
ఢిల్లీకి చేరిన కురుపాం పచ్చకామెర్ల ఘటన
కురుపాం దుర్ఘటన మీద జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు.
కురుపాం గిరిజన గురుకుల పాఠశాలల బాలిలకలు కలుషిత నీరు తాగి పచ్చకామెర్ల బారిçన పడటం, ఇద్దరు బాలికలు మరణించడం సంఘటన ఢిల్లీకి చేరింది. దీనిని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని వైసీపీ నాయకులు ఓ అడుగు ముందుకేశారు. అందులో భాగంగా సోమవారం వైసీపీకి చెందిన ఎస్టీ నాయకుల బృందం ఢిల్లీ వెళ్లింది. ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం నిర్లక్షం వల్లే గిరిజన విద్యార్థులకు ఈ దుస్థితి నెలకొందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రక్షిత మంచి నీరు, మంచి ఆహారం అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేదని, దీని వల్ల కలుషిత నీరు, మలం కలిసిన నీరు తాగాల్సిన దాపురించిందని, దీని వల్ల గిరిజన బాలికలు మరణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో బాలికలు పచ్చకామెర్ల వ్యాధి బారిన పడ్డారని వివరించారు.
సంఘటన జరిగిన తీరును, గురుకులంలో ఉన్న సమస్యలను, వాటిని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిన తీరును జాతీయ మావన హక్కుల సంఘానికి వివరించారు. ఈ క్రమంలో గిరిజన విద్యార్థుల హక్కులను కాపాడాలని సంఘానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో స్పందించిన జాతీయ మానవ హక్కుల సంఘం ఫిర్యాదును స్వీకరించింది. పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు గురుమూర్తి, తనూజారాణి, మాజీ డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర, ఇతర నాయకులు ఉన్నారు.