
ఐదు లక్షల మంది ఎదుట లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన
వచ్చే నెల 2న ప్రధాని మోదీ అమరావతిలో అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపనతో పాటు లక్ష కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేస్తారు.
పెట్టుబడుల ఆకర్షణ శక్తిగా ఏపీ ఎదగాలంటే ప్రధాన మంత్రితో హడావుడి తప్పని సరి అని చంద్రబాబు నాయుడు భావించారు. అందులో భాగంగానే రెండో సారి అమరావతి పనుల శంకుస్థాపనకు ప్రధాని మోదీని అమరావతికి పిలిపిస్తున్నారు. మోదీ వచ్చి కొన్ని పనులకు శంకుస్థాపనలు చేస్తే మరి కొన్ని కంపెనీల వారు పెట్టుబడులతో ముందుకు వస్తారనే ఆలోచనలో సీఎం ఉన్నారు. విశాఖపట్నంలో ఇటీవల పీఎం మోదీ వచ్చినప్పుడు సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి సుమారు లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన చేయించారు. అలాగే వచ్చేనెల 2న జరిగే అమరావతి సభలోనూ లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన చేసే విధంగా ప్లాన్ చేశారు.
అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు
రాజధాని అమరావతి పునర్మిర్మాణ పనుల ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అమరావతి పనులు రీలాంచ్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన ప్రధాని మోడీ అమరావతికి రానున్నారు. ప్రధాని పర్యటన విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. తాజాగా పురపాలక మంత్రి నారాయణ అమరావతి లో ప్రధాని పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభావేదిక వద్దకు వెళ్లేందుకు అవసరమైన రోడ్ల ను పరిశీలించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో కలిసి మంత్రి నారాయణ పలు రోడ్లను పరిశీలించారు.
అమరావతిని అడవిగా మార్చిన వైఎస్సార్సీపీ
2014-19 మధ్య అమరావతి నిర్మాణానికి ఐదువేల కోట్లపైగా ఖర్చుపెట్టారు. పలు రోడ్లను కూడా నిర్మించారు. గతంలో అమరావతి శంఖుస్థాపన ప్రధాని నరేంద్రమోడీ చేతులమీదుగా జరిగింది. గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాటతో ఎక్కడా రాజధాని లేకుండా నిర్వీర్యం చేసింది. అమరావతి ప్రాంతాన్ని అడవిలా మార్చేసింది. సీఎం చంద్రబాబు అధికారం చేపట్టగానే అమరావతిలో పర్యటించి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసారు. 64 వేల కోట్లతో టెండర్లు పిలవడానికి అథారిటీలో నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకూ రూ. 41 వేల కోట్ల పనులకు టెండర్లు పూర్తయి, పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రధాని చేతుల మీదుగా ఈ పనులు పునఃప్రారంభించాలని సీఎం నిర్ణయించారు.
ఐదు లక్షల మంది సభకు వచ్చేలా చర్యలు..
సుమారు 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి తగినట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. E- 11, E- 13, E- 15 రోడ్లతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి రాకపోకలు జరుగుతాయి. ఇప్పటికే పోలీస్ శాఖ రోడ్లు పరిశీలించి గుంతలు పూడ్చాలని కోరింది. ప్రధాని సభకు వచ్చే వాహనాల కోసం మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 8 రోడ్ల ద్వారా సభా వేదిక వద్దకు ప్రజలు చేరుకునేలా ఏర్పాట్లు జరిగాయి.
మంగళగిరి నుంచి రెండు రోడ్లు. తాడేపల్లి నుంచి ఒకటి, వెస్ట్ బైపాస్ నుంచి ఒకటి, ప్రకాశం బ్యాంరేజి నుంచి రెండు, తాడికొండ నుంచి ఒకటి, హరిశ్చంద్రాపురం నుంచి ఒక రోడ్డు ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ సూచనల మేరకు రెండు రోజుల్లోగా రోడ్లన్ని సరిచేయాలని సీఆర్డీఏ అధికారులకు ఆదేశించినట్లు మంత్రి పి నారాయణ చెప్పారు.
30న ఎస్పీజీ పరిశీలన
ప్రధాన మంత్రి ప్రత్యేక రక్షణ దళం ఎస్పీజీ వారు ఈనెల 30న అమరావతికి రానున్నారు. అక్కడ చేసిన ఏర్పాట్లు, సభ వద్ద రక్షణ ఎలా ఉండబోతోందనే అంశాలను తెలుసుకుంటారు. ఏవైనా మార్పులు ఉంటే డీజీపీకి సూచిస్తారు. వారు సూచించిన మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత సెక్రటేరియట్ వెనుక భాగాన ఈ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి.