం తామే నంటూ ఒకవేళ పశ్చిమ బెంగాల్ పార్టీ యూనిట్ పట్టుబడితే ఆ రాష్ట్రం నుంచే ఇద్దరు ముగ్గురు పోటీ పడే అవకాశం ఉంది. ట్రేడ్ యూనియన్ నాయకుడు సేన్, సీనియర్ నాయకుడు మహమ్మద్ సలీం పోటీ పడినా నిలోత్పల్ బసుకే అవకాశాలు ఎక్కువ.
కేరళ యూనిట్ జైకొడుతుందా...
2022 ఏప్రిల్‌లో కేరళ కన్నూరు పార్టీ మహాసభలో సీతారామ్ ఏచూరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా మూడోసారి పోటీ పడినపుడు మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ భార్య బృందా కారత్ ఢీ అంటే ఢీ అన్నారు. ఎందుకంటే ఆ అవకాశం మిస్ అయితే పార్టీ నిర్ణయించిన వయోపరిమితి కారణంగా ఆమెను మళ్లీ పదవికి అర్హురాలయ్యే ఛాన్స్ రాదు. 2015, 2018లో కూడా పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎస్ రామచంద్రన్ పిళ్లై, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్‌ బృందా కారత్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ఇప్పుడు ఏకంగా అవకాశమే లేకుండా పోయింది. అందువల్ల బీవీ రాఘవులుకే ఎక్కువ అవకాశాలున్నాయి.


Read More
Next Story