రిమాండ్‌కు వైసీపీ సోషల్‌ మీడియా మహిళా కార్యకర్త
x

రిమాండ్‌కు వైసీపీ సోషల్‌ మీడియా మహిళా కార్యకర్త

సోషల్‌ మీడియాలో అసభ్యకరపోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.


పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణికి 14 రోజుల పాటు రిమాండ్‌ విధిస్తూ గురజాల కోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మందకృష్ణను అవమానించారంటూ మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్‌ల మీద పాలేటి కృష్ణవేణి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణల మీద పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి గురజాల కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు మీద విచారణ జరిపిన గురజాల కోర్టు జడ్జి పాలేటి కృష్ణవేణికి 14 రోజలు పాటు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణిని గుంటూరు జైలుకు తరలించారు.

వైసీపీ సోషల్‌ మీడియా మహిళా కార్యకర్త పాలేటి కృష్ణవేణిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు తొలుత ఆమెను ఎల్‌బీనగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ స్టేషన్‌కు వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు రాకుండా పోలీసు స్టేషన్‌ మెయిన్‌ గేటుకు బేడీలు వేసి తాళాలేశారు. పోలీసు స్టేషన్‌ గేట్లకు తాళాలేయడం ఏంటని విమర్శలు వచ్చాయి.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన సోషల్‌ మీడియా మహిళా కార్యకర్త పాలేటి కృష్ణవేణిపై అనేక ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, ప్రభుత్వ పెద్దల మీద మార్ఫింగ్‌ చేసిన ఫొటోలతో అసభ్యకరమైన రీతిలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలు కృష్ణవేణిపై ఉన్నాయి. పాలేటి కృష్ణవేణిది పల్నాడు జిల్లా. చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి ఆమె సొంతూరు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ మీద అసభ్యకర పోస్టులు పెట్టారనే కారణంతో కర్నూలు జిల్లాకు చెందిన పుష్పరాజ్‌ అనే వ్యక్తిని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు కడపకు చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 680మంది సోషల్‌ మీడియా కార్యకర్తలకు పోలీసులు నోటీసులు అందించారు. వీరిలో సుమారు 30 మంది సోషల్‌ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
Read More
Next Story