
వైసీపీ ‘వెన్నుపోటు’.. జనసేన ‘పీడావిరగడ’
వైఎస్‌ఆర్‌సీపీకి కౌంటర్ ఇచ్చేందుకు జనసేన రంగంలోకి దిగతుండగా.. టీడీపీ, బీజేపీలు సైలెంట్‌గా ఉన్నాయి.
జూన్ 4న పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించేందుకు వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కూటమిని ఎండగట్టాలని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునివ్వగా.. వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ కార్యక్రమానికి వ్యతిరేకంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసన శ్రేణులకు దిశానిర్థేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 4 నాటికి ఏడాది కాలం పూర్తి అవుతుంది. మే 13న ఎన్నికలు జరగ్గా.. జూన్ 04న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించగా వైసీపీ చతికిలబడింది. 175 స్థానాలకు గాను కూటమి 164 సీట్లను కైవసం చేసుకోగా, వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ 135 సీట్లు, జనసేన 21, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి.
జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఎన్నిçకల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని, అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి వారి చేత ఓట్లు వేయించుకొని తర్వాత హామీలను అమలు చేయించకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, అందువల్ల జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టాలని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. తనకు పల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌ను మోసం చేసి, వెన్నుపోటు పొడిచి పార్టీని చంద్రబాబు లాక్కున్నట్టే, అబద్దపు హామీలతో మభ్యపెట్టి ఓట్లేయించుకొని రాష్ట్ర ప్రజలను కూడా చంద్రబాబు మోసం చేసి వారిని వెన్నుపోటు పొడిచారని వైసీపీ ముఖ్య నాయకుడు సజ్జల కృష్ణారెడ్డి ఇప్పటికే విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తి అవుతున్న నేపథ్యంలో జూన్4న వెన్నుపోటు దినం పేరుతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని వైసీపీ నిర్ణయించుకుంది.
అయితే అధికారంలో ఉన్న కూటమి భాగస్వామి పార్టీ అయిన జనసేన.. వైసీపీ వెన్నెపోటు దినంకు కౌంటర్‌గా వైసీపీ పీడా విరగడైన దినంగా జూన్ 4న నిర్వహించాలని నిర్ణయించింది. సంక్రాంతి, దీపావళి పండుగలను కలిపి జూన్ 4న నిర్వహించుకోవాలని, ఆ రోజు ఇళ్ల వాకిళ్ల ముందు ముగ్గులతో అలంకరించుకోవాలని, ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని, బాణ సంచా కాల్చాలని, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి పెద్ద వేడుకలాగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ పీడావిరగడైన దినం వేడులను రికార్డు చేసి, సమాజిక మాధ్యమాల్లో విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేపట్టాలని జనసేన శ్రేణులకు పవన్ కల్యాణ్ దిశానిర్థేశం చేశారు. అయితే కూటమి ప్రధాన భాగస్వామి అయిన టీడీపీ, మరో భాగస్వామి పార్టీ బీజేపీలు ఇప్పటి వరకు సైలెంట్‌గానే ఉన్నాయి. దీనిపై ఎలాంటి కార్యక్రమాలను ప్రకటిస్తాయో అనేది ఆకసక్తికరంగా మారింది.
Next Story