
పవన్ కు వైసీపీ సవాల్
విశాఖ సభలో స్టీల్ ప్లాంట్ పై వైఖరి చెప్పాలని బొత్స డిమాండ్
విశాఖపట్నం లో జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి భారీ ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో వైసీపీ ట్విస్ట్ ఇచ్చింది.విశాఖ వేదికగా జరిగే సమావేశంలో స్టీల్ ప్లాంట్ భవితవ్యంపై పవన్ కల్యాణ్ కార్యాచరణ ప్రకటించాలని వైసీపీ సీనియర్ నేత , మాజీమంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.. స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రజా సంఘాలతో కలిసి ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.అందులో భాగంగా విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ సమావేశంలోనూ వైసీపీ నేతలు తీర్మానం కోసం డిమాండ్ చేసారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ లో తాజాగా 32 విభాగాలను ప్రయివేటీకరణ దిశగా టెండర్లు జారీ చేసిన నేపధ్యంలో డిప్యూటీ సీఎం పవన్ లక్ష్యంగా బొత్సా కీలక డిమాండ్ తెర మీదకు తెచ్చారు.కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు.స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని శాసన మండలి సాక్షిగా పవన్, లోకేష్ చెప్పారని బొత్సా గుర్తు చేసారు. కూటమి నేతలు ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగదని చెప్పారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రభుత్వ వైఖరి చెప్పాలని కోరారు. ఈ నెల 30వ తేదీన విశాఖలో జరిగే జనసేన సభలో పవన్ స్టీల్ ప్లాంట్ పైన తన వైఖరి ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు.
ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా గిన్నీస్ రికార్డుల కోసం చూశారని, విశాఖ స్టీల్ కార్మికుల భవిష్యత్ గుర్తు రాలేదని ఎద్దేవా చేశారు.
ఉద్యమ దిశగా వైసీపీ
రాజకీయ, ప్రజా - కార్మిక సంఘాలను కలుపుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటాలు చేయాలని వైసీపీ నిర్ణయించింది. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని బొత్సా స్పష్టం చేసారు. అవసరం అయితే, ప్రధాని వద్దకు వెళ్తామని బొత్సా వెల్లడించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా చూస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలను వదిలే ప్రసక్తే లేదని బొత్స స్పష్టం చేశారు.
కీలకమైన స్టీల్ ప్లాంట్ వంటి సమస్యలను గాలికి వదిలేసి ,కూటమి ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు చేస్తూ రచ్చకెక్కతున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు.
Next Story