
బొబ్బిలి వీణ
బొబ్బిలి వీణ మూగబోతుందా?
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బొబ్బిలి వీణ భవిష్యత్తులో మనుగడ సాగించలేదా? ప్రభుత్వం వీణ తయారీదార్లను ఆదుకోని పక్షంలో వారు ఆ వృత్తిని వదిలేసే ప్రమాదం ఉందా?
వీణ వేణువైన సరిగమ విన్నావా..
ఓ..ఓ.. తీగ రాగమైన మధురిమ కన్నావా?
వీణ నాది.. తీగ నీది.. తీగ చాటు రాగముంది..
పువ్వు నాది పూత నీది.. ఆకు చాటు అందముంది..
మదిలో వీణలు మ్రోగే.. ఆశలెన్నో చెలరేగే..
కలనైన కనని ఆనందం.. ఇలలోన విరిసే ఈనాడే..
ఈ వీణపైన పలికిన రాగం.. నాలోన విరిసిన అనురాగం..
మీటితే మ్రోగేది రాగం.. ఎదమాటుగా పెరిగేది అనురాగం..
ఇలా సినీ గేయ ర చయితలు వీణపై పలు పాటలు రాశారు. ప్రేక్షకుల మదిలో వీణా మాధుర్యాన్ని నింపారు. అలాంటి వీణకు పుట్టినిల్లు ఉత్తరాంధ్రలోని బొబ్బిలి. అక్కడ తయారైన వీణలకు దేశంలో మరెక్కడా లేనంత ఖ్యాతి. అందుకే బొబ్బిలి అనగానే అందరికీ గుర్తొచ్చేది వీణలే. అక్కడ వీణల తయారీదార్ల నైపుణ్యం, వారు ఏక చెక్కతో తయారు చేసిన వీణల స్వరాలు వెరసి ఆ పేరును తెచ్చి పెట్టాయి. అయితే బొబ్బిలి వీణల గొప్పతనాన్ని ఆహా.. ఓహో అంటూ చెప్పే వారే గాని ఆ వృత్తిదార్లకు అవసరమైన ఆసరా అందించే వారే కరువయ్యారు. అందుకే ఈ వృత్తిదార్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆ ప్రభావం మున్ముందు వీణల తయారీపై పడే ప్రమాదం పొంచి ఉంది.
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నుంచి ఓడీవోపీ జాతీయ అవార్డును అందుకుంటున్న కలెక్టర్ అంబేడ్కర్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఒక జిల్లా–ఒక ఉత్పత్తి (ఓడీఓపీ) కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు పది ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు లభించాయి. వాటిలో పార్వతీపురం మన్యం జిల్లా బొబ్బిలి వీణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాతీయ అవార్డును ఈనెల 14న హస్తినలోని ప్రగతి మైదానంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందుకున్నారు.
బొబ్బిలి వీణకు అంకురార్పణ అలా..
దాదాపు మూడొందల ఏళ్ల క్రితం నాటి బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరును సందర్శించారు. మైసూరు సంస్థాన దర్బారులో వీణా కచేరిని విన్నారు. ఆనాడు వీణ తయారీలో మైసూరు వడ్రంగులు ప్రత్యేకతను చూపించేవారు. అది గమనించిన బొబ్బిలి రాజా తన సంస్థానంలోని ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించి వీణల తయారీలో మెళకువలను నేర్పించారు. అలా వీణ తయారీలో బొబ్బిలి రాణించడానికి అంకురార్పణ జరిగింది. మైసూరు తంజావూరు వీణలను మూడు కొయ్య ముక్కలను కలిపి తయారు చేసేవారు. కానీ బొబ్బిలి వడ్రంగులు మాత్రం ఏకండీ కొయ్య ముక్క (ఒకే చెక్క ముక్క)తోనే వీణను తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. అప్పట్లో పనస, సంపెంగ చెక్కలతో వీణ తయారు చేసే వారు. కాలక్రమంలో ఈ సంస్థానం కనుమరుగుయ్యాక సంపెంగ లభ్యత తగ్గిపోయింది. దీంతో పనస కర్రతోనే వీణల తయారీని కొనసాగిస్తున్నారు. దేశంలో బొబ్బిలి వీణకున్న పేరు ప్రఖ్యాతులు మరే ప్రాంత వీణకు లేదు.
సర్వసిద్ధి వారింట సరస్వతీ వీణలకు జీవం..
బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి కుటుంబీకులు వీణల తయారీ సంప్రదాయాన్ని, నైపుణ్యాన్ని తరతరాలుగా కొనసాగిస్తున్నారు. ఈ కుటుంబానికి చెందిన సర్వసిద్ధి అచ్చెన్న, చిన్నయ్యలకు ఒకనాడు వీణ తయారీపై వాదం పెరిగి, అదే పందెం వరకు దారి తీసిందని చెబుతారు. దాంతో అచ్చెన్న 8 నుంచి 10 అంగుళాల పొడవున్న వీణను తయారు చేసి పందెంలో నెగ్గాడట. అప్పట్నుంచి ఇప్పటి వరకు∙సర్వసిద్ధి వారు వీణల తయారీనే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నారు.
ఎన్నో గుర్తింపులు.. అవార్డులు..
బొబ్బిలి వీణకు 1980లో జాతీయ అవార్డు లభించింది. సర్వసిద్ధి వీరన్న వీణల తయారీలో ఉత్తమ వృత్తి కళాకారునిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి అవార్డును అందుకున్నారు. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బిలి వీణకు మురిసిపోయి సర్వసిద్ధి వెంకటరమణ అనే తయారీదారుని వైట్‌హౌస్‌కు రావాలని ఆహ్వానించారు. అయితే ఆయనను అమెరికా పంపేందుకు అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపలేదు. దీంతో భాష, ఆర్థిక సమస్యతో ఆయన కూడా యూఎస్ Ðð ళ్లలేకపోయారు. 2012లో బొబ్బిలి వీణకు భౌగోళిక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం బొబ్బిలి వీణతో తపాలా బిళ్లను, స్మారక నాణాలను కూడా విడుదల చేసింది. ఈమని శంకరశాస్త్రి వంటి ఎందరో వైణిక విధ్వాంసులు బొబ్బిలి వీణలకు ప్రాధాన్యం ఇచ్చేవారు.
వీణ తయారీలో కళాకారులు
బుల్లి బొబ్బిలి వీణలకు గిరాకీ..
మామూలుగా వాయించే వీణలకంటే బహుమతులుగా ఇచ్చే చిన్న వీణలకు ఎక్కువ గిరాకీ ఉంది. ఏటా 300 వరకు పెద్ద వీణలు ఇక్కడ తయారవుతాయి. బొబ్బిలిలోని గొల్లపల్లితో పాటు బాడంగి మండలం వాడాడలో కూడా వీణలు తయారు చేసే కుటుంబాలు 45 వరకు ఉన్నాయి. వీరు నెలకు 400 వరకు గిఫ్టు వీణలను తయారు చేస్తుంటారు. ఈ వీణలను లేపాక్షి సంస్థ మార్కెటింగ్ చేస్తోంది. గిప్టు వీణ తయారుకు రెండ్రోజులు పడుతుంది. ఒక్కో గిఫ్టు వీణ ను లేపాక్షి సంస్థ రూ.1,350కి కొనుగోలు చేస్తోంది. ఇందులో రూ.200 పెట్టుబడి పోగా రెండ్రోజులకు రూ.1,100 వరకు కూలీ మిగులుతుంది. పెద్ద వీణకు రూ.4 వేల పెట్టుబడి పెడితే రూ.10 వేల వరకు ఆదాయం వస్తుంది. ఒక వీణ తయారీకి కనీసం 20 రోజులు పడుతుంది. చిన్న (గిఫ్టు) వీణలు ఎన్ని తయారు చేసినా లేపాక్షి కొనుగోలు చేస్తుంది. అదే పెద్ద వీణలయితే ఆర్డరుపైనే తయారు చేస్తారు. ఈ వీణలు విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. ఏటా రూ. 25 లక్షల వరకు టర్నోవరు జరుగుతుందని అంచనా. రానురాను పనస కర్రకు కొరత ఏర్పడడంతో బొబ్బిలి వీణల తయారీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలో పనస మొక్కల పెంపకాన్ని చేపట్టింది. ఇవి అందుబాటులోకి రావడానికి మరో 25 ఏళ్ల సమయం పడుతుంది.
కళాకారులకు ఆహ్వానమే లేదు..
విచిత్రమేమిటంటే.. వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రాడక్ట్‌లో జాతీయ అవార్డుకు తమ బొబ్బిలి వీణ ఎంపికైందన్న సంగతి వాటిని తయారు చేసే కళాకారులకు సమాచారం లేదు. రాష్ట్ర మంత్రి, సంబంధిత అధికారులు ఈ సంగతిని మీడియాకు చెప్పారు. మీడియా ద్వారానే ఈ వీణా కళాకారులు తెలుసుకున్నారు. అంతేకాదు.. ఇంతలా రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన బొబ్బిలి వీణ తయారీదార్లలో ఒక్కరినీ ఆహ్వానించలేదు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడానికి వీరిని ఢిల్లీకి తీసుకెళ్లలేదు. కేవలం జిల్లా కలెక్టర్, మరికొందరు అధికారులు వెళ్లి అవార్డును అందుకుని వచ్చారు.
సర్వసిద్ధి రామకృష్ణ
గిట్టుబాటు కాని వీణల తయారీ..
తమ పూర్వీకుల నుంచి వచ్చిన వీణల తయారీ వృత్తిని సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. కానీ వీరి శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. రోజంతా కష్టపడితే రూ.500–600 ఆదాయం రావడం లేదని చెబుతున్నారు. వీణల తయారీకి అవసరమైన పనస కర్ర కొరత వీరిని వెంటాడుతోంది. దీంతో దళారులు తెచ్చే పనస కర్రనే వీరు కొనుగోలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. దేశ, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన బొబ్బిలి వీణ తయారీదార్లకు ప్రభుత్వం ప్రోత్సాహం కూడా లేదని చెబుతున్నారు. వీరి వృత్తికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు కూడా రాయితీలు ఇవ్వడం లేదు. పెట్టుబడి కూడా సమకూర్చడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు గిట్టుబాటు కాకపోవడం వంటి కారణాలతో ఈ వృత్తిపట్ల ఆసక్తిని తగ్గించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం వరకు వీణ తయారీ కుటుంబాలు 50కి పైగా ఉండగా ఇప్పుడవి 35కి తగ్గిపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ‘లేపాక్షి సంస్థ మేం తయారు చేసిన చిన్న వీణలను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం వీణల తయారీకి అవసరమైన ఆర్థిక తోడ్పాటునందించి ఈ తయారీదార్లను ఆదుకోవాలి’ అని వీణల కేంద్రం ఇన్‌చార్జి సర్వసిద్ధి రామకృష్ణ ‘ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో చెప్పారు.
Next Story