వైసీపీని వీడాలన్న ఆలోచనలో బాలినేని.. రంగంలోకి విడదల రజిని
మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అతి త్వరలోనే వైఎస్ఆర్‌సీపీని వీడనున్నారన బలమైన ప్రచారం సాగుతోంది
మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అతి త్వరలోనే వైఎస్ఆర్‌సీపీని వీడనున్నారన బలమైన ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన వైసీపీని వీడి జనసేనలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీరు నచ్చక పార్టీ మారుతున్నట్లు సమాచారం. ఒంగోలులో బలిజ, కాపు సామాజిక వర్గం బలంగా ఉంది. వారంతా జనసేన వైపునే ఉన్నారు. గతంలో కూడా తనకు పార్టీ తీరు ఏమాత్రం నచ్చడం లేదని బాలినేని బాహాటంగానే చెప్పారు. ఈవీఎంల అంశంపై కేసు పెట్టినప్పుడు కూడా తనకు పార్టీ నుంచి ఎటువంటి మద్దతు అందలేదని ఆయన అసహం, అసంతృప్తి వ్యక్తం చేశారాయన. ఈ కొంత కాలంలో ఈ అసహనం కాస్తా మరింత అధికమైనట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. జనసేనతో చర్చించిన అనంతరం ఈ నెలలోనే వైసీపీని వీడాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తనతో కలిసి ఉన్న దాదాపు 20 మంది కార్పొరేటర్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 20 మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను హైదరాబాద్ పిలిపించి క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో ఇది కీలక అంశంగా మారింది. ఒకవేళ ప్రచారం జరుగుతున్నట్లే బాలినేని పార్టీని మారితే మాత్రం ఏపీలో వైసీపీ తీవ్రంగా బలహీన పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. దీనిని పసిగట్టే ఎలాగైనా బాలినేని పార్టీలోనే కొనసాగేలా చేయాలని వైసీపీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారని, ఇందులో భాగంగానే బాలినేనితో మంతనాలు జరపడానికి మాజీ మంత్రి విడదల రజినిని రంగంలోకి దింపింది వైసీపీ.
హైదరాబాద్‌లో బాలినేని క్యాంపు రాజకీయాలు
హైదరాబాద్‌లోని తన నివాసంలో ఒంగోలుకు చెందిన వైసీపీ కార్పొరేటర్లో బాలినేని తన క్యాంపు రాజకీయం స్టార్ట్ చేశారు. తాను భవిష్యత్తులో ఏం చేయనున్నది, ఎలా చేయనున్నది వారికి వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరినీ త్వరపడొద్దని, ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకునే తాను నిర్ణయం తీసుకుంటానని, తాను పార్టీ మారితే ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇందులో బాలినేని ముఖ్య అనుచరులు కూడా ఉన్నారు. దీంతో బాలినేనితో రాయబారం జరపడానికి మాజీ మంత్రి విడదల రజినీతో పాటు సతీష్ రెడ్డి కూడా హైదరాబాద్‌లోని బాలినేని నివాసానికి చేరుకున్నారు. పార్టీ మారాలన్న ఆయన నిర్ణయంపై వారు సుదీర్ఘ చర్చలు చేశారు.
బాలినేనికి జగన్ ఆఫర్ ఇదే..
పార్టీ మారలన్న ఆలోచనతో బాలినేని ఉన్నారని, హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఆయన క్యాంపు రాజకీయాలు ప్రారంభించారని ఒకవైపు ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు దీనికి ధీటుగా తన పార్టీ మార్పు అంశంపై బాలినేని బుధవారం వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో చర్చించారని.. జగన్ ఆయనకు ఓ ఆఫర్ కూడా చేశారన్న ప్రచారం కూడా అంతే జోరుగా సాగుతోంది. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టమని జగన్.. బాలినేనిని కోరారని, అందుకు బాలినేని నో చెప్పారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బాలినేని పార్ట మార్పు కీలకాంశంగా మారిన క్రమంలో గతంలో వైసీపీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ బాలినేని ఏమన్నారంటే..
‘‘పార్టీనే నన్ను దూరం పెడుతూ వస్తోంది. ఈవీఎంలలో గందరగోళం జరిగిందంటూ నేను పోరాడుతున్నాను. హైకోర్టుకు కూడా వెళ్లాను. కానీ ఈ పోరాటానికి పార్టీ నుంచి ఏమాత్రం మద్దతు లేదు. అసలు తనకు పట్టదు అన్న విధంగా పార్టీ వ్యవహరిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేదు. అసలు నన్ను కలవడానికి కూడా పార్టీ పెద్దలు ఆసక్తి చూపలేదు. పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాను. కానీ ఇప్పుడు ఎవరూ నా గురించి పట్టించుకోవట్లేదు. నా వైపు కూడా చూడటం లేదు. అందుకే ఎన్నికల తర్వాత నుంచి మాత్రం పార్టీకి నేనే దూరంగా ఉండటం ప్రారంభించా’’ అని చెప్పారు.
వైసీపీతో వివాదానికి కారణాలివేనా..?
వైసీపీ పెద్దలకు, బాలినేనికి ఎన్నికల టికెట్ కేటాయింపు విషయంలో మాటామాటా పెరిగిందని, అదే వివాదంగా మారిందని కూడా ప్రచారం జరుగుతోంది. టికెట్ తనకు ఇవ్వాలని బాలినేని.. వైసీపీ అధిష్టానాన్ని కోరారని, కానీ అందుకు నిరాకరించిన వైసీపీ.. ఆ స్థానంలో వేరే వారిని నిలబెట్టడంతో బాలినేని ఆగ్రహించారని, అందుకే పార్టీ ప్రచారంలో కూడా అంతగా పాల్గొన లేదని ప్రచారం జోరుగా సాగుతోంది. తీరా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. తనను నిలబెట్టి ఉంటే గెలిచి ఉండేవాళ్లమని కూడా అధిష్టానానికి, బాలినేని మధ్య వాదోపవాదాలు జరిగాయని, ఈ విషయంలోనే పార్టీకి, బాలినేనికి మధ్య విభేదాలు మొదలయ్యాయని ప్రచారం సాగుతోంది.