CPM | బెంగాల్ లో సీపీఎం జెండా మళ్లీ ఎగిరేనా? మధురైలో మహాసభలు షురూ!
x
సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పిస్తున్న దృశ్యం

CPM | బెంగాల్ లో సీపీఎం జెండా మళ్లీ ఎగిరేనా? మధురైలో మహాసభలు షురూ!

సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు తమిళనాడులోని మధురైలో కొద్దిసేపటి కిందట (ఏప్రిల్ 2 బుధవారం) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.


సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు తమిళనాడులోని మధురైలో ఏప్రిల్ 2న కొద్దిసేపటి కిందట అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహాసభల ప్రారంభానికి ముందు తమిళనాడు సంప్రదాయ పద్ధతిలో పార్టీ నేతలకు స్వాగతం పలికారు. మరోపక్క సాంస్కృతిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెణ్మణి అమరవీరులను స్మరించుకుంటూ కళాకారులు గీతాలు ఆలపించారు. వెణ్మణి అమరవీరుల స్మారక పతాకాన్ని కేంద్ర కమిటీ సభ్యులు యు.వాసుకి స్వీకరించి, పార్టీ సెంట్రల్‌ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ ఎకె. పద్మనాభన్‌కు అందజేశారు. మహాసభ ప్రారంభ సూచికగా సీనియర్‌ నేత బిమన్‌బసు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
సీపీఎం అగ్రనాయకత్వం

సీపీఎం అగ్రనాయకత్వం

రాబోయే మూడేళ్ల కాలానికి పార్టీకి దిశా, నిర్దేశం చేసేలా సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 2 నుంచి 6 వరకు ఐదు రోజుల పాటు కొనసాగే ఈ మహాసభలకు తమిళనాడులోని మదురై నగరం ఆతిథ్యం ఇస్తోంది.
మహాసభల వేదికైన కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నగర్‌ (మదురై కన్వెన్షన్‌ సెంటర్‌)లో కామ్రేడ్‌ కొడియెరి బాలకృష్ణన్‌ హాల్‌తో పాటు ఆహ్వాన సంఘం, వైద్య శిబిరం, కేంద్ర కమిటీ మీటింగ్‌ హాల్‌, మీడియా సెంటర్‌, అమర వీరుల స్థూపం, పుస్తక ప్రదర్శన, కమ్యూనిస్టు పార్టీ చరిత్రను తెలిపే ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక ఏర్పాటు అయ్యాయి.
తముక్కమ్‌ ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రను తెలిపే ప్రదర్శనను సీనియర్‌ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, పుస్తక ప్రదర్శనను సిపిఎం సీనియర్‌ నేత వి.పరమేశ్వరన్‌ ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌… కార్పొరేట్‌ శక్తులపైనా, మతోన్మాదం పైనా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆడిటోరియానికి కొడియేరి పేరు..
మదురై నగరంలో అడుగడుగునా సిపిఎం పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఇక్కడి కన్వెన్షన్‌ సెంటర్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేరు పెట్టారు. ద్వారానికి పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్‌ భట్టాచార్య పేరు పెట్టారు. ఆడిటోరియానికి పార్టీ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యులు కొడియేరి బాలక్రిష్ణన్‌ హాల్‌గా నామకరణం చేశారు.
మహాసభల్లో భాగంగా కారల్ మార్క్స్ విగ్రహాన్ని వేదికపై ఆవిష్కరించిన చిత్రం

మహాసభల్లో భాగంగా కారల్ మార్క్స్ విగ్రహాన్ని వేదికపై ఆవిష్కరించిన చిత్రం

పొలిట్‌ బ్యూరో సభ్యులు మాణిక్‌ సర్కార్‌ అధ్యక్షతన ప్రారంభ సభ జరుగుతోంది. మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు కె.బాలకృష్ణన్‌ స్వాగతోపన్యాసం చేశారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్‌ కరత్‌ ప్రారంభోపన్యాసం తర్వాత సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో పాటు సిపిఐ ఎంఎల్‌ (లిబరేషన్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్‌ భట్టాచార్య, ఫార్వర్డ్‌ బ్లాక్‌ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌ సౌహార్ద సందేశాలను ఇస్తారు.
పూర్వవైభవమే ప్రధాన అజెండాగా...
పార్టీకి పూర్వవైభవం తేవడమే ప్రధాన కర్తవ్యంగా ఈ మహాసభలు జరుగుతున్నాయి. సుదీర్ఘ కాలంపాటు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, త్రిపురలో పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఇప్పుడా రాష్ట్రాలలో ఎన్నికల బలాన్ని పునరుద్ధరించడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కేరళను నిలుపుకోవడం అనేది సీపీఎం ముందున్న ప్రధాన సవాల్. గత 15 ఏళ్లుగా పార్టీ క్షీణత తప్ప ఎదుగుదల లేని దశలో ఈ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి.
ఏప్రిల్ 2-6 వరకు జరగనున్న సభలో వివిధ అంశాలను చర్చించి, సమీక్షించి, ఆమోదించనున్న ముసాయిదా రాజకీయ తీర్మానంలోనూ ఈ అంశాన్నే ప్రధానంగా పేర్కొన్నారు. లోక్‌సభ ఫలితాలు పార్టీ ప్రజాపునాదిని, ప్రభావాన్ని పెంచలేదనే విషయాన్నే ఈ తీర్మానంలో ప్రస్తావించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులను నిలబెట్టిన సీపీఐ(ఎం) నాలుగు స్థానాలను గెలుచుకుంది. వాటిలో రెండు తమిళనాడు నుంచే ఒకటి మధురై రెండు దిండిగల్. కేరళలోని అలత్తూర్, రాజస్థాన్‌లోని సికార్ సీట్లు గెలిచారే తప్ప ఎక్కడైతే 26 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారో ఆ పశ్చిమ బెంగాల్, త్రిపురలో పార్టీ గెలవలేదు.
2011లో వామపక్ష కూటమి పశ్చిమ బెంగాల్‌ లో ఓడిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ గెలిచింది. 2018లో త్రిపురలో బీజేపీ చేతిలో సీపీఎం చేతిలో ఓడిపోయింది. 2014లో లోక్‌సభలో సీపీఎం బలం 9కి పడిపోయింది. 2019లో కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే సీపీఎం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు.
2004లో సీపీఎం 5.4 శాతం ఓట్లతో 43 మంది ఎంపీలను లోక్‌సభకు పంపితే అది ఇప్పుడు 1.9 శాతం ఓట్లతో కేవలం నాలుగు సీట్లకు పరిమితమైంది.

ఇక, మిగిలిన కేరళలో పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నా ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ నుంచి సవాల్ ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్‌లోనూ ఇదే పరిస్థితి. ఇండియా కూటమిలో సీపీఎం ఉన్నప్పటికీ అదే కూటమిలోని మరో కీలక భాగస్వామి తృణమూల్ కాంగ్రెస్ నుంచి సవాలును ఎదుర్కొంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ జాతీయ మహాసభలను నిర్వహించుకుంటోంది. పార్లమెంటు లోపల, బయట అంగీకరించిన అంశాలపై ఇండియా కూటమి పార్టీలతో ఎలా కలిసి పని చేయాలనే అంశాన్ని కూడా ఈ జాతీయ సభల్లో చర్చించనున్నారు.
బీజేపీ పాలనలో "నయా-ఫాసిస్ట్ లక్షణాలు" పెరగడాన్ని కూడా ముసాయిదా తీర్మానంలో పేర్కొన్నారు. ఇప్పటి దాకా బీజేపీని, ఆర్ఎస్ఎస్ ని ఫాసిస్టు శక్తులన్న పార్టీ ఇప్పుడు నయా ఫాసిస్టు అని అభివర్ణించడంపై కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దీనిపై కూడా సమావేశాల్లో తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది.

ఏప్రిల్ 3న, రాష్ట్ర హక్కులపై ప్రత్యేక సెమినార్ జరుగుతుంది. దీనిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక మంత్రి కృష్ణ బైరే గౌడ, ప్రకాష్ కారత్ ప్రసంగిస్తారు.
Read More
Next Story