
ఈవీఎంల ధ్వంసం కేసులో దొరికిపోయిన పిన్నెల్లి?
ఓ ప్రజాపతినిధి ఇంతటి అసాధారణ చర్యకి దిగవచ్చా? ఇదేపని ఓ సామాన్యుడు చేస్తే ఎక్కడుండేవారు? పోలీసులు, అధికారులు చూస్తూ ఊరుకుంటారా?
ఓ ప్రజాపతినిధి ఇంతటి అసాధారణ చర్యకి దిగవచ్చా? ఇదేపని ఓ సామాన్యుడు చేస్తే ఎక్కడుండేవారు? పోలీసులు, అధికారులు చూస్తూ ఊరుకుంటారా? సర్కార్ ఆస్తిని ధ్వంసం చేశారని తక్షణమే కేసు పెట్టి కటకటాల వెనక్కి నెట్టివారు కాదా? ఎన్నికలు జరిగి వారం రోజులైనా ఇంతవరకు అటు పోలింగ్ అధికారులు గానీ ఇటు పోలీసులు గాని ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను చుట్టుముట్టిన ప్రశ్నలివి. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తప్పు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పిన్నెల్లి ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) మెషీన్‌ను ధ్వంసం చేసినట్టు ఆలస్యంగా వెలుగులోకి రావడంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. పోలింగ్ స్టేషన్‌లోనే నేలకు విసిరేసికొట్టినట్టు CCTV ఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ విధంగా ఆ ఎమ్మెల్యే ఏడు పోలింగ్ కేంద్రాల్లో స్వైరవిహారం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) ఎమ్మెల్యేలను ధ్వంసం చేశారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కోరినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
మరోపక్క, ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఈ తీరును నిరసిస్తూ ఎన్నికల సంఘానికి ఉత్తరాల పర్వం మొదలు పెట్టారు. ఓటమి భయంతోనే ఆ శాసనసభ్యుడు, వైఎస్సార్‌సీపీ నేతలు ఇలాంటి విధ్వంసానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. చావుకబురు చల్లగా చెప్పినట్టు ఆ ఎమ్మెల్యే పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ సీట్లకు ఈనెల 13న ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే , వైసీపీ మాచర్ల నియోజకవర్గ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి వీవీపాట్లను, ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు వీడియోలలో రికార్డ్ అయింది. మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఎన్నికల తర్వాత కూడా చెదురుమదురు ఘటనలు జరిగాయి. హింసాయుత వాతావరణం నెలకొంది.
వీడియోలో ఏముందంటే...
మాచర్ల నియోజకవర్గ ఎన్నికపై పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం సీసీ కెమెరాల ఫుటేజీని ఎన్నికల సంఘం అధికారులు పరిశీలించారు. మాచర్ల నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలోకి వెళుతున్నట్లు వీడియో ఫుటేజీలో చూడవచ్చు. ఈయన వస్తున్నప్పుడు అక్కడో అధికారి లేచి నిల్చుని ఎన్నికల అధికారి ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నేరుగా ఈవీఎం ఉంచిన రక్షిత ప్రాంతంలోకి వెళ్లారు. వీవీప్యాట్‌ని తీసుకొని చాలా బలంగా నేలపైకి విసిరి కొట్టడం సీసీ ఫుటేజీలో చూడవచ్చు. దీంతో మెషిన్ పగిలి ఒక ముక్క కిందపడింది. ఈ సమయంలో ఒకరు అడ్డంపోగా రామకృష్ణారెడ్డి లాగి చెంపదెబ్బకొట్టినట్టు ఆ వీడియోలో ఉంది. వెనక్కి నెట్టిపడేశారు. ఎమ్మెల్యేని ఆపడానికి ప్రయత్నించినా అలివికాలేదన్నట్టుగా ఆ వీడియో ఉంది. ఈవీఎంలను కాల్తో తన్నాడు. బయటకు వెళ్లే ముందు తనను అడ్డగించిన వ్యక్తిని బెదిరించేలా వేలు చూపినట్టు తెలుస్తోంది.
ఇది జరిగిన తర్వాత ఓ ఎన్నికల అధికారి నేలపై పడి ఉన్న VVPATని పైకి తీసినట్టు వీడియోలో ఉంది.
‘మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఆయనపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతో ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంలను పగలగొట్టినందుకు ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనుంది.
మాచర్ల అసెంబ్లీ నియోజక వర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాలతోపాటు పీఎస్ నంబర్ 202లో కూడా ఈవీఎంలను ధ్వంసం చేసినట్టు కెమెరాలో రికార్డ్ అయినట్టు ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది.
"ఈ విధ్వంస ఘటన బయటపడిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో వీడియో ఫుటేజీని పరిశీలించాలని కోరుతూ ఫుటేజీని పోలీసులను ఆదేశించింది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం (ఈసీ) ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ ఘటనలకు పాల్పడిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా పోలీసు డైరెక్టర్ జనరల్‌కు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు ఆ ఎమ్మెల్యేను నిందితునిగా కేసు నమోదు చేశారు. 'భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని ఈసీ భావిస్తోంది' అంటూ మీనా తన లేఖలో పేర్కొన్నారు.
ఓటరును చెప్పుతో కొట్టారా?
పోలింగ్ రోజున శాసనసభ్యుని ప్రవర్తన బాగా లేదన్న ఫిర్యాదులు కూడా అందాయి. పోలింగ్ నాడు క్యూలోకి దూసుకొచ్చిన ఎమ్మెల్యేకు అభ్యంతరం చెప్పిన ఓ ఓటరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెప్పుతో కొట్టారని కూడా ఫిర్యాదులు అందాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ఎన్నికల అనంతర హింసాత్మక సంఘటనల కారణంగా జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత కూడా 25 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రంలో ఉంచాలని ఎన్నికల సంఘం కేంద్ర హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
Next Story

