కలెక్టర్, ఎస్పీలకి హెల్మెట్ అక్కర్లేదా
x

కలెక్టర్, ఎస్పీలకి హెల్మెట్ అక్కర్లేదా

సోషల్ మీడియాలో వైరల్ గా మారిని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీ బుల్లెట్ పై ప్రయాణం ఫొటోలు.


శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ బుల్లెట్ బైక్ పై ప్రయాణించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తిలో చేపట్టిన పనులను పరిశీలించడానికి బుధవారం ఉదయం ఇద్దరు ఉన్నతాధికారులు బుల్లెట్ పై వెళ్లారు. జిల్లా పోలీస్ ట్విటర్ అధికారిక ఖాతా నుంచి పోస్ట్ చేసిన ఫోటోల్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ బైక్ నడుపుతున్నట్టు, వెనుక సీట్ పై ఎస్పీ సతీష్ కుమార్ కూర్చున్నట్టు కనిపిస్తున్నాయి.

కానీ దీనిపైన నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించకుండా ప్రయాణించడం ఏంటని స్థానికులు, నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించాలని ప్రజలకు చెప్పేవారే హెల్మెట్ ధరించకుండా ప్రయాణించడం ద్వారా సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అయితే అధికారులు ఈ విషయంపై ఇంకా స్పందన ఇవ్వలేదు.

శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు అధికారిక సోషల్ మీడియాలో ఇలా ఉంది.

శ్రీ సత్య సాయి జిల్లాలో ఇవాళ ఒక ప్రత్యేక దృశ్యం కనిపించింది — జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ స్వయంగా బుల్లెట్‌పై పర్యటించి పుట్టపర్తి పట్టణంలో జరుగుతున్న శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. తమ హోదాలను పక్కన పెట్టి, ఇద్దరూ ద్విచక్రవాహనంపై పుట్టపర్తి వీధుల్లో విస్తృతంగా పర్యటించి, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల పనులను సమీక్షించారు.
పార్కింగ్ ఏరియాలు, లైటింగ్, త్రాగునీరు, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రత.. ప్రతి అంశాన్ని గమనించి అధికారులు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి ఈనెల 13 లోగా యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ లు మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్తు శాఖ అధికారులకు ఈ సూచనలు చేశారు. పార్కింగ్ ఏరియాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలి, చెత్త తొలగించి పరిశుభ్రతను కాపాడాలి, రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేయాలి, సైన్ బోర్డులు, హెల్ప్‌డెస్క్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి, ప్రతి పార్కింగ్ వద్ద తగినంత లైటింగ్ & త్రాగునీరు 24x7 అందుబాటులో ఉండాలి, ప్రతీ శాఖ సమన్వయంతో శ్రద్ధగా పనిచేస్తూ, పుట్టపర్తిని భగవాన్ సత్య సాయి శత జయంతి ఉత్సవాలకు సిద్ధం చేయాలనే కలెక్టర్ గారు, ఎస్పీ గారి దృఢ సంకల్పాన్ని ఈ పర్యటన ప్రతిబింబించింది.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు సువర్ణ, మహేష్, ఆర్టీఓ కరుణసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, పబ్లిక్ హెల్త్ డిఈ నరసింహ, డిపిఓ సమత, తహసీల్దార్ కళ్యాణ్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.


Read More
Next Story