‘ఉక్కు’ను ముక్కలు ముక్కలు చేసి ముంచేస్తారా?
x
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌

‘ఉక్కు’ను ముక్కలు ముక్కలు చేసి ముంచేస్తారా?

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అంపశయ్యపైకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ ప్లాంట్‌ను నిలబెడతామంటూనే ప్రైవేటీకరణ ముమ్మరం చేస్తోంది.


నష్టాల బూచి చూపిస్తూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నాలుగన్నరేళ్ల క్రితం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. నూరు శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన ఉక్కు కార్మికులు, ఉద్యోగులతో పాటు ఉత్తరాంధ్ర వాసులను ఉలికిపాటుకు గురి చేసింది. ఈ పరిణామాన్ని నిరసిస్తూ ప్లాంటు కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌లు వీరి వద్దకు పరుగు పరుగున వచ్చి సంఘీభావం తెలిపారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్లాంట్‌ ప్రైవేటు పరం కాకుండా చూస్తామని, ఢిల్లీతో పోరాడతామని ప్రగల్భాలు పలికారు. ఆ తర్వాత ఉక్కు కార్మికులు చేపట్టిన నిరసన దీక్షల్లోనూ పాలుపంచుకున్నారు. అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ లాలూచీ పడి కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయారని, తాము అధికారంలోకి వస్తే కేంద్ర మెడలు వంచి స్టీల్‌ ప్లాంట్‌ను రక్షిస్తామని విమర్శలు గుప్పించారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్లాంట్‌ను పరిరక్షిస్తామని హామీలిచ్చారు.

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న కార్మికులు

కూటమి అధికారంలోకి రాగానే..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన నేతలు స్వరం మార్చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములు కావడంతో వీరు కేంద్రంపై పోరు బాటకు బదులు లాజిక్‌లు మాట్లాడడం మొదలెట్టారు. అష్టకష్టాలు జనవరిలో రివైవల్‌ ప్యాకేజీ కింద రూ.11,400 కోట్లను విడుదల చేయించారు. దీంతోనే స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నట్టు హడావుడి చేశారు. ఈ నిధులను ప్లాంట్‌ అప్పులు, వడ్డీలు, ఇతరత్రా వాటికే ఖర్చు చేశారు తప్ప ప్లాంట్‌కు ఒక్క పైసా వెచ్చించలేదు. దీంతో ప్లాంట్‌ ఆర్థిక పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ కర్మాగారంలోని శాశ్వత కార్మికులకు వీఆర్‌ఎస్‌ ఇస్తూ ఇంటికి పంపించడం మొదలు పెట్టింది. ఇలా తొలిదశలో 1100 మంది, మలిదశలో మరో వెయ్యి మందిని వదిలించుకోవడానికి వీఆర్‌ఎస్‌ ప్రక్రియ చేపట్టింది. సుమారు నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను ఉన్నఫళంగా తొలగించేసింది. పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో కొత్త నియామకాలను నిలిపేసింది. జీతాలను పూర్తిగా చెల్లించడం మానేసింది. ఒకపక్క ప్లాంట్‌ ప్రైవేటీకరణకు, మరోపక్క కార్మికుల ఉద్వాసనకు వ్యతిరేకంగా, జీతభత్యాల కోసం కార్మికులు పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది. వీరి పోరాటానికి ఆది నుంచీ వామపక్ష పార్టీలు పూర్తిగా మద్దతునిస్తున్నాయి. వైసీపీ నేతలు వీరికి సంఘీభావం తెలుపుతున్నారు తప్ప ఇటీవల కాలంలో రోడ్డెక్కి ఆందోళనలు చేయడం లేదు. త్వరలోనే ఉక్కు పరిరక్షణకు ఉద్యమాన్ని చేపడ్తామని వైసీపీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కొన్నాళ్ల క్రితం విశాఖ వచ్చి కార్మికుల రిలే నిరాహర దీక్షల్లో ఒకరోజు పాల్గొని సంఘీభావం తెలిపారు.

ఉక్కు కార్మికులకు సంఘీభావంగా వామపక్షాల ర్యాలీ (ఫైల్‌)

ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులు..
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు పట్టువదలని విక్రమార్కుల్లా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అటు కేంద్రం కూడా అంతకు మించిన పట్టుదలతో ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారంలో 44 వరకు వివిధ విభాగాలున్నాయి. వీటిలో ఇప్పటికే టోటల్‌ మెయింటెనెన్స్‌ చెందిన నాలుగు విభాగాల పనులను ప్రైవేటుకు అప్పగించారు. ప్రైవేటీకరణ వ్యవహారం ఇంకా పెండింగులో ఉండగానే తాజాగా ఈ ప్లాంట్‌లో మరో 32 విభాగాల పనులను ప్రైవేటు పరం చేయడానికి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)కి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో కీలకమైన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ సిస్టమ్స్, స్లాగ్‌ గ్రాన్యులాటిన్‌ ప్లాంట్లు, గనులు, బ్లాస్ట్‌ ఫర్నేస్‌ కూలింగ్‌ ఫర్నేస్‌ పరికరాలు, చార్జింగ్‌ యూనిట్లు వంటివి ఉన్నాయి. ఇవి కూడా ప్రైవేటు పరం చేస్తే భవిష్యత్తులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు మార్గం సుగమం అవుతుందని కార్మికులు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.
తగ్గేదే లే అంటున్న కేంద్రం..
మరోవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని ఇటీవల రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దీన్ని బట్టి ఈ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తథ్యమని కేంద్రం తెగేసి చెప్పినట్టయింది. మరోవైపు ప్లాంట్‌లో 32 విభాగాలను ప్రైవేటుకు అప్పగించడానికి సిద్ధమవడం కూడా ప్రైవేటీకరణలో భాగమేనన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మౌనంగా ఉండడంతో ప్రైవేటీకరణకు సమయం అనుకూలంగా ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
కూటమి నేతల అడ్డగోలు బుకాయింపులు..
విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ వైపు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంటే.. కూటమి నేతలు మాత్రం అలాంటిదేమీ లేదని అడ్డగోలుగా బుకాయిస్తున్నారు. సాక్షాత్తూ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రే ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోలేదని అధికారికంగా ప్రకటించినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. మంత్రి లోకేష్, విశాఖ ఎంపీ భరత్, ఇతర మంత్రులు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందని నమ్మబలుకుతున్నారు. ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారంతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టించొద్దని ఎదురు దాడి చేస్తున్నారు. మరికొన్ని సార్లు ప్లాంటు బాగు కోసం సలహాలిమ్మంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలైతే తమ అధినేత పవన్‌ కల్యాణ్‌ వల్లే ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిచి పోయిందని ప్రకటించారు. చీటికీ, మాటికీ గతంలో ఇచ్చిన రూ.11,400 కోట్ల ప్యాకేజీనే వీరంతా వల్లె వేస్తున్నారు.
సొంత గనుల ఊసెత్తరేమి?
విశాఖ స్టీల్‌ ప్లాంటుకు సొంత గనులు కేటాయించడం ద్వారా లాభాల బాట పడుతుందని ఉక్కు కార్మికులతో పాటు ఎందరో నిపుణులు చెబుతూనే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం సొంత గనులను కేటాయించడం లేదు. లేనిపక్షంలో ఈ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో విలీనం చేస్తే దీని మనుగడకు ఢోకా ఉండదని కార్మికులు కోరుతున్నారు. దీనినీ కేంద్రం పెడచెవిన పెడుతోంది. కూటమి నేతలు వీటి గురించి కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. పైగా విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలార్‌ మిట్టల్‌. నిప్పన్‌ స్టీల్‌ ఏర్పాటు చేస్తున్న ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని ముఖ్యమంత్రి ఇటీవల కేంద్రాన్ని కోరి విమర్శల పాలయ్యారు. దీనిపై వస్తున్న విమర్శలను సైతం కూటమి నేతలు పట్టించుకోకుండా ప్రైవేటు స్టీల్‌ ప్లాంట్‌ కోసం తపించిపోతున్నారు.

సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి

కొంప ముంచడానికే ముక్కలు చే స్తున్నారు..
విశాఖ ఉక్కు కొంప ముంచడానికే వివిధ విభాగాలను ముక్కలు చేసి ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. దొడ్డిదారిలో ప్రైవేటీకరణ ఎత్తుగడలో భాగమే ఇదంతా. క్రమంగా ప్లాంట్‌ను అంపశయ్య మీదకు తెస్తున్నారు. స్వయంగా కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపంసహరించుకోలేదని పార్లమెంట్‌ సాక్షిగా చెప్పారు. దీనికి కూటమి నేతలు ఏం చెబుతారు? కేంద్ర మంత్రి ప్రకటన అవాస్తవమంటారా? ఇప్పటికైనా కూటమి నేతలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. లేదంటే సొంత గనులు కేటాయించడమో, సెయిల్‌లో విలీనమో చేయాలి’ అని స్టీల్‌ ప్లాంట్‌ సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story