తెలుగులో జీవోలతో తెలుగు పరిరక్షణ
ఇటీవల జరిగిన తెలుగు మహాసభల ప్రభావం కూటమి ప్రభుత్వంపై పడింది. తెలుగు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ కల్యాణ్ మాట్లాడారు. తెలుగుజీవోలకు శ్రీకారం.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం జారీ చేసే అధికారిక ఉత్తర్వులు(గవర్నమెంట్ ఆర్డర్లు(జీవోలు)) ఇక నుంచి తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించారు. ఇంగ్లీషుతో పాటుగా తెలుగులోను జారీ చేయనున్నారు. అంతేకాకుండా వీటిని ఆంధ్రప్రదేశ్ జీవోఐఆర్ వెబ్ సైట్‌లోను అప్‌లోడ్ చేయనున్నారు. ఇంగ్లీషు జీవోలతో పాటు తెలుగు ఉత్తర్వులను కూడా అప్‌లోడ్ చేయనున్నారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ జీఏడీ శాఖ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇంగ్లీషుతో పాటు తెలుగులో వచ్చిన జీవోలను ఏపీజీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఐటీ శాఖను ఆదేశించింది. ఇంగ్లీషు జీవోను అప్‌లోడ్ చేసిన ఒకటి, రెండు రోజుల్లో తెలుగు జీవోను అందుబాటులోకి తేవాలని, తొలుత తెలుగు జీవోను అప్‌లోడ్ చేస్తే..తర్వాత ఇంగ్లీషు జీవోను అప్‌లోడో చేయాలని ఆదేశించింది. దీంతో పాటుగా రెండు జీవోలను ఒకే సారి అప్‌లోడ్ చేసే వెసులుబాటు ఉండే విధంగా చూడాలని సూచించింది. అయితే తెలుగు భాషలో జీవోలను తేనున్నట్లు శుక్రవారం తెలుగులో జారీ చేసిన జీవోను ఇంగ్లీషు, తెలుగు భాషల్లో అప్‌లోడ్ చేసి తెలుగు జీవోల అమలుకు శ్రీకారం చుట్టింది.