
తొక్కిసలాట జరిగిన ప్రదేశం
కాశీబుగ్గ తొక్కిసలాటకు ‘స్త్రీ శక్తీ’ తోడైంది!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆఅయంలో ఈనెల ఒకటిన జరిగిన తొక్కిసలాటకు ‘స్త్రీ శక్తి’ పథకం కూడా తోడైందని వెల్లడైంది.
అంతా అనుకున్నట్టే అయింది. ఈనెల ఒకటో తేదీన శ్రీకాకుళం జిల్లా కాశీబుబ్గ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ప్రభుత్వం విచారణకు త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీలో టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, అదనపు ఎస్పీ కేవీ రమణ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్‌లున్నారు. వీరు ఈ ప్రమాదంపై పది రోజుల పాటు సమగ్రంగా విచారణ జరిపారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరగడానికి కారణాలను ఈ కమిటీ సభ్యులు తేల్చారు.
ఆలయంలో తొక్కిసలాట జరిగిన రోజు భక్తులు
విచారణలో ఏం తేల్చారంటే?
కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటకు దారి తీసిన పరిస్థితులు, అందుకు కారణాలను విచారణ కమిటీ సభ్యులు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. అందులో మహిళలకు ఉచిత బస్సు (స్త్రీ శక్తి) పథకం కూడా ఇందుకు ఓ కారణమని పేర్కొన్నారు. ఈ పథకం అమలులోకి వచ్చాక గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు దేవాలయాలకు పోటెత్తుతున్నారు. ఆరోజు (నవంబరు 1న) ఏకాదశి తిథి, కార్తీకమాసం, శనివారం కావడంతో భక్తులు పర్వదినంగా భావించారు. ఆ పుణ్యదినాన కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుంటే పుణ్యఫలం దక్కుతుందంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టారు. ఫలితంగా బస్సులు ఎలాగూ ఉచితమే కదా? అన్న భావంతో బస్సుల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఆ ఆలయానికి చేరుకున్నారు. పైగా ఆరోజు మధ్యాహ్నం 12 గంటల వరకే స్వామి దర్శనానికి అనుమతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆలయం లోపల భక్తులు ఎక్కువగా ఉండడంతో 11.30 గంటలకు బయట ఉన్న ప్రవేశ మార్గాన్ని మూసివేశారు. ప్రవేశ ద్వారానికి ముందున్న భక్తులు, దర్శనం ముగించుకుని బయటకు వచ్చే మార్గంలోకి ఒక్కసారిగా వచ్చేశారు. దీనిని గమనించిన ఆలయ సిబ్బంది బయటకు వచ్చే మార్గాన్ని క్లోజ్ చేసేశారు. ఆలయంలో స్వామిని దర్శనం చేసుకున్న వారిని బయటకు పంపడానికి గేటు తీశారు. ఇంతలో ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి అక్కడే వేచి ఉన్న భక్తులు ప్రవేశించారు. ఇలా భక్తుల రాకపోకలకు ఒకటే మార్గం కావడంతో తొక్కిసలాటకు దారి తీసిందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. కాగా ఈ తొక్కిసలాటలో మరణించిన తొమ్మిది మందిలో ఎనిమిది మంది మహిళలే కావడం విశేషం. అలాగే ఆరోజు ఈ ఆలయానికి సుమారు 15 వేల మంది భక్తులు వచ్చారు. అందులో 80 శాతానికి పైగా మహిళలే ఉన్నారు.
ఇంకేమి లోపాలను ఎత్తి చూపారంటే?
తొక్కిసలాటకు మరికొన్ని లోపాలను కూడా కమిటీ ఎత్తి చూపింది. ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని, భద్రతా ప్రమాణాలు పాటించలేదని వివరించింది. బారికేడ్లు, రెయిలింగ్‌లు అంతగా నాణ్యత లేనివి ఏర్పాటు చేశారని, భక్తులు తరలి వచ్చిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వలేదని కూడా నివేదికలో స్పష్టం చేసింది.
కాశీబుగ్గ ఘటన కనువిప్పు కలిగిస్తుందా?
ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేలా స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏసీ, లగ్జరీ, డీలక్స్ బస్సులు మినహా మిగిలిన అన్ని బస్సుల్లోనూ వీరు ఫ్రీగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది. అదిగో ఇక అప్పట్నుంచి మహిళలు తండోపతండాలుగా బస్సులెక్కడం మొదలెట్టారు. చిన్న చిన్న పనులకు కూడా వీరు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఎలాగూ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కావడంతో గతంలో పురుషులు చేసే పనులను కూడా ఎక్కువగా మహిళలే చేస్తున్నారు. ఇక గుడులు, గోపురాల సందర్శనలకైతే చెప్పాల్సిన పనిలేదు. ఇన్నాళ్లూ తీర్థయాత్రలకు వెళ్లాలంటే ప్రయాణ చార్జీలు తడిసిమోపెడయ్యేవి. ఆ భారాన్ని భరించలేని పేద, మధ్య తరగతి మహిళలు అవసరమైనప్పుడే యాత్రలకు వెళ్లేవారు. ఇప్పడు రాష్ట్రంలో ఎక్కడికైనా ఫ్రీ బస్సుల్లో ప్రయాణించే ఛాన్స్ దొరకడంతో పుణ్యక్షేత్రాల సందర్శనకు ఎగబడుతున్నారు. ఇలా బస్సులే కాదు.. దేవాలయాలు కూడా మహిళామణులతో కిటకిటలాడుతూ దర్శనమిస్తున్నాయి. కాశీబుగ్గ వంటి తొక్కిసలాటకు కారణమవుతున్నాయి. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన అటు ప్రభుత్వానికి, ఇటు మహిళలకు కనువిప్పు కలిగిస్తుందో లేదో చూడాలి మరి!
Next Story

