పవన్ కల్యాణ్ సాయంతో ఎస్సీ వర్గీకరణ చేస్తా- చంద్రబాబు
x

పవన్ కల్యాణ్ సాయంతో ఎస్సీ వర్గీకరణ చేస్తా- చంద్రబాబు

"ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా. ఏ జిల్లాలో ఏ వర్గం ఎక్కువుంటే వారికి ప్రాధాన్యత. అందరికీ న్యాయం చేస్తా"నంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు


"ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా. ఏ జిల్లాలో ఏ వర్గం ఎక్కువుంటే వారికి ప్రాధాన్యత. ఒక్కో జిల్లాలో మాదిగలు ఉండవచ్చు. మరోచోట మాలలు ఉండవచ్చు. అందరికీ న్యాయం చేస్తా"నంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిన నేపథ్యంలో చంద్రబాబు ఈ మాట చెప్పారు. మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలకు సాగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరుకు ఆనాడు చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మంద కృష్ణ మాదిగను అక్కున చేర్చుకుని ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరిగ్గా ఈనేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలోనే తొలిసారిగా వర్గీకరణ బిల్లును శాసనసభలో పెట్టి ఆమోదం తెలుపుతూ ఎస్సీలలో మాదిగలకు 9 శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడి వంతు వచ్చింది.
ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర అసెంబ్లీ మార్చి 20న బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. శాసనసభ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు (chandrababu) తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు (SC Sub Classification) కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పామన, ఆ మాట నిలబెట్టుకుంటున్నామని అన్నారు.
అసెంబ్లీలో ఆయన ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. "అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పాను. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంటుంది. జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగీరిల విభజన చేసేందుకు సిద్ధంగా ఉన్నాం" అన్నారు చంద్రబాబు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
"ఏబీసీడీ కేటగీరి విభజన కోసం 1996లో కమిటీ వేశాం. ఉమ్మడి ఏపీలో రేషనలైజేషన్‌, కేటగీరిలపై 2000 సంవత్సరంలో చట్టం చేశాం. ఆ చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మెహ్రా కమిషన్‌ నివేదిక ఇచ్చింది. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసింది. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో నా ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగింది. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉండటం నా అదృష్టం.
సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్‌. పేదల కోసం శాశ్వత గృహనివాస పథకం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఆయన. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరం. అంటరానితనం నిషేధానికి జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ను నేనే వేశా. అంటరానితనం రూపుమాపడానికి ఎన్నో జీవోలు జారీ చేశాం. ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఏర్పాటు చేశాం. హోటళ్లు, మంచినీటి బావుల వద్ద వివక్ష పాటించకుండా చట్టపరంగా చర్యలు తీసుకున్నాం. సాంఘిక సమానత్వంపై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించాం.
లోక్‌సభ స్పీకర్‌గా ఒక దళితుడిని చేసిన పార్టీ తెలుగుదేశం. స్పీకర్‌గా బాలయోగి ఎంతో బాగా రాణించారు. దళిత మహిళ ప్రతిభా భారతిని స్పీకర్‌ చేసిన ఘనత కూడా తెలుగుదేశానిదే. ఎస్సీ అయిన కాకి మాధవరావును రాష్ట్ర సీఎస్‌గా చేసింది టీడీపీనే. నేను యునైటెడ్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు ఎస్సీ అయిన కేఆర్‌ నారాయణన్‌ను రాష్ట్రపతిని చేశాం.
కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎస్సీ, ఎస్టీలకు కీలక పదవులు ఇచ్చింది. గతంలో ఎస్సీ అయిన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేశారు. ఇప్పుడు ఎస్టీ అయిన ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిగా చేసింది.
ఎస్సీ కోసం రూ.8,400 కోట్లతో ఆర్థిక చేయూత పథకాలు తీసుకువచ్చాం. గతంలోనూ మాల, మాదిగ సామాజిక వర్గాలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా. నా రాజకీయ జీవితమంతా పేదలకు న్యాయం చేసేందుకే కృషి చేశాను. ఎస్సీ వర్గీకరణ అంశంలో మాకు సహకరించిన పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా" అని చంద్రబాబు అన్నారు.
Read More
Next Story