వైజాగ్‌లో పెట్టుబడుల వరద పారుతుందా?
x
సిద్ధమవుతున్న ప్రధాన వేదిక

వైజాగ్‌లో పెట్టుబడుల వరద పారుతుందా?

శుక్ర, శనివారాల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం ఊహించిన దానికి మించి పెట్టుబడులు వస్తాయా?

పార్టనర్‌షిప్‌ సమ్మిట్లు, భాగస్వామ్య సదస్సులు, గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్లు.. ఇలా పేర్లు వేరైనా వాటిని నిర్వహించే వారి లక్ష్యం ఒక్కటే! రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆకర్షించాలన్నదే టార్గెట్‌!! ఆంధ్రప్రదేశ్‌లోకి పెట్టుబడులు రావాలంటే ఇలాంటి సదస్సులు అవసరమని పాలకులు భావిస్తున్నారు. అందుకోసమే ఈ సమ్మిట్లను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు నాలుగు సమ్మిట్లు జరగ్గా, ఇప్పుడు జరగబోయేది ఐదవది. వీటిన్నిటికీ విశాఖే వేదిక. ఈ పార్టనర్‌షిప్‌ సమ్మిట్లకు ముందు ముఖ్యమంత్రి, మంత్రులు దేశ విదేశాల్లో పర్యటిస్తారు. ‘మా రాష్ట్రంలో వనరులు పుష్కలం.. పెట్టుబడులకు అనుకూలం. మీరు పెట్టుబడులు పెడితే బోలెడన్ని రాయితీలిస్తాం’ అంటూ ఊదరగొడతారు. రోడ్డు షోలు చేస్తారు. అక్కడి పాలకులు, ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. ఆయా దేశాలు, రాష్ట్రాల్లో మన వారి ‘షో’కి ఆకర్షితులైన వారు సానుకూలత వ్యక్తం చేస్తారు. అలాంటి వారిని పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌కు సాదరంగా ఆహ్వానం పలుకుతారు. ఇదీ పార్టనర్‌షిప్‌ సమ్మిట్లకు కొన్నాళ్ల ముందు జరిగే తంతు.

పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ జరిగే ఏయూ ఇంజినీరింగ్‌ గ్రౌండ్స్‌

సమ్మిట్లలో ఎంవోయూల ప్రహసనం..
ఇక సమ్మిట్లలో ఓ పెద్ద ప్రహసనమే జరుగుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలుకుతుంది. వారికి విశాఖలో స్టార్‌ హోటల్‌ సదుపాయాలు కల్పిస్తుంది. వారు ఆంధ్రప్రదేశ్‌లో ఏ పెట్టుబడులు పెట్టబోతున్నారు? దానివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? అందుకు ఎంత భూమి కావాలి? ఎక్కడ కావాలి? వంటివన్నీ ప్రభుత్వానికి నివేదిస్తారు. అందుకు సమ్మతించి ప్రభుత్వం వారికి రాయితీలతో కూడిన అనుమతులిస్తూ మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎంవోయూలు)లు కుదుర్చుకుంటుంది. ఇలా ప్రతి సమ్మిట్‌లోనూ వందల సంఖ్యలో ఎంవోయూలు జరుగుతాయి. వాటి విలువ లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఉద్యోగాల సంఖ్య కూడా లక్షల్లోనే కనిపిస్తుంది. ఈ అంకెల గారడీని చూసి అంతా ఔరా! మన రాష్ట్రానికి ఇంతటి వైభోగమా! అంటూ అచ్చెరువొందుతారు. పాలకులు కూడా ఈ సమ్మిట్‌ ద్వారా ఇన్ని రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నాం’ అంటూ గొప్పలు చెప్పుకుంటారు. జబ్బలు చరుచుకుంటారు.
గత సమ్మిట్లలో వచ్చిన పెట్టుబడులు ఎన్నంటే?
+ 2016లో విశాఖలో జరిగిన పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌లో రూ.4.78 లక్షల కోట్ల పెట్టుబడులకు 331 ఎంవోయూలు కుదిరాయి.
+ 2017లో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.10.54 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆ సమ్మిట్‌లో 665 ఎంవోయూలు జరిగాయి.
+ 2018 సమ్మిట్‌లో రూ.4.39 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చారు. 734 ఎంవోయూలు కుదుర్చుకున్నారు.
2019లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి 352 ఎంవోయూలు జరిగాయి. ఇలా ఈ నాలుగు సమ్మిట్ల ద్వారా ఆంధప్రదేశ్‌కు రూ.32.71 లక్షల కోట్ల పెట్టుబడులు సమకూరాల్సి ఉంది. అయితే ఇందులో సింహభాగం కాగితాలపైనే వచ్చాయి. వీటిలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయో ఆ పెరుమాళ్లకే ఎరుక.
ఈసారి పెట్టుబడుల లక్ష్యం రూ.10 లక్షల కోట్లు!
శుక్ర, శనివారాల్లో విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌–2025లో 410 ఎంవోయూల ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఈ పెట్టుబడులు, ఎంవోయూలపై ఒక స్పష్టత ఉంది. దానికనుగుణంగానే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు. 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెబుతోంది. మరో వాదన ప్రకారం.. ఈ సమ్మిట్‌లో రూ.10 లక్షల కోట్లకు మించే పెట్టుబడులకు ఒప్పందాలు జరుగుతాయని, అప్పుడు దానిని తమ అంచనాలకు మించే వచ్చాయని, విజనరీ సీఎం చంద్రబాబును చూసి ఈ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపారని చెప్పుకుంటారని అంటున్నారు.

సీహెచ్‌ నర్సింగరావు

ఇన్‌డైరెక్ట్‌ ఉద్యోగాలు బోగస్‌..
‘పరిశ్రమలు పెడ్తామని భూములు తీసుకున్న వారు పెట్టుబడులు పెడ్తామంటారు. కానీ ఏవో కారణాలు చెప్పి మిన్నకుంటారు. ఉదాహరణకు 2014లో రిలయెన్స్‌ సంస్థకు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో వెయ్యెకరాలిచ్చారు. ఒక్క ఎకరంలోనూ ఏమీ పెట్టలేదు. సెజ్‌ల్లో కొన్ని కంపెనీలకు ప్రభుత్వం కారు చౌకగా భూములు కేటాయించింది. అచ్యుతాపురం సెజ్‌లో లక్ష మందికి ఉద్యోగాలన్నారు. పది వేల మందికీ ఇవ్వలేదు. స్టీల్‌ప్లాంట్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ముంచేసి కొత్త వాటిని తెస్తామంటున్నారు. పార్టనర్‌షిప్‌ సమ్మిట్ల ద్వారా రూ.లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ఊదరగొడ్తున్నారు. కానీ వాస్తవానికి గ్రౌండ్‌ అయ్యేవి నామమాత్రమే. వీటితో ఇన్‌డైరెక్ట్‌ ఉద్యోగాలొస్తాయన్నది వట్టి బోగస్‌. పెట్టుబడుల పేరుతో చెప్పేవన్నీ వాస్తవాలు కావు. ప్రజలను పక్కదారి పట్టించడమే’ అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story