జనసేనకు క్యూ కట్టిన వైసీపీ నేతలు- సామినేని వైసీపీకి గుడ్ బై
వైసీపీకి దెబ్బమీద దెబ్బ తగిలే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ఓటమితో ఆ పార్టీ నాయకులు అనేక మంది జనసేనకు క్యూ కట్టారు.
వైసీపీకి దెబ్బమీద దెబ్బ తగిలే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ఓటమితో ఆ పార్టీ నాయకులు అనేక మంది జనసేనకు క్యూ కట్టారు. ఇప్పటికే జగన్ సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎలియాస్ వాసు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు అదే కోవలో మరికొంత మంది ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కళ్యాణ్ నాయకత్వం వహిస్తున్న జనసేన వైపు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుంగు అనుచరులుగా ఉన్నవారే కావడం గమనార్హం. తాజా సమాచారం ప్రకారం జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన తన రాజీనామా పత్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. సెప్టెంబర్ 20న అంటే శుక్రవారం ఆయన తన అనుచరులతో భేటీ అవుతున్నారు. అనుచరులతో మీటింగ్ తర్వాత ఆయన తన భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తారని చెప్పినప్పటికీ ఇప్పటికే ఆయన పవన్ కల్యాణ్ తో భేటీ అయినట్టు సమాచారం. ఈనెల 22న పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతారని ఉదయభాను అనుచరులు చెబుతున్నారు.
ఇంకా పలువురు కూడా జనసేన వైపు చూస్తున్నారు. వారిలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు ఉన్నారు. ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి వీరందరూ గుంబనంగా ఉంటున్నారు. పార్టీ సమావేశాలకు హాజరుకావడం లేదు. వైఎస్ జగన్ ఇటీవల గుంటూరు పర్యటనకు వెళ్లినపుడు కూడా రోశయ్య ఆవైపు చూసిన దాఖలాలు లేవు. కిలారు రోశయ్య వైసీపీ కీలకనేత, పార్టీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు. ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు అయిపోయినప్పటి పార్టీకి దూరంగా ఉన్నారు. సుదీర్ఘకాలం గుంటూరు మిర్చియార్డు పాలకవర్గంలో సభ్యునిగా మిర్చియార్డు ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో, వైసీపీ సీనియర్ నాయకుడుగా ఉన్న ఉదయభాను ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే. రెండుసార్లు ప్రభుత్వ విప్ గా వ్యవహించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు జనసేనలో చేరనున్నారు. ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జనసేన నేతలు చెబుతున్నారు. సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య- వీరిద్దరూ పవన్ కల్యాణ్ సామాజిక వర్గానికి చెందినవారే.