వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఇవాళే?
x

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఇవాళే?

విజయవాడ సిట్ కార్యాలయం వద్ద పోలీసుల హడావిడి.. రేపు ఆదివారం కావడంతో ఆయన్ను ఇవాళే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.


వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇవాళే (జూలై 19) అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. విజయవాడలోని సిట్ కార్యాలయం వద్ద హడావిడి చూస్తుంటే అదే అనుమానం వస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో (Liquor Scam Case) విచారణకు హాజరవుతున్నానని, ఢిల్లీ నుంచి పలానా విమానంలో వస్తున్నానని మిథున్ రెడ్డి సిట్ (SIT) అధికారులకు సమాచారం ఇచ్చారు. లిక్కర్ కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారణ అనంతరం అరెస్ట్ ప్రకటిస్తారని అంచనా. అయితే కోర్టుకు సరైన పత్రాలు సమర్పించని కారణంగా వాయిదా పడే అవకాశం లేకపోలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
మిథున్ రెడ్డి (Mithun Reddy) ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. లొంగిపోయేందుకు సమయం ఇమ్మని కోరినా సుప్రీంకోర్టు కుదరదని తేల్చి చెప్పడంతో ఆయన ఇవాళ విచారణకు హాజరవుతున్నారు. విచారణ అనంతరం సిట్ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

సిట్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వైసీపీ శ్రేణులు ఇప్పటికే సిట్ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నాయి. మీడియా హడావిడి కూడా చాలా ఎక్కువగానే ఉంది. ప్రజలు ఎక్కువ మంది గుమికూడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. పెద్దఎత్తున పోలీసు బలగాలను సిట్ కార్యాలయం వద్ద మోహరింపజేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. 3,500 కోట్ల రూపాయల స్కాంగా చెబుతున్న ఈ కేసుపై మరో రెండు రోజుల్లో చార్జిషీట్ దాఖలు కానుంది. ఈ అంశాన్నే చంద్రబాబు నాయుడు కూడా అధికారికంగా పార్లమెంటు సభ్యుల సమావేశంలో చెప్పారు. వైసీపీ లిక్కర్ స్కాంను పార్లమెంటులో ప్రస్తావించడంతో పాటు వీలయినంతగా ప్రచారం చేయాలని కూడా సూచనప్రాయంగా చెప్పారు. ఈనేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది. దుబాయ్ కేంద్రంగా లిక్కర్ స్కాం ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు చెబుతున్నారు.
Read More
Next Story