
2025లో మంటలు పుట్టించిన మాటలివే..
మాటలు మంటలు పుట్టిస్తాయా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందా? 'రప్పారప్పా' రచ్చరేపిందా!
2025 లో మూడు పదాలు మంటలు పుట్టించాయి. ఎంత ఫేమస్ అయ్యాయో అంత వివాదాస్పదమూ అయ్యాయి. ఏ స్క్రిప్ట్ రైటర్ రాయలేనంత ఉత్కంఠభరితమైన డైలాగులు,వ్యాఖ్యలు అవి. సోషల్ మీడియాలో రచ్చ లేపాయి. ఏడాది చివరికి వచ్చినా రకరకాల వ్యాఖ్యలు ఆ పదాలపై వస్తూనే ఉన్నాయి. సౌండ్స్ చేస్తూనే ఉన్నాయి.
అవేమిటంటే 'రప్పా, రప్పా, 'సామాన్లు, రెడ్ బుక్'.
రప్పారప్పా.. మోత మోగిపోయింది!
ఈ ఏడాది జూన్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వెళ్లినపుడు ఓ బ్యానర్ వెలిసింది. దానిపైన "రప్పా రప్పా నరుకుతాం.. చెక్కేస్తాం.. తొక్కుకుంటూ పోతాం" అని దానిపైన ఉంది. అప్పుడు తొలిసారిగా వినపడిన మాట ఆ తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రుల నోట వినపడుతూనే ఉంది. "రప్పారప్పా" అనే పదం ఒక్కసారిగా స్టేట్ మొత్తాన్ని ఊపేసింది. దీనిపై తొలుత స్పందిన వారు పయ్యావుల కేశవ్. "రప్పా రప్పా అని ఎవరిని నరుకుతారు? ప్రజలనా?" అని నిలదీశారు. ఇదేమన్నా రాజారెడ్డి రాజ్యాంగమా? సినిమా డైలాగులా? అని మంత్రి పయ్యావుల జగన్ ను సూటిగా ప్రశ్నించారు.
వాస్తవానికి ఇది పుష్ప-2 సినిమా డైలాగు.
జగన్ కూడా దీనిపై స్పందించారు. ‘రప్పా.. రప్పా’ డైలాగ్ వాడారు. రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని ఆ డైలాగ్ ఉన్న పోస్టర్ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై మాట్లాడుతూ జగన్... గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పారప్పా నరుకుతాం.. అని పుష్ప సినిమాలో డైలాగ్ ను చెప్పారు. పుష్ప సినిమా డైలాగులు, పుష్పా సీన్లు, తగ్గేదేలే పుష్పా అని మేనరిజరం ప్రదర్శించినా కేసులు పెడతారా చంద్రబాబు? అని జగన్ ప్రశ్నించారు.
ఈ వివాదం అంతటితో ఆగలేదు. టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. "రప్పా రప్పా నరుకుతాం.. చెక్కిస్తాం.. తొక్కుకుంటూ పోతాం" అని అంటున్న ఉన్మాదులను జగన్ నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారని టీడీపీకి చెందిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీ తన పేరును "రప్పా రప్పా పార్టీ"గా మార్చుకోవాలని, హింస, అక్రమాలతో మునిగిపోయిన ఆ పార్టీ గొడ్డలిని ఎన్నికల చిహ్నంగా స్వీకరించాలని ఎద్దేవా చేశారు.
రప్పా రప్పా అంటే ఎవరిని వదిలిపెట్టం అనిహోం మంత్రి అనిత, ఎవర్ని రప్పారప్పా నరుకుతారు, రఫ్ ఆడిస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.
దీనికి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తూ వచ్చారు. మాజీ మంత్రి పేర్ని నానీ ఏమన్నారంటే.. రప్పా, రప్పా అనడం కాదు.. చీకట్లో కన్నుకొడితే పనైపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చీకట్లో పనైపోవాలంటూ నాని అనడంపై.. అధికార కూటమి నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి.
ఇక ఈ పదం ఆంధ్రకే పరిమితం కాలేదు. తాజాగా తెలంగాణలో 'రప్పా రప్పా' రాజకీయాలకు తెరలేపారు. సూర్యాపేటలో కలెక్టరేట్‌కు వెళ్ళేదారిలో కాంగ్రెస్ రప్పా- రప్పా అంటూ మంత్రి ఉత్తమ్ యువశక్తి పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. గతంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఫొటోతో రప్పా రప్పా పోస్టర్లు వెలిశాయి.
ఇక రెండోది..'సామాన్లు, దరిద్రపు ముం..' అనే అభ్యంతరకర పదాలు. నటుడు శివాజీ ‘దండోరా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ డ్రసింగ్ విధానంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పొట్టి పొట్టి బట్టలు కాకుండా, 'సామాన్లు" కనిపించే విధంగా కాకుండా కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అన్నారు.
ఇపుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. నిజంగా ఆడవాళ్ళ అందం అనేది చీరల్లో, నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది. అప్పుడే వారి గౌరవం పెరుగుతుంది. పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే పైకి నవ్వుతూ బాగుంది అంటారు. కానీ లోపల మాత్రం దరిద్రపు ముం**, ఇలాంటి బట్టలెందుకు వేసుకున్నావ్, మంచివి వేసుకోవచ్చుగా బాగుంటావుగా అని తిట్టుకుంటారు. మళ్లీ ఇలా అంటే స్త్రీ స్వాతంత్ర్యం లేదా స్వేచ్ఛ లేదా అంటారు....” అన్నారు శివాజీ. ఆ పదాలు గత వారం రోజులుగా పెను వివాదాన్ని సృష్టించాయి. ఆయన క్షమాపణ చెప్పినా వివిధ వర్గాల నుంచి తీవ్ర కామెంట్లు వస్తూనే ఉన్నాయి. కేసు కూడా నమోదు అయింది. మహిళా కమిషన్ విచారణకు పిలిపించింది.
రెడ్ బుక్ vs బ్లూ బుక్: అసలైన ఆట!
ఇక ఎన్నికల వేళ లోకేష్ నోట వచ్చిన మాట "రెడ్ బుక్". 2025లో ఇది ఓ రేంజ్ లో టెన్షన్ క్రియేట్ చేసింది. తప్పు చేసిన వారి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి, వడ్డీతో సహా చెల్లిస్తాం అనే హెచ్చరికలు కూటమి నేతల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రేపినా ఆ పదం తీవ్ర వివాదమే రేపింది. వైఎస్ జగన్ మొదలు సీపీఐ, సీపీఎం నేతల వరకు ఇది ప్రజాస్వామ్యమా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి పోటీగా వైఎస్ జగన్ ఓ అడుగుముందుకు వేసి "బ్లూ బుక్"ను మేమూ తయారు చేస్తున్నాం అన్నారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
'రెడ్ బుక్' క్రేజ్ నడుస్తుండగానే సినీనటుడు బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' మళ్లీ తెరపైకి వచ్చింది. .
'పవన్ కళ్యాణ్ తాలూకా..' ఎఫెక్ట్..
గత ఏడాది చివర్లో మొదలైన "పవన్ కళ్యాణ్ తాలూకా" అనే హ్యాష్ ట్యాగ్ ఈ ఏడాది కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఎక్కడ చూసినా, ఏ ఊళ్లో చూసినా "మేమంతా పవన్ కళ్యాణ్ తాలూకా" అని చెప్పుకోవడం ఒక బ్రాండ్‌గా మారిపోయింది.
మొత్తానికి "రప్పారప్పా" అని మొదలైన ఈ రాజకీయ ప్రయాణం.. "అన్‌స్టాపబుల్" మెజారిటీతో, ప్రత్యర్థుల "సామాన్లు" సర్దేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది.
2025 ముగుస్తున్నా ఈ పదాల తాలూకు ప్రతిధ్వని ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇక 2026లో ఏ కొత్త పదం పుట్టుకొస్తుందో? ఎవరి స్క్రిప్ట్ 'రఫ్ ఆడిస్తుందో'? ఎవరి లెక్కలు 'రప్పారప్పా' తేలతాయో వేచి చూడాల్సిందే!
Next Story

