ఉక్కు ప్రైవేటీకరణపై వైసీపీ ఉద్యమ కార్యాచరణ!
x
పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న బొత్స సత్యనారాయణ

ఉక్కు ప్రైవేటీకరణపై వైసీపీ ఉద్యమ కార్యాచరణ!

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ యత్నానికి వ్యతిరేకంగా వైసీపీ వివిధ రూపాల్లో ఉద్యమానికి శ్రీకారం చుట్టనుంది.

ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్‌కే తలమానికమైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయకుండా వైసీపీ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్టు శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆదివారం విశాఖలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ బొత్స ఏమన్నారంటే?


సమావేశానికి హాజరైన వైసీపీ శ్రేణులు

కూటమి ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు త్రీవంగా ప్రయత్నిస్తోంది. దీనిMని వ్యతిరేకిస్తూ ఉద్యమ కార్యాచరణతో పాటు త్వరలో ఒక రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇతర పార్టీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సర్వసభ్య సమావేశంలో నిర్ణయించాం. విశాఖపట్నానికి చెందిన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను లులూ మాల్‌ తదితర ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేయడంపై కూడా ఉద్యమ కార్యాచరణను చేపడ్తాం. జీవీఎంసీలో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్, కమిషనర్లకు వినతి పత్రాలు ఇవ్వడానికి, పార్టీ బూత్‌ నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని విభాగాల కమిటీలు ఏర్పాటు చేయాలని కోరాం’ అని పేర్కొన్నారు. అంతకు ముందు పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన అంశాలపై శ్రేణులతో నాయకులు విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని నిర్ణయించారు. పార్టీ కార్యకర్తలు, శ్రేణులపై కూటమి నేతల ఆగడాలను అడ్డుకుంటూ గట్టిగా నిలబడాలని నొక్కిచెప్పారు.
ప్రజల పక్షాన నిలుస్తూ వారి సమస్యల్లో పాలుపంచుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి వెన్నుదన్నుగా నిలవాలని సూచించారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ పటిష్టానికి అంతా కృషి చేయాలని కోరారు. విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబూరావు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్, మొల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్‌ దేవన్‌రెడ్డి, శాసనమండలి సభ్యుడు కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తరెడ్డి, చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ,రాష్ట్ర అనుబంధ విబాగాల అధ్యక్షుడు జాన్‌వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
Read More
Next Story