
కృష్ణమ్మ ఒడిలో యోగాలో ప్రపంచ రికార్డు
వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డును ఎన్టీఆర్ జిల్లా వాసులు సొంతం చేసుకున్నారు.
విజయవాడ నగరంలోని బెరం పార్కు వద్ద కృష్ణమ్మ తీరం వెంట నిర్వహించిన వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగా ప్రంపంచ రికార్డు సాధించింది. యోగా ప్రియులు విశేషంగా తరలిరావడంతో కృష్ణమ్మ పులకించింది. బెరం పార్కుకు చేరుకున్న విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ-పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన యోగా ఔత్సాహికులు పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 201 వాటర్ క్రాఫ్టులతో పాటు నదీ తీర ప్రాంతంలో ఏర్పాటుచేసిన పచ్చని తివాచీలపై 2,000 మంది యోగాసనాలు వేయడంతో కృష్ణమ్మ ఒడి పులకించింది.
ప్రపంచ రికార్డు సాధించాలన్న జిల్లా యంత్రాంగం ఆశయం నెరవేరింది. యోగాసనాలను ఆద్యంతం నిశితంగా పరిశీలించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్‌యూ) న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్.. యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, యోగాసనాలను ఆచరించిన విధానం, తరలివచ్చిన ఔత్సాహికులను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రపంచ రికార్డు సాధించినట్లు వేలాది మంది హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
ఓ నదిలో అత్యధిక మందితో వివిధ రకాల అత్యధిక బోట్లపై యోగాసనాలు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నట్లు ధృవీకరిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ-పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంలకు సర్టిఫికెట్ అందించారు.
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నేతృత్వం, ఆయన బృందం అపూర్వ కృషికి ఫలితం ప్రపంచ రికార్డు అని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్‌యూ) న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్ పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమష్టి కృషి, నిబద్ధత ఫలితంగా పవిత్ర కృష్ణా నదీ తీరం సరికొత్త ప్రపంచ రికార్డుకు వేదికయిందన్నారు. ఇన్నొవేషన్, హెల్త్, ఫిట్‌నెస్‌తో పాటు పర్యావరణ పరిరక్షణపట్ల జిల్లా అధికార యంత్రాంగం, ప్రజల చిత్తశుద్ధికి ఇది గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. ఐక్యత, శ్రేయస్సు, సంస్కృతీ సంప్రదాయాల పట్ల నిబద్ధతను చాటిచెప్పేలా ఈ రికార్డుతో విజయవాడ ప్రజలు గొప్ప సందేశాన్ని ఇచ్చారని.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు షరీఫ్ హానిఫ్ తెలిపారు.