మద్యం సంపాదనలో ‘గీత’ దాటు తారా?
ప్రభుత్వం కల్లు గీత కార్మికుల కోసం ప్రత్యేంగా బ్రాంది షాపులు కేటాయించింది. దరఖాస్తులకు నోటిఫికేషన్ వచ్చింది.
కల్లు గీసి బతికే కార్మికులు చాలా వరకు తగ్గారు. గతంలో వీరిలోనే ఎక్కువ మంది మద్యం వ్యాపారులుగా ఉండే వారు. ఈత, తాటి చెట్లు బాగా తగ్గాయి. ఎప్పుడైతే చెట్లు బాగా తగ్గాయో రాయలసీమ ప్రాంతంలో కల్లు కావాలంటే కల్తీ కల్లే దిక్కని స్థానికులు చెబుతున్నారు. ఇక గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కోస్తా తీరంలోని కొందరు కల్లు గీత కార్మికులు వృత్తిని బాగా తగ్గించారు. వారి పిల్లలు బాగా చదువుకోవడం, విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేస్తుండటంతో కల్లు గీయడం చాలా మంది మానేశారు. అయితే మద్యం వ్యాపారంలో గౌడ్స్ ఎక్కువగా ఉంటూ వచ్చారు. తీర ప్రాంతాల్లో బడా బాబుల చేతుల్లోనే మద్యం వ్యాపారం ఉంది.
జగన్ హయాంలో కిక్కురు మనని మద్యం వ్యాపారులు
గత ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతుందని, ప్రైవేట్ వారి జోక్యం అవసరం లేదని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే దుకాణాలు నడిచాయి. దీంతో చాలా మంది మద్యం వ్యాపారులు వేరే రాష్ట్రాలను వెతుక్కుంటూ పోయారు. మద్యం సేవించే వారు జగన్ ను తిట్టని రోజంటూ లేదు. ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడతాయనగా మద్యం షాపుల వద్ద అయిపోయిందిరా.. జగన్ పని ఇక మద్యానికి ఇబ్బంది లేదంటూ కామెంట్లు కూడా చేసుకోవడం విశేషం.
ప్రైవేట్ వారిని రంగంలోకి దించిన చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేట్ వారికి మద్యం దుకాణాలు ఇవ్వాలని గత ప్రభుత్వ పాలసీని మార్చారు. డిపాజిట్లు సేకరించి లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు. అయితే మద్యం వ్యాపారంలో ఎప్పటి నుంచో ఉంటున్న కల్లు గీత సామాజిక వర్గాల వారికి తప్పని సరిగా రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనకు వచ్చారు. అందుకే 335 షాపులు గీత పనివారలకు రిజర్వు చేశారు. కొద్ది నెలలు ఆగిన తరువాత మంగళవారం గీత కార్మికుల కోసం రిజర్వు చేసిన షాపులకు నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తుల డిపాజిట్ లు కూడా తగ్గించారు. మొత్తం కల్లు గీత సామాజిక వర్గాల్లో 10 ఉప కులాలు ఉన్నట్లు తేల్చారు.
ఒక్కో కులానికి ఎన్ని షాపులంటే..
శెట్టి బలిజ లకు 79, గౌడ కు 78, ఈడిగ 67, గౌడ్ 59, యాత 15, శ్రీశయన 14, గాండ్ల 9, శెగిడి 8, గామల్ల 5, కలాలీ కులానికి ఒక షాపు వంతున కేటాయించారు. వీరికి ఏడాదిన్నర కాలం పాటు షాపులు నిర్వహించు కునేందుకు అవకాశం ఉంది. 2026 సెప్టెంబరు 30 వరకు లైసెన్స్ లు ఉంటాయి. విషయం ఏమిటంటే సంపాదనలో వీరు అందరికంటే ముందుంటారా? లేక సిండికేట్లలో కలుస్తారా? అనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.