
దుర్గమ్మలా మహిళా ఎమ్మెల్యేలు అలంకరణ
దసరా నవరాత్రుల సందర్భంగా పసుపు రంగు చీరలతో అసెంబ్లీ సమావేశాలకు మహిళా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవాలయం నవరాత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దసరా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని కూటమి పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు నవరాత్రుల డ్రెస్ కోడ్‌ను పాటిస్తూ పసుపు రంగు చీరలతో సభకు హాజరయ్యారు. నవరాత్రుల్లో అమ్మవారు ప్రతి రోజు ఒక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని, అందుకు అనుగుణంగా రోజుకు ఒక రంగు దుస్తులను ధరించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు.
గురువారం, నవరాత్రుల్లో నాలుగో రోజు, అమ్మవారు శ్రీ కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ రోజు పసుపు రంగు దుస్తులు ధరించడం ఆనవాయితీగా ఉంది. ఈ నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యేలు పసుపు రంగు చీరలతో అసెంబ్లీకి హాజరై, సంçస్కృతి, సంప్రదాయాలపై ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ డ్రెస్ కోడ్‌ను పాటించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, సమృద్ధిగా ఉండాలని దుర్గమ్మను ప్రార్థించాం. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ డ్రెస్ కోడ్‌ను అనుసరిస్తున్నాం అని ఒక మహిళా ఎమ్మెల్యే తెలిపారు.
ఈ ఏడాది దసరా నవరాత్రులు సెప్టెంబర్ 23న ప్రారంభమై, అక్టోబర్ 2న విజయదశమితో ముగియనున్నాయి. ఈ తొమ్మిది రోజుల పాటు దేవి తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ, భక్తులు పూజలు, వ్రతాలతో అమ్మవారిని సేవిస్తారు. అసెంబ్లీలోని ఈ డ్రెస్ కోడ్ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
Next Story